Home జిల్లా వార్తలు రాజకీయ వేట… అధికారులతో ఆట!

రాజకీయ వేట… అధికారులతో ఆట!

పొలిటికల్‌ గేమ్‌లో అధికారులు అప్పుడప్పుడూ పావులుగా మారుతుంటారు. ‘కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం’ అనే సామెతకు అధికారులు అద్దినట్లు సరిపోతుంటారు. అధికారంలో వున్న నాయకుల మాటలు వింటే ప్రతిపక్ష నాయకులు తూర్పారబడతారు, వినకపోతే అధికారపార్టీ నాయకులు కక్షగట్టి అప్రాధాన్యత ప్రాంతాలకు బదిలీలు చేయడం వంటివి చేస్తుంటారు. రాష్ట్ర రాజకీయాలలో అధికారుల పరిస్థితి ఎప్పుడు కూడా అడకత్తెరలో పోకచెక్క మాదిరిగానే ఉంటుంది.

ప్రస్తుతం నెల్లూరుజిల్లాలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి వర్సెస్‌ కలెక్టర్‌ల మధ్య జరుగుతున్న పోరును చూస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుపై ఎమ్మెల్యే కాకాణి తీవ్రస్థాయిలో విమర్శలు చేసాడు. కలెక్టర్‌ను పచ్చచొక్కా వేసుకున్న తెలుగుదేశం కార్యకర్తగా అభివర్ణించాడు. కలెక్టర్‌ ప్రోటోకాల్‌ పాటించడం లేదు, తెలుగుదేశం తొత్తుగా మారాడు. మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నాడు. వెంకటాచలంలో రూర్బన్‌ క్రింద జరుగుతున్న పనులు ఘోరంగా వుంటే కలెక్టర్‌ పట్టించుకోడం లేదు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

కొడుకు రాజగోపాలరెడ్డిని ఏ హోదాలో అధికారిక సమావేశా లలో వేదికలపై కూర్చోబెడుతున్నారు. సర్వేపల్లి నియోజక

వర్గంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యేగా నన్ను పిలవకుండా మంత్రి కొడుకును ఎందుకు పిలుస్తున్నారు. పంచాయితీలలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తే ఒక్క వైసిపి సర్పంచ్‌లపై మాత్రం వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇలా ఎన్నో ఆరోపణలతో కాకాణి కలెక్టర్‌పై విరుచుకుపడడమే కాక ఇవిగో ఆధారాలంటూ 9వ తేదీ నెల్లూరు కలెక్టరేట్‌లో జేసీ-2 కమలకుమారిని కలిసి కొన్ని పత్రాలు అందజేశారు.

కలెక్టర్‌పైనే కాకాణి పదునైన విమర్శలతో దాడి చేయడంతో ఉద్యోగ సంఘాలు రియాక్టయ్యాయి. కలెక్టర్‌పై కాకాణి వ్యాఖ్యలు దారుణమంటూ రెవెన్యూ సంఘాలు మండిపడుతున్నాయి. బి.సి ఉద్యోగులు నెల్లూరులో కాకాణికి వ్యతిరేకంగా ధర్నా చేసారు. ఇక జిల్లా అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న కలెక్టర్‌ను తిడతారా… కలెక్టర్‌కు మేం అండగా వున్నాం అంటూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో సోమవారం వెంకటా చలంలో భారీ ర్యాలీ చేసారు. అయితే తనపై ఇంత దాడి జరుగుతున్నా కలెక్టర్‌ ముత్యాలరాజు ఎక్కడా నోరు మెదపకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఈ వివాదం చిలికిచిలికి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి!

జిల్లాలో ప్రజాప్రతినిధులకు అధికారులకు మధ్య విభేదాలు, వాగ్యుద్దాలు కొత్తేం కాదు, కాని గతంలో అధికారపార్టీ నాయకు లతో అధికారులకు వైరం ఏర్పడేది. గతంలో కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కలెక్టర్‌ శ్రీలక్ష్మిల మధ్య గొడవ చూసాం. కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ల వివాదం చూసాం. గతంలో ప్రతిపక్ష నేతలు కూడా కలెక్టర్‌, ఎస్పీ వంటి అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. అంతెందుకు ఇటీవలే రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జిల్లా ఎస్పీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం చూసాం.

ఇప్పుడు కాకాణి, కలెక్టర్‌ గొడవ… చిలికి చిలికి గాలి వానగా మారకముందే సమిసిపోతే మంచిది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here