Home జిల్లా వార్తలు రూరల్‌ మొనగాడు ఆదాలే

రూరల్‌ మొనగాడు ఆదాలే

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థి ఎవరు? వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యేని ధీటుగా ఢీకొట్టే నాయకుడెవరు? గ్రామీణం కోటలో తెలుగుదేశం పార్టీ గెలుపు జెండాను ఎగుర వేసే సత్తా వున్నదెవరికి? గత కొంతకాలంగా ఈ ప్రశ్నలు తెలుగుదేశం పార్టీని వెంటాడాయి. ఎవరు పోటీ చేయాలన్న దానిపై ఇంత కాలం మల్లగుల్లాలు పడ్డారు. ఒకటికి ఆరు పేర్లు తెరమీదకొచ్చాయి. ఒక సందర్భంలో జిల్లా స్థాయి నాయకులే మాకు ఆ సీటొద్దనే పరిస్థితి. రోజుకో కొత్త పేరు ప్రచారంలోకి వచ్చిన పరిస్థితి. ఈ పరిణామాలన్నింటికీ ఇప్పుడు తెరపడింది!

నెల్లూరు గ్రామీణంలో ఎన్నికల యుద్ధానికి మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నేను సై అంటూ సిద్ధమయ్యాడు. రూరల్‌ తెలుగుదేశం అభ్యర్థిగా ఆయనను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. గత నాలుగున్నరేళ్ళుగా నెల్లూరురూరల్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూ… ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో రూరల్‌ ప్రజలకు చేరువైన ఆదాల ప్రభాకర్‌రెడ్డిని తాడోపేడో తేల్చుకోమని పార్టీ అధిష్టానం ఆయన పోరాటానికి పచ్చజెండా ఊపింది.

కొంతకాలంగా ప్రస్తుత గ్రామీణ శాసనసభ్యుడు మాత్రం పత్రికలలో రాయలేని భాషను ప్రయోగిస్తూ బూతుపురాణాన్ని వర్ణిస్తూ… మగాడెవరైనా తన మీద పోటీ చేయవచ్చు అని సవాల్‌ విసురు తుంటే, మరోవైపు ”దేశం” తమ్ముళ్ళు మాత్రం నువ్వంటే నువ్వని ఒకరినొకరు ముందుకు తోసుకుంటూ వచ్చారు.

ఆదాలను నెల్లూరు లోక్‌సభ నుండిగాని లేదా నెల్లూరు రూరల్‌ నుండి కాని పోటీ చేయమని చంద్రబాబు సూచించారు. పార్లమెంటు కంటే ఆయన అసెంబ్లీ వైపే మొగ్గు చూపాడు. నెల్లూరురూరల్‌కు ఆదాల అయితే గట్టి అభ్యర్థి అవుతాడని ఆయనే పోటీ చేయాలని పార్టీలో అందరి అభిప్రాయం. కాని, ఆయన వైసిపి బలం కంటే కూడా సొంత పార్టీలోని నాయకులే తనను వెన్నుపోటు పొడిచి ఓడిస్తారనే భయంతోనే రూరల్‌లో పోటీకి తొలుత ఆసక్తి చూపలేదు. అయితే ఇదే ఛాన్సుగా తీసుకున్న గ్రామీణ ఎమ్మెల్యే, ఆదాల తన దెబ్బకు భయపడే రూరల్‌ నుండి పారిపోతున్నాడని బహి రంగంగానే చెప్పుకున్నాడు.

ఎలాగైనా ఈసారి కాకాణిపై విజయం సాధించాలనే నెపంతో సోమిరెడ్డి రూరల్‌ నుండి ప్రక్కకు తప్పుకుంటే, ఆదాల, సోమిరెడ్డి తర్వాత అత్యంత బలవంతుడైన నారాయణ ఎందుకు రూరల్‌కి రావడం లేదన్న ప్రశ్న కూడా ”దేశం” నేతల్లో విన పడింది. అయితే గ్రామీణ ఎమ్మెల్యేతో జరిగిన ఒప్పందం ప్రకారమే నారాయణ నెల్లూరు నగరం నుండి పోటీ చేయ బోతున్నాడని, తెలుగుదేశంలోని పలువురు నేతలతో తనకున్న సంబంధాల ద్వారా నెల్లూరు నగరంలో నారాయణ గెలుపుకి తాను సహకరిస్తానని, రూరల్‌లో తనపై ”డమ్మీ” అభ్యర్థిని పెట్టాలని గ్రామీణ ఎమ్మెల్యే కుదుర్చుకున్న ఒప్పందమే నారాయణ నగరంపై ఆసక్తి చూపడానికి కారణమని వైసిపి శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. రాజకీయ చాణుక్యుడిగా పేరుపొందిన రూరల్‌ శాసనసభ్యుడు తన గెలుపే ధ్యేయంగా తన పార్టీలోని ఇతర అభ్యర్థుల విజయాన్ని తాకట్టుపెట్టడం పెద్ద విషయమేమీ కాదన్నది వారి అభిప్రాయం.

అయితే గ్రామీణ ఎమ్మెల్యే సవాల్‌కు తగ్గట్లే ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పోటీ నుంచి తప్పుకోకుండా అక్కడే బరిలో దిగుతున్నాడు. ఆదాలకు రాజకీయ కుయుక్తులు, వెన్నుపోట్లు తెలియవు. ఆయనదెప్పుడూ ముక్కుసూటి రాజకీయమే! ఆదాల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థి అని తేలడంతోనే నెల్లూరురూరల్‌లో తెలుగు తమ్ముళ్ళు పండుగ చేసుకుంటున్నారు. నెల్లూరురూరల్‌కు తొలి తెలుగుదేశం అభ్యర్థిగా దిగుతున్న ఆదాలే ఆ నియోజకవర్గం నుండి తొలి తెలుగుదేశం ఎమ్మెల్యే కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

తెలుగు తమ్ముళ్ళంతా నిత్యం తనతో మాట్లాడుతూనే వుంటారని పదేపదే ఆయన చెప్పుకోవడమే ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తుందన్నది కూడా వైసిపి శ్రేణుల మాట.

ఏదిఏమైనా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడు తున్నారంటే.. ఇది నిజంగా భయమా లేక తమ మిత్రుడిపై తమకున్న ప్రేమా అన్న అనుమానం కూడా రాక మానదు. నిజంగా రూరల్‌లో విజయం సాధించాలనుకుంటే సోమిరెడ్డి, ఆదాల, నారాయణ ఒక్కటైతే రూరల్‌ విజయం వీరికి పెద్ద విషయమే కాదు. రాష్ట్రంలో జగన్‌ వస్తాడా? చంద్రబాబు వస్తాడా? అన్న ప్రశ్న ఎలా వినపడుతుందో… రూరల్‌ ”మగాడు” ఎవరన్నది కూడా అంతే స్థాయిలో వినపడుతోంది. ఇంతకీ రూరల్‌కి రాబోయే ఆ ”మగాడు” ఎవరో వేచి చూడాల్సిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here