Home గ్రామ సమాచారం ‘రిజర్వ్‌’ అభ్యర్థుల కొరత

‘రిజర్వ్‌’ అభ్యర్థుల కొరత

జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలు న్నాయి. ఒకటి సూళ్లూరుపేట, రెండోది గూడూరు. గతంలో అటు కాంగ్రెస్‌కు, ఇటు టీడీపీకి ఈ రెండు చోట్ల కూడా శాశ్వత అభ్యర్థులుండేవాళ్ళు. చాలా ఎన్నికల వరకు గూడూరులో టీడీపీకి బల్లి దుర్గాప్రసాద్‌, కాంగ్రెస్‌కు పట్రా ప్రకాశరావు, సూళ్ళూరుపేటలో టీడీపీకి పరసా రత్నం, కాంగ్రెస్‌కు పసల పెంచలయ్య అభ్యర్థులుగా వుంటూవచ్చారు. తర్వాత కాలంలో మారిన రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలు వాళ్ళను మారుస్తూవచ్చాయి.

2014 ఎన్నికల్లో ఈ రెండు రిజర్వుడ్‌ నియోజకవర్గాలు వైసిపి ఖాతాలో చేరాయి. గూడూరు నుండి పాశం సునీల్‌కుమార్‌, సూళ్ళూరుపేట నుండి కిలివేటి సంజీవయ్యలు వైసిపి అభ్యర్థులుగా గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ ఆ పార్టీలోకి వెళ్లిపోవడం జరిగింది. సునీల్‌ వైసిపిలోనే వుంటే వచ్చే ఎన్నికల్లోనూ వైసిపి అభ్యర్థి అతనే! సునీల్‌ పార్టీ మారడంతో వైసిపికి ఇక్కడ అభ్యర్థి వెదుకులాట తప్పడం లేదు. మేరిగ మురళి గూడూరు వైసిపి ఇన్‌ఛార్జ్‌గా వున్నారు. గూడూరు సీటును ఆయన ఆశిస్తున్నాడు. మేకపాటి ఆశీస్సులు కూడా మెండుగా వున్నాయి. కాకపోతే అసెంబ్లీకి అతను సరిపోడనే అభిప్రాయం పార్టీ కేడర్‌లోనే వ్యక్తమవుతోంది. అలాగే బత్తిని విజయకుమార్‌ కూడా టిక్కెట్‌ రేస్‌లో వున్నాడు. 2014 ఎన్నికల్లో ఆయన టిక్కెట్‌ను ఆశించాడు గాని, అది సఫలం కాలేదు. ఇక కాంగ్రెస్‌లో వున్న పనబాక కృష్ణయ్య అయితే గూడూరు వైసిపికి సరైన అభ్యర్థి అనే అభిప్రాయం వుంది. అయితే ఆయనను వైసిపిలోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు కొన్ని కండీషన్‌ల వల్ల ఫలించలేదు. వీరివైపు నుండే కాకుండా మహిళల వైపు నుండి కూడా అభ్యర్థిని ఆలోచిస్తున్నారు. మహిళా అభ్యర్థి అయితే జిల్లాలో ఒక మహిళకు సీటిచ్చినట్లుగా కూడా వుంటుందని ఆ దిశగా ఆలోచిస్తున్నారు.

సూళ్లూరుపేటలో టీడీపీకి ఈసారి అభ్యర్థి ఎవరుంటారన్న ప్రశ్న వస్తోంది. 1994 ఎన్నికల నుండి కూడా వరుసగా ఐదుసార్లు పరసా రత్నం ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. మూడుసార్లు విజయం సాధించాడు. 2014లో ఓడిపోవడం తెలిసిందే! ఈసారి పరసారత్నంను నియోజవర్గంలో బలమైన వేనాటి వర్గం వ్యతిరేకిస్తోంది. పరసా రత్నంను కాదనుకుంటే ఇక్కడ టీడీపీకి కొత్త అభ్యర్థిని వెదకాల్సి వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here