మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం నుండి వైసిపిలో చేరుతున్న సమయంలో జిల్లా వైసిపి నాయకులు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. మేకపాటి కుటుంబసభ్యులు ముగ్గురు మాత్రమే ఆయనను పార్టీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. అసలు ఆనంను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనకు బీజం వేసిందే మేకపాటి గౌతంరెడ్డి. తర్వాత తన సీటు ఎక్కడ పోతుం దోనని అడ్డుపుల్ల వేసింది కూడా ఆయనే! ఇక మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి అయితే తన సీటుకు ఎక్కడ తన వాళ్ళు ఎసరు పెడతా రోనని బహిరంగంగానే ఆనంపై విరుచుకుపడ్డాడు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి అయితే ఆనంను తీసుకోవడాన్ని వద్దనలేదుగాని తమ సీట్లకు అడ్డురాకుండా వుండాలనుకున్నాడు. వారి కోరిక ప్రకారమే పార్టీలో చేరాక ఆనంను వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా పంపడం జరిగింది.
వాస్తవంగా ఆనంను వీళ్ళు పెద్దగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌లో వున్నప్పుడు కూడా వీళ్ళ మధ్య సఖ్యత కొనసాగింది. ఆనంతో ఎవరికన్నా బలంగా విభేదాలున్నా యంటే… అది సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలకే! కాంగ్రెస్‌లో వున్నప్పుడే ఆనంతో వీళ్ళ ముగ్గురికీ విభేదాలుండేవి. వై.యస్. మరణానంతరం జగన్ వైసిపిని స్థాపించడం, అందులో ఈ ముగ్గురు నాయకులు చేరడం జరిగింది. కాని, అంతవరకు ఈ జిల్లాలో వై.యస్. అనుచరులుగా బలమైన ముద్ర వేయించుకున్న ఆనం సోదరులు మాత్రం కాంగ్రెస్‌లోనే వుండిపోయారు. అంతేకాదు, వై.యస్. కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో ఆనం సోదరులకు కౌంటర్ అటాక్ ఇచ్చింది శ్రీధర్‌రెడ్డి, అనిల్, కాకాణిలే! అంత బలమైన యుద్ధం సాగింది వారి మధ్య!
వైసిపిలోకి ఆనం రామనారాయణరెడ్డి వస్తానంటే, ముందు అభ్యంతరం పెట్టాల్సింది ఈ ముగ్గురే! వాళ్ళు అలా చేయలేదు. పార్టీలోకి స్వాగతించారు. అంతేకాదు, ఆయనతో కలిసిపోయారు. కలిసి తిరుగుతున్నారు. ఆనం రామనారాయణరెడ్డి చేరిక వల్ల అంతో ఇంతో పార్టీకి ఉపయోగం ఉండొచ్చు. ఇక నియోజకవర్గాల పరంగా చూస్తే సర్వేపల్లిలో కాకాణికి ఆయన చేరిక బాగా
ఉపకరిస్తోంది. పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం మండ లాలలో ఆనం అనుచరవర్గం బాగానే వుంది. వీళ్ళంతా కూడా ఈసారి వైసిపికి బలంగా పనిచేసే అవకాశాలున్నాయి. నెల్లూరు నగరం, రూరల్‌లో కూడా ఆనం అనుచర వర్గం వైసిపి అభ్యర్థు లకు సహకరించవచ్చు. ఆత్మకూరులోనూ పార్టీకి ఆనం వర్గం కలిసొస్తుంది. ఇదంతా కూడా వెన్నుపోటు రాజకీయాలకు తావు లేకుండా పార్టీని గెలిపించాలన్న ఏకైక లక్ష్యంతో ఆనం పనిచేస్తేనే ఆయన చేరికవల్ల పార్టీకి ప్రయోజనం వుంటుంది.
