Home జాతీయ వార్తలు రాజ్యసభ సాక్షిగా… బలపడిన కాంగ్రెస్‌ – ‘దేశం’ బంధం

రాజ్యసభ సాక్షిగా… బలపడిన కాంగ్రెస్‌ – ‘దేశం’ బంధం

జాతీయ రాజకీయాలలో ఎన్డీఏ వ్యతిరేక కూట మికి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీని నిలువరించి ఏకతాటిపై నిలిచిన విపక్షాలన్నీ కూడా బీజేపీని రెండో దెబ్బ కొట్టడానికి సిద్ధపడ్డాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడం ద్వారా తమ సత్తాను చాటాలనుకున్నాయి. ఎన్డీఏకు ప్రమాద సంకేతాలను అందించాలనుకున్నాయి. కాని విపక్షాల పన్నాగాలను పటాపంచలు చేస్తూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌గా ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకోవడంలో బీజేపీ నాయకులు విజయం సాధించారు. దీంతో ప్రధాని నరేంద్రమోడీ తన పరువును కాపాడుకోగలిగారు.

లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజార్టీ వుంది. మిత్రపక్షాలను కలుపుకుంటే లోక్‌సభలో ఆ పార్టీకి తిరుగేలేదు. కాకపోతే మొదటి నుండి ఎన్డీఏ ఇబ్బంది పడుతున్నది రాజ్యసభలోనే! ఇక్కడ ఎన్డీయేతర పక్షాల బలమే ఎక్కువ. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పాదించిన బిల్లులను ఈ సభలో ఆమోదించడం కష్టసాధ్యంగా మారింది. రాజ్యసభలో ఎన్డీఏకు సంపూర్ణ మెజార్టీ లేని తరుణంలోనే డిప్యూటీ ఛైర్మెన్‌ ఎన్నిక వచ్చింది. కురియన్‌ పదవీ కాలం ముగియడంతో కొత్త డిప్యూటీ ఛైర్మెన్‌పై జాతీయ స్థాయి ఆసక్తికర రాజకీయాలు నడిచాయి. కర్నాటకలో వచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటిని ఒక్క దారికి తెచ్చి హరిప్రసాద్‌ను తమ అభ్యర్థిగా ప్రతిపాదించాయి. టిఎంసి, ఎన్‌సిపి పార్టీలకు అవకాశమిచ్చినా వాళ్ళు అభ్యర్థులను నిలపడానికి నిరాకరించి కాంగ్రెస్‌కే ఉమ్మడి అభ్యర్థి బాధ్యతను కట్టబెట్టారు.

ఇక ఎన్డీఏ తరఫు నుండి దళ్‌(యు) ఎంపీ హరివంశ్‌ సింగ్‌ను అభ్యర్థిగా నిలిపారు. 9వ తేదీ రాజ్యసభలో ఓటింగ్‌ జరిగింది. 125 మంది సభ్యుల మద్దతుతో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ నారాయణసింగ్‌ డిప్యూటీ ఛైర్మెన్‌గా విజయం సాధించారు. తొలిసారిగా రాజ్యసభలో ఎన్డీఏ జెండా ఎగిరింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని ఓడించి తన సత్తా చాటుకోవాలనుకున్న చంద్రబాబు కలలు కల్లలయ్యాయి. ఆయన కాంగ్రెస్‌కు మద్దతు పలకడంతో కాంగ్రెస్‌-టీడీపీల మధ్య ఇంతకాలం తెరచాటుగా సాగుతున్న అక్రమబంధం ఇప్పుడు బహిరంగమైంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా చీల్చిన కాంగ్రెస్‌కు, అలాగే ప్రత్యేకహోదా ఇవ్వకుండా నానుస్తున్న బీజేపీకి సమదూరం పాటిస్తూ వైసిపి ఓటింగ్‌కు గైర్హాజరు కావడం వారి సమయస్ఫూర్తికి నిదర్శనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here