Home సంపాదకీయం రైతుకు ఎంత మంచి చేస్తే.. అంత మేలు!

రైతుకు ఎంత మంచి చేస్తే.. అంత మేలు!

ఎన్నికలప్పుడు నాయకులిచ్చిన వాగ్దానాలను నమ్మేస్తుండడం, తీరా ఆ వాగ్దానాలు ఉత్తుత్తివే అని తేలినప్పుడు ఆవేదన చెందుతుండడం మనకు కొత్తేమీ కాదు. నమ్మించడం వారి వంతు.. నమ్మడం మన వంతు. ఇది ఎంతోకాలం నుంచి వస్తున్న తంతు. ప్రజలను ఏదోవిధంగా మభ్యపెట్టి పదవు లందుకోవాలనే తపనే ఇప్పుడు నాయకుల్లో అధికమవుతూ ఉండడం అందరికీ తెలిసిందే. చెప్పిన మాట నిలబెట్టుకోవడం అన్నది ఈ కాలానికి విరుద్ధమో ఏమో!. లేక, కలికాలపు రాజకీయాలు ఇలాగే ఉం టాయో ఏమో మరి!..మనదేశంలో ఇలాంటి వైఖరులవల్లే సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పుడు

ఉత్తరాదిన జరుగుతున్నది కూడా ఇదే. అక్కడ రైతులోకం ఇప్పుడు తీవ్ర ఆగ్రహంలో ఉంది. కారణం, అక్కడి ప్రభుత్వాలు తమ న్యాయమైన కోరికలు తీర్చడం లేదనే. ఏళ్ళు గడుస్తున్నా నాయకులిచ్చిన హామీలు నేటికీ నెరవేర్చడం లేదనే.

ఈ నెల1 నుంచి ఉత్తరాదిలో మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హరియానాల్లో రైతులతో పాటు చత్తీస్‌ఘడ్‌, కర్నాటక తదితర రాష్ట్రాల్లో కూడా రైతులు పెద్దఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ నెల 5 నుంచి రైతుల ఆందోళన మరింత ఉధృతం చేయాలని, 10న భారత్‌ బంద్‌ కూడా చేపట్టనున్నామని అఖిలభారత కిసాన్‌ సభ ప్రకటించింది కూడా. గత నెలలో ఇచ్చిన ఏ హామీనీ మహారాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, అందు వల్ల రైతుల ఆందోళన ముమ్మరం చేయాలని ఆ సంఘం నాయకులు నిర్ణయించారు. అనేక రాష్ట్రాల్లో రైతులు తమ బాధలు తీరుతాయని ఇంతకాలంగా ఎదురుచూసి విసిగిపోయారు. ఇక ఏ దారీ లేక రోడ్లెక్కి ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఎంతో కష్టపడి పండించుకున్న పంటను, కూరగాయల్ని తెచ్చి అసహనంతో రోడ్ల మీద కుమ్మరించేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూరగాయల ధరలు ఆకాశానికంటుతున్నాయి. చివరికి పాలసరఫరా కూడా నిలచిపోవడంతో పట్టణాలు, నగరాల్లోని ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. రైతుల కోరికలు కూడా న్యాయమైనవే. అవి గొంతెమ్మ కోరికలేమీ కాదు. వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, అన్నదాతలకు కనీస ఆదాయ పథకం అమలుచేయాలని, స్వామినాధన్‌ కమిటీ సిఫార్సులు అమలుచేసి తమ కష్టాలు తీర్చాలని, ఎరువుల ధరలు తగ్గించాలని వగైరా డిమాండ్లను నెరవేర్చాలని రైతులు ఎంతోకాలంగా కోరుతున్నారు. వాటిని ‘తప్పకుండా నెరవేరుస్తాం’..అని నాయకులు ఎప్పుడో హామీలు కూడా ఇచ్చివున్నారు.

అయితే, ఎప్పటికప్పుడు దాటవేత ధోరణితో రైతులను వారు అసహనానికి గురిచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఇక సమ్మె చేస్తే తప్ప తమ సమస్యల సాధనకు ప్రభుత్వాలు కదలవని రైతుసంఘాలతో కలసి రైతన్నలంతా సమ్మెకు సిద్ధమయ్యారు. దాదాపు వందకు పైగానే రైతు సంఘాలు కిసాన్‌ మహాసంఘ్‌ (ఆర్‌కెఎస్‌)గా ఏర్పడి రైతులకు రుణమాఫీ, మద్దతు ధర పెంపు తదితర డిమాండ్ల సాధన కోసం సమ్మెలోకి దిగాయి. గ్రామీణప్రాంతాల రైతాంగం కూడా సమ్మెకు మద్దతునిస్తుండడంతో దేశవ్యాప్తంగా మార్కెట్లు మరింత సంక్షోభంలో పడ్డాయి. పదిరోజులపాటు పట్టణాలు, నగరాలకు పాలు-కూరగాయలు బంద్‌ అంటే తట్టుకోవడం కష్టమే! ఇప్పటికే ఢిల్లీలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. అయితే, ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే. రైతులు తమ బాధలు తీరడం లేదంటూ కడుపుమండి రోడ్డెక్కితే…’ఇదంతా వారు కేవలం ప్రచారం కోసమే చేస్తున్నారంటూ’ కేంద్రంలోని ఒక మంత్రి అంటే, మరో మంత్రి ఇదంతా ‘ఒక పబ్లిసిటీ స్టంట్‌’ అంటూ బిజెపి మంత్రులు ఎకసక్కాలు పడుతుండడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది. కేంద్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు రైతులను ఇలా అవహేళనగా మాట్లాడుతుండడం రైతుల్లోనే కాదు, ప్రజల్లోనూ సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘అధిక వ్యవసాయ దిగుబడుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిం దంటూ’ మరో మంత్రి వింత వాదన రైతులను మరింత చిర్రెత్తిస్తోంది. ‘వాళ్లకి మరో పనేమీ లేదు. అర్ధంపర్ధం లేని ఆందోళన చేస్తున్నారు. పదిరోజుల పాటు వారు ఉత్పత్తులు ఆమ్ముకోకపోతే ఎవరికి నష్టం.. రైతులకే కదా’.. అంటూ హర్యానా ముఖ్య మంత్రి రైతులపై, రైతు సంఘాలపై విరుచుకు పడుతుండడం దేన్ని సూచిస్తున్నదో కేంద్రంలోని రాజకీయ విజ్ఞులకే తెలియాలి. కేంద్రం కూడా రైతు లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారి సమస్యలకు స్పందించక, ఏలినవారే నేరుగా విమర్శలకు దిగు తుండడం వింతపోకడ కాక ఏమవుతుంది?.. ఇలాంటి వాటివల్ల రైతుల నుంచి, ప్రజల నుంచి వ్యతిరేకతనే ఆ నాయకులు ‘మూట’కట్టుకోవాల్సి వుంటుంది తప్ప చివరికి సాధించేదేమీ వుండదు.

ఏదేమైనా రైతులకు అన్నివిధాల అండగా ఉంటామని చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వంలో, ఏళ్ళు గడుస్తున్నా రైతుల బతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం ఎంతో విచారకరం!…రైతుల రుణమాఫీ పథకాలు ఒక ప్రహసనంగా మారుతుండడం ఎంతో బాధాకరం!.. రైతుల కష్టాలు తీర్చకుండా… రైతులనే హేళనగా మాట్లాడుతుండడం దారుణం!.. ఇకనైనా అలాంటి తీరు మారాలి. రైతుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగిరావాలి. ఆరుగాలం కష్టించి పంట పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. దళారుల మాయాజాలం నుంచి, బడా వ్యాపారుల మోసాల నుంచి రైతులను రక్షించాలి. స్వామినాధన్‌ కమిటీ సిఫార్సులను అమలుచేసి వెంటనే రైతుల బాధలు తీర్చాలి. రైతు సౌభాగ్యమే.. దేశ సౌభాగ్యం కనుక… అందరికీ అన్నం పెట్టే అన్నదాతలను అన్ని విధాలా ఆదుకునేందుకు అటు నాయకులు, ఇటు పాలకులు, ప్రభుత్వాలు అందరూ కృషిచేయాలి. ఆ కృషి కూడా పదికాలాలపాటు కృషీవలురకు మేలుబాటలు పరిచేదిగా ఉండాలి. అప్పుడే రైతుకు మంచి చేసినట్లవుతుంది!…తద్వారా దేశానికీ మేలు జరుగుతుంది!..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here