Home సంపాదకీయం రచ్చ సరే… ఇంట గెలిచేదెలా?

రచ్చ సరే… ఇంట గెలిచేదెలా?

వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్‌ ఎలా వుండేది. ఎల్‌.కె.అద్వానీ, జార్జి ఫెర్నాండేజ్‌, మురళీమనోహర్‌ జోషి, వెంకయ్యనాయుడు, నితీష్‌కుమార్‌, యశ్వంత్‌ సిన్హా, మమతా బెనర్జీ… వంటి మహామహులతో సమర్ధవంతంగా కనిపించేది. ప్రతిశాఖ తరఫున పనితీరు భేషుగ్గా కనిపించేది. వాళ్ళు చేసింది ప్రజలకు కనిపించేది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీమ్‌ స్పిరిట్‌ ఉండేది. పదిమంది మాట్లాడేవాళ్ళు. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు చెప్పేవాళ్ళు. ప్రతిపక్షాల ఆరోపణలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చేవాళ్ళు. విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతుండేవాళ్ళు.

అప్పటి వాజ్‌పేయి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పటి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేవలం డబుల్‌ మెన్‌ షోగా మారింది. ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రెండోవారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. ప్రభుత్వంలో మోడీ, పార్టీలో అమిత్‌షాల హవా తప్ప రెండో మనిషితో పనే లేకుండా పోయింది. ప్రభుత్వంలో మోడీది వన్‌మెన్‌షో. కేంద్ర కేబినెట్‌పై ఆయన నియంత్రణ ప్రమాణస్వీకారోత్సవం జరిగిన క్షణం నుండే మొదలైంది. ముఖ్యంగా యూపిఏ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు తన పాలనలో చోటు చేసుకోకూడదనే ముందుచూపుతోనే ఆయన మంత్రులను కంట్రోల్‌లో పెట్టాడు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలోనే ఆయన ఒక ట్రెండు కేసులకు సంబంధించి తన సహచర మంత్రి వర్గ సభ్యులకు ఇలాంటివి పునరావృతం కానీయొ ద్దంటూ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చాడని సమాచారం. అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా మంత్రు లను క్రమశిక్షణలో, క్రమ పద్ధతిలో పెట్టాలనుకోవడం మంచిదే కాని, మరీ ఆ నియంత్రణ శృతి మించితే లేనిపోని సమస్యలొస్తాయి. ఇప్పుడు కేంద్రంలో అటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. ప్రతి మంత్రి తమ శాఖకు సంబంధించిన పనులు తాము చేసుకుపోతున్నారు. వాజ్‌పేయి కేబినెట్‌లోలాగే మోడీ కేబినెట్‌లోనూ నిజాయితీపరులు, సమర్ధులు మంత్రులుగా వున్నారు. ఏ మంత్రుల మీద కూడా అవినీతి ఆరోపణలు లేవు. అయితే ఏ మంత్రిత్వశాఖలో ఏం జరుగుతుందన్నది ప్రజలకు తెలియడం లేదు. మంత్రులు చెప్పుకోలేకపోతున్నారు. మీడియా వెల్లడించడం లేదు. ప్రజలకు తెలియడం లేదు. ఆఖరకు ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్‌ను విమర్శించడానికి ఇస్తున్నంత ప్రాధాన్యత తమ ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోవడానికి ఇవ్వడం లేదు.

ఈ నాలుగున్నరేళ్ళలో మోడీ ప్రభుత్వం జనాలకు ఏం చేసింది? అన్న ప్రశ్న వస్తే… దానికి సమాధానం చాలా కష్టంగానే వుంటుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ప్రజలకంటే కూడా దేశానికే ఎక్కువ చేసింది. ఇక్కడ దేశమంటే ప్రజలే. కాని ప్రత్యేకంగా ఎన్నికలొచ్చేసరికి ప్రజలైనా, పార్టీలైనా దేశాన్ని, ప్రజలను వేర్వేరుగా చూస్తుంటాయి. మోడీ ప్రభుత్వం ప్రపంచంలో భారత దేశ ఇమేజ్‌ను పెంచింది. దేశానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. ఎన్నో దౌత్య విజయాలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా

ఉగ్రవాదంపై పోరుకు మద్దతు సమీకరించింది. అగ్రరాజ్యం అమెరికాకు అత్యంత ఆప్తమిత్ర దేశంగా గుర్తింపు పొందింది. అదే సమయంలో రష్యా, ఇజ్రాయిల్‌, యూరోపిన్‌, అరబ్‌ దేశాలతో సైతం తన స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకుంది. సరిహద్దు వివాదాల విషయంలో చైనా బెదిరింపులను ఏ మాత్రం ఖాతరు చేయకుండా నిలబడింది. ప్రపంచ దేశాల దృష్టిలో పాక్‌ను ఉగ్రవాద దేశంగా చూపించగలిగింది. ఆసియా ఖండంలో చైనాకు దగ్గరవుతున్న నేపాల్‌, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలను తిరిగి తన దారికి తెచ్చుకోగలిగింది. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆలీన విధానం ద్వారా భారత్‌ను అన్ని దేశాలకు దూరంగా పెడితే, మోడీ మాత్రం ఆలింగనం విధానం ద్వారా అటు ట్రంప్‌ను, ఇటు పుతిన్‌ను అలాగే శత్రుమిత్రదేశాలనూ తన దారికి తెచ్చుకున్నాడు. ఈ నాలుగున్నరేళ్ళలో బయట నుండి ఒక్క రూపాయి అప్పు తేకుండా దేశాన్ని ప్రపంచంలోనే ఆర్ధిక శక్తిగా రూపుదిద్దుతున్నాడు.

అయితే మోడీ ఇంతవరకు రచ్చగెలిచాడు. కాని, ఇంట గెలవడానికి ఏం చేశాడు? ఆయన విదేశీ విధానాలు, దౌత్యపర విజయాలు దేశ ప్రజల మనసులకు ఎక్కవు. వీటి గురించి దేశంలో 10శాతం మంది కూడా ఆలోచించరు. మోడీ వచ్చి దేశ ప్రతిష్టను పెంచాడు. ఉగ్రవాద దాడులు లేకుండా చేసాడు. దేశ భద్రతను పటిష్టం చేశాడు అనే విషయాలకు ప్రజలలో అంత ప్రాధాన్యత వుండదు. మోడీ వచ్చి నాకేం చేశాడు? అన్న ప్రశ్నే ప్రజల్లో ఎక్కువుగా వుంటుంది. వచ్చి ఋణమాఫీ చేశాడా? కొత్త అప్పులు ఇచ్చాడా? జనధన్‌ ఖాతాలో డబ్బులేమన్నా వేశాడా? ఉచిత టీవీలు, ఉచిత బియ్యం, రేషన్‌ సరుకులు ఇచ్చాడా? నెలకో రెండువేలు సరదాగా గడపమనేమన్నా ఇచ్చాడా? ఫ్రీ కరెంట్‌ ఇచ్చాడా? ఎక్కువమంది ప్రజలను ప్రభా వితం చేసేది ఇలాంటి పనులే! అది ప్రజల తప్పు కూడా కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌పార్టీ మెజార్టీ శాతం ప్రజలను ఆ విధంగా చేసింది. ఈరోజు మోడీ దేశాన్ని ఆర్ధికంగా అగ్ర స్థానంలో నిలబెట్టాడా? సైనిక శక్తిలో చైనాకు ధీటుగా పెంచాడా? ఉగ్రవాదాన్ని నిర్మూలించాడా? ఇవి కాదు రేపు ఎన్నికల ప్రచారాస్త్రాలు. నోట్లు రద్దు చేసి జనాలను క్యూలలో నిలబెట్టాడు… జిఎస్టీతో వస్తువుల రేట్లు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించ లేదు… రాహుల్‌ ఊదరగొడుతున్నట్లు రాఫెల్‌ డీల్‌లో లక్షకోట్ల అవినీతి… ఇవి ప్రజల మెదళ్ళలోకి ఎక్కే అంశాలు. రాఫెల్‌ డీల్‌పై ప్రతిపక్షం ఇంత రచ్చ చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుండి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరగలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఇంకా ప్రచారంలోకి వెళ్ళలేదు. మేము ఇది చేసాము అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. విదేశాంగ విధానం మాటెలా వున్నా ఆర్ధిక సంస్కరణలో మోడీ సర్కార్‌ కొన్ని తప్పుటడుగులు వేస్తోంది. దేశాన్ని ఆర్ధికంగా శక్తివంతం చేసే క్రమంలో ప్రజలను ఎండబెడుతోంది. ఈ పరిణామాలు రేపు ఆ పార్టీకే నష్టం కలిగిస్తాయి. దేశ ప్రజలకు ఏ రూపంలో మేము మేలు చేసామనేది వాళ్ళు ఇప్పటికైనా చెప్పుకోకపోతే, మోడీ నిర్లక్ష్యానికి బీజేపీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఆయా రాష్ట్రాల ఎన్నికలు, గెలుపోటములు ఒక ఎత్తు, రాబోయే సార్వత్రిక ఎన్నికలు మరో ఎత్తు. మోడీ, అమిత్‌షాలిద్దరే ఎన్నికల సుడిగుండాన్ని ఈది దాటుతోందంటే అది అతివిశ్వాసమే అవుతుంది. పార్టీ నాయకత్వాన్ని ఇప్పటికైనా కలుపుకుని ప్రజలలోకి వెళ్ళకుంటే బీజేపీ పుట్టిని ముంచిన ఘనత మోడీ, షాలదే అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here