Home రాష్ట్రీయ వార్తలు రామాయపట్నం.. వచ్చేనా? ఒట్టిదేనా?

రామాయపట్నం.. వచ్చేనా? ఒట్టిదేనా?

ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా పత్రికలకు, ప్రకటనలకు ఎక్కుతుంటాయి. అది తర్వాత రానీయండి, రాకపోనీ యండి… ముందు పేపర్లలో అయితే హడావిడి కనిపిస్తుంటుంది. ఈ కోవకు చెందిందే రామాయపట్నం పోర్టు. ప్రధాన పార్టీల నాయకులకు రాజకీయ ఆయుధం. రామాయపట్నం ప్రకాశం జిల్లా పరిధిలోదే అయినప్పటికి కావలి నియోజకవర్గ నాయకులే దీనిపై ఎక్కువ ఆసక్తి కనపరిచారు. ఎందుకంటే ఈ పోర్టు వస్తే ఎక్కువుగా అభివృద్ధి చెందేది కావలి ప్రాంతమే కాబట్టి!

సాంకేతిక, పర్యావరణ కారణాల దృష్ట్యా నెల్లూరుజిల్లా దుగరాజపట్నం వద్ద కేంద్రం తలపెట్టదలచిన పోర్టు సాధ్యం కాదని తేల్చడంతో కావలి నాయకులు ఆ పోర్టును రామాయపట్నం వద్ద కట్టాలంటూ డిమాండ్‌ చేసారు. ఈ మేరకు మాజీఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలు, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి, మాజీఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి, దీనిపై పాదయాత్రలు, పోరా టాలు చేయడం తెలిసిందే! కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ పోర్టు నిర్మించాలంటూ స్థానిక నాయకులు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు.

ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మినీపోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రామాయపట్నం పోర్టు కోసం కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గించారు. అయితే రామాయపట్నం వాణిజ్య పరమైన పోర్టు కాదు. స్థానికంగా వుండే పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగానే ఇక్కడ పోర్టు నిర్మాణం చేపడతారు. కమర్షియల్‌ పోర్టుగా కృష్ణపట్నం పోర్టు వుండడంతో సమీపంలో మరో కమర్షియల్‌ పోర్టు నిర్మాణానికి నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. అదీగాక కృష్ణపట్నం పోర్టుకు రామాయపట్నంకు దూరం 70కిలోమీటర్ల లోపే! ఇంత పరిధిలోనే ఇంకో కమర్షియల్‌ పోర్టుకు తగ్గ వ్యాపారం లేదు. రామాయపట్నం పోర్టు కట్టగానే సరికాదు… దానికి తగ్గ పరిశ్రమలు రావాలి. ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ తప్పితే ఇతర పరిశ్రమలు లేవు. కొత్తగా పరిశ్రమలు వస్తే తప్పితే రామాయపట్నం పోర్టుకు అంతగా వ్యాపారం వుండదు. పరిశ్రమలు, ఎగుమతులు, దిగుమతులు లేకుండా పోర్టు కట్టడమంటే ప్రయాణీకులు లేని ఊరులో హైటెక్‌ బస్టాండ్‌ కట్టడమే అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here