Home సంపాదకీయం రెగ్యులర్‌ షోలను ఆపేసిన కామెడీ ఛానల్స్‌

రెగ్యులర్‌ షోలను ఆపేసిన కామెడీ ఛానల్స్‌

ప్రపంచ దేశాధినేతలకే రాజకీయ పాఠాలు నేర్పించే హైటెక్‌రత్న చంద్ర బాబునాయుడు నివాసానికి 30కిలో మీటర్ల దూరంలో వున్న విజయవాడ నగరం. భవానీపురంలోని ఎకసెక్కాల వెంకట్రావు ఇల్లు. వెంకట్రావ్‌ అప్పుడే బయట పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రిలాక్స్‌డ్‌గా సోఫాలో కూర్చుని టీవీ ఆన్‌ చేశాడు. తనకు ఇష్టమైన జెమిని కామెడీ ఛానల్‌ పెట్టాడు. ఆశ్చర్యం… ఆరోజు కామెడీ సీన్‌లు ప్రసారం కావడం లేదు. అంతలో వెంకట్రావ్‌ కొడుకు బంటీ వచ్చి డిస్నీ ఛానెల్‌ పెట్టాడు టామ్‌ అండ్‌ జెర్రీ చూద్దామని… కాని, దాంట్లోనూ ఏమీ రావడం లేదు. అంతలో కూతురు పింకీ వచ్చి కార్టూన్‌ ఛానెల్‌ పెట్టింది ‘డోరేమాన్‌’ చూద్దామని, కాని దాంట్లోనూ ఏమీ రావడం లేదు. వంటింటిలో నుండి వెంకట్రావ్‌ భార్య పంకజం వచ్చి ‘మొగలి రేకలు… మొగుడి కేకలు’ సీరియల్‌ చూద్దామని ‘జీ తెలుగు’ ఛానెల్‌ పెట్టింది. ఆ ఛానల్‌లోనూ సీరియల్స్‌ ఆపేసి వున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ అన్నీ ఎందుకు ఆపేసారో వెంకట్రావ్‌కు అర్ధం కావడం లేదు. కనీసం న్యూస్‌ ఛానల్స్‌ అన్నా వస్తున్నాయో లేదో అని చెప్పి ‘చంద్రజ్యోతి’ ఛానల్‌ పెట్టాడు. అప్పుడే ఆ ఛానల్‌ స్క్రీన్‌పై ఫ్లాష్‌ న్యూస్‌లో… ‘మరికొద్ది సేపట్లో నారా లోకేష్‌ విలేకరుల సమావేశం’, ‘తమ కుటుంబ ఆస్తులను ప్రకటించనున్న లోకేష్‌’, ‘తమ రెగ్యులర్‌ ప్రసారాలను ఆపేసి లోకేష్‌ ప్రెస్‌మీట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న కామెడీ, ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఛానెల్స్‌…’ స్క్రీన్‌పై ఈ ఫ్లాష్‌ న్యూస్‌ చూసాక వెంకట్రావ్‌కు విషయం అర్ధమైంది. లోకేష్‌ ఆస్తులను ప్రకటిస్తు న్నాడట… అంతకంటే కామెడీ సీన్‌ ఇంకోటి వుండదు. ఆయన ఆస్తులు ప్రక టించేటప్పుడు వేరే ఛానెల్స్‌ను జనాలు చూడరు… అందుకే అన్ని ఛానెల్స్‌ వాళ్ళు టిఆర్‌పి రేటింగ్‌ కోసం ఆయన ప్రెస్‌ మీట్‌నే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని భార్య పంకజంకు చెప్పాడు. అంతలో లోకేష్‌ రావడం, ప్రెస్‌మీట్‌ స్టార్ట్‌ చేయడం జరిగింది.

అమరావతిలోని తన ఛాంబర్‌లో లోకేష్‌ ప్రెస్‌మీట్‌ మొదలుపెట్టి… ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా ఆస్తులను ప్రకటించాలని మిమ్మల్ని అందర్నీ పిలిపించాను. నేనుగాని, మా నాన్నగారు గాని నీతి, నిజాయితీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వుంటాము. పాలు, కూరగాయలు అమ్ముకోవడం మా ప్రధాన వ్యాపారం. ఈ వ్యాపారంలో అప్‌ అండ్‌ డౌన్‌లు వుంటుంటాయి. కాబట్టి ఆస్థుల విలువల్లో హెచ్చుతగ్గులుంటుంటాయి. హైదరాబాద్‌లో ఒక ఇల్లు లక్షా నూట పదహారు రూపాయలు, నారావారిపల్లెలో ఇల్లు విలువ 10,116 రూపాయలు, ఇక ఇంట్లో ఒక బీరువా, సామ్‌సంగ్‌ సింగిల్‌ డోర్‌ సెకండ్‌హ్యాండ్‌ ఫ్రిజ్‌ విలువ 2వేలు, ఒక బీరువా 1500, రెండు ఫ్రేమ్‌ మంచాలు, రెండు నులకమంచాలు, ఒక ఫైబర్‌ డైనింగ్‌ టేబుల్‌, ఇండెస్టన్‌ గ్యాస్‌ స్టౌవ్‌, హెచ్‌పి సిలిండర్లు 2, ఉషా సీలింగ్‌ ఫ్యాన్‌లు 3, డయనోరా బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీ 1983 మోడల్‌ ఒకటి, 1987 మోడల్‌ హీరో ర్యాలీ సైకిల్‌ ఒకటి, అన్నం తినే స్టీలు గిన్నెలు ఐదు, నీళ్ళు తాగే గ్లాసులు 10, టీ తాగే గ్లాసులు 15, చెంబులు 2, అన్నం వండుకునే అల్యూ మినియం దబర్లు 4, నీళ్ళు కాసుకునే గంగాలం ఒకటి, నాకు 8 చొక్కాలు, 6 ఫ్యాంట్లు, 4 జాకీ డ్రాయర్‌లు, 4 రామ్‌ రాజ్‌ బనియన్‌లు మొత్తం ఆస్తి విలువ రెండు కోట్ల ఏడు లక్షలు… మా దేవాన్ష్‌ ఆస్థి విలువ 18కోట్లు… అని చెప్ప సాగాడు. అప్పుడు ‘మనస్సాక్షి టీవీ’ విలేకరి ధర్మానంద వుండి సార్‌, దేవాన్ష్‌ బాబు ఆస్తులు అంతగా ఎలా పెరిగాయని అడిగాడు. అందుకు లోకేష్‌… దేవాన్ష్‌ ప్యాకెట్‌ పాలు తాగడం మానేసాడు, అతను తాగకుండా మిగిలిన పాలను మార్కెట్‌లో అమ్మేయగా వచ్చిన డబ్బును అతని ఖాతాలోనే జమ చేస్తున్నాం… ఇలా మిగిల్చిన పాల ద్వారా వచ్చిన ఆస్తే 18కోట్లు అయ్యిందని చెప్పాడు. దేవాన్ష్‌ మిగిల్చిన పాల ద్వారానే ఇన్ని కోట్ల ఆస్థి వచ్చిందంటే ఇక మీ తండ్రి చంద్రబాబు మిగిల్చిన ఫుడ్డు ద్వారా ఇంకెన్ని కోట్ల ఆస్థి పెరిగి వుంటుందోనని ఏబిసి ఛానెల్‌ విలేకరి సూది సుబ్బారావు అడిగాడు. దానికి లోకేష్‌… ఆయనకు అంత సీన్‌ లేదు, మా ఇంట్లో దండగ తిండి తినేది మా నాన్నగారే… ఇంట్లో అందరం పాలు, కూరగాయలు అమ్మే వ్యాపారం చేస్తాం, మా నాన్నగారే ఎప్పుడూ ప్రజలు, ప్రజా సేవ అంటూ ఊర్లు పట్టి తిరుగు తుంటాడు. ఈమధ్య కొత్తగా ఇంకోటి నేర్చుకున్నాడు. దేశ ప్రయోజనాలంటూ దేశం పట్టి తిరుగుతున్నాడు. మా ఇంట్లో రూపాయి ఆదాయం లేకుండా వుండే మనిషి ఆయనే. కాబట్టి గత ఏడాది కంటే ఈ ఏడాది ఆయన ఆస్తులు బాగా తగ్గాయి అని చెప్పి… ప్రతి ఏటా మేం మా ఆస్తులను నిజాయితీతో ప్రకటించి పారదర్శకత చాటుకుంటున్నాం. దేశ రాజకీయాలలో ప్రతిఒక్కరూ మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఆస్తులను ప్రక టించుకోవాలని చెప్పి ప్రెస్‌మీట్‌ ముగించాడు.

ఎకసెక్కాల వెంకట్రావ్‌ భార్య పంకజం వుండి భర్తతో… ఈ ప్రోగ్రామ్‌ భలే వుంది కదండీ… ”పెళ్లాం వదిలేసిన మొగుడు” సీరియల్‌ కంటే బాగుంది. ఆ యాంకర్‌ అబ్బాయి కూడా భలే నవ్విం చాడు. పిల్లలు కూడా చాలా ఇంట్రస్ట్‌గా చూసారు. ఈ ప్రోగ్రామ్‌ ప్రతిరోజూ ఇదే టైంకు వస్తుందా? ఖచ్చితంగా ఆ టైంకు చూస్తాం అని అడిగింది. పంకజం మాటలు విన్న వెంకట్రావ్‌కు… అది ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రాం కాదని, లోకేష్‌ ఆస్తుల వివరాలు వెల్లడించే ప్రెస్‌మీట్‌ అని చెప్పి నమ్మించేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here