Home సంపాదకీయం రామబాణమే శరణమా?

రామబాణమే శరణమా?

రామబాణం… ఈ అస్త్రానికి తిరుగుండదు. పురాణాలలో రామ బాణం విశిష్టత గురించి తెలుసుకున్నాం. అయితే పురాణాలలో అది రాముడికి ఎంతగా ఉపయోగపడిందో తెలియదుగాని, వర్తమాన భారత రాజకీయాలలో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఎంతగానో ఉపయోగపడింది. రామబాణం అస్త్రం శక్తి ఎంతటిదో నేటి రాజకీయాలలో తేటతెల్లమైంది. కేవలం రెండే రెండు ఎంపీ సీట్లతో మొదలైన ఒక పార్టీని.. 278సీట్ల స్థాయికి తీసుకుపోయింది. అదీ రామనామం పవర్‌. ఎన్నికలు దగ్గరపడే కొద్ది భారత రాజకీయాలలో సెంటిమెంట్లు పెరుగుతుంటాయి. భావోద్రేకాలు వ్యక్త మవుతుంటాయి. కులాలు, మతాల వారీగా ప్రేమాభఇమానాలు చోటుచేసుకుంటుంటాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇంకెంతో సమయం లేదు. గట్టిగా ఇంకో నాలుగు నెలల్లో దేశమంతా కూడా ఎన్నికల వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అప్పుడే తన పాత బాణాన్ని బయటకు తీసింది. అదే అయోధ్య రామబాణం. బీజేపీ మళ్ళీ అయోధ్య అంశాన్ని తెరమీదకు తెస్తోంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం తేదీలు ఖారారు చేయాలని విహెచ్‌పి, ఆరెస్సెస్‌ వర్గాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోపక్క

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా అయోధ్య విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆయన లౌకికవాదం ముసుగును వాడుకోడం లేదు, డబుల్‌ డ్రామాలు వేయడం లేదు. మైనార్టీల ఓట్ల కోసం కపట ప్రేమలను కనపరచడం లేదు. తాను హిందూత్వవాదినని బహిరంగంగానే చెప్పుకుం టున్నాడు. అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్‌ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చి తన వైఖరిని స్పష్టం చేశాడు. అంతేకాదు, అయోధ్యలో ఏకంగా 221 అడుగుల శ్రీరామచంద్రుడి విగ్రహం నెలకొల్పడానికి శ్రీకారం చుట్టాడు. తాజాగా అయోధ్యలో లక్షల మంది రామభక్తులతో సదస్సు నిర్వహించారు. అయోధ్య కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది. ఈ వివాదంపై ఇంతవరకు తీర్పు రానప్పటికీ యూపీ సీఎం మాత్రం అయోధ్య రామమందిరం నిర్మాణం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుపోతున్నాడు.

యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అంటే… రేపు రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేయాలన్నా అందుకు సిద్ధంగా ఉంటాడు. అతనికి పదవికంటే రామ మందిరం ముఖ్యం. దేనికైనా తెగిస్తాడు. మరి ఈ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరేంటి? ఇదే పెద్ద ప్రశ్న?

దీనిపై బీజేపీ వైఖరి ఏ విధంగా వుండబోతుందన్నది రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి

ఉండబోతుంది. తెలంగాణలో బీజేపీకి అధికారం మీద ఆశలేదు. కాకపోతే అక్కడ కూటమి బదులు టిఆర్‌ఎస్‌ గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో గాని, మిజోరాంలోగాని కాంగ్రెస్‌ ఓడిపోవడమే బీజేపీకి కావాలి. మరి బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లలో ఫలితాలపైనే ఆ పార్టీ భవిష్యత్‌ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. రాజస్థాన్‌ ఫలితాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వరుసగా రెండోసారి ఏ పార్టీ కూడా అక్కడ అధికారంలోకి రాలేదు. వసుంధరా రాజెపై ప్రజల్లో వ్యతిరేకత వుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ముందు నుండే వూహిస్తున్నారు. కాని మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్క రాష్ట్రంలో బీజేపీ ఓడిపోయినా అది కేంద్రంలోని నరేంద్ర మోడీ పాలనపై ప్రజావ్యతిరేకతగానే భావించాలి. ఎందుకంటే మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో రమణసింగ్‌లు వరుసగా మూడుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వారి పాలనపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత లేదు. వారిపై అవినీతి కుంభకోణాల ఆరోపణలు లేవు. మరి ఆ రెండు రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోయిందంటే అది కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకతే అవుతుంది. నోట్ల రద్దు, జిఎస్టీ, పెట్రోల్‌ ధరలు వంటి వాటి ప్రభావమే వుంటుంది. మరి ఈ ఎన్నికల ఫలితాలకు 2019 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు పెద్ద గ్యాప్‌ వుండదు. ఈ కొద్దికాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ వైఫల్యాలను భర్తీ చేసుకోవడం కూడా కష్టం. ఈ వ్యతిరేకతే దేశమంతటా వుంటుంది. ఈ రెండు రాష్ట్రాలలోనూ ఫలితాలు వ్యతిరేకంగా వుంటే బీజేపీ అధిష్టానం మళ్లీ రామబాణానికి పదును పెట్టే అవకాశాలున్నాయి. అయోధ్య రామమందిర నినాదం మళ్ళీ మార్మోగే అవకాశం లేకపోలేదు.

హిందూత్వంపై బీజేపీ వైఖరి స్పష్టంగానే వుం టుంది. వాళ్ళేమీ ఈ విషయాన్ని దాచుకోరు. ఈ దేశంలో హిందువులను ఒక ఓటు బ్యాంకుగా మలచగలిగింది కూడా బీజేపీనే! హిందువులు సంఘటితం కానంతవరకు కాంగ్రెస్‌కు ఎదురు లేకుండా వుండింది. ఇప్పుడు బీజేపీ హిందూత్వం ప్రభావానికి కాంగ్రెస్‌ పరిస్థితి ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. హిందువులను దూరం చేసుకుంటే దేశ రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతామని చెప్పే కాంగ్రెస్‌ అధినేతలు సోనియా, రాహుల్‌లు ఈమధ్య పెద్దపెద్ద బొట్లు పెట్టి గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. బీజేపీ హిందూత్వ అస్త్రం దెబ్బకు వాళ్లు కూడా ఆ దారికి రాక తప్పలేదు.

పాలనా పరమైన విధానాలలో ప్రజలు తమపై వ్యతిరేకతతో వున్నారని తెలిస్తే, బీజేపీ రేపు ఎన్నికల్లో ప్రయోగించబోయే అస్త్రం రామభక్తి… దేశ భక్తి. ఈ రెండింటిపై బీజేపీ ఇప్పటికే పేటెంట్‌ సాధించినట్లుగా భావిస్తోంది. ప్రచారం కూడా ఆ స్థాయిలోనే వుంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, ఇతర లౌకికవాద పార్టీలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలుగా ముద్ర వేసుకున్నాయి. ఇక లౌకికత్వం ముసుగులో వీళ్ళందరూ రామనామాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి హిందూ వ్యతిరేకులే! ఈ రెండు అంశాలే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బలమైన అస్త్రాలు కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here