Home నెల్లూరులో నేడు రచ్చకెక్కిన ‘టౌన్‌హాలు’

రచ్చకెక్కిన ‘టౌన్‌హాలు’

నెల్లూరు కళా రంగమంటే ముందుగా గుర్తొచ్చేది టౌన్‌హాల్‌. పేరుకి రేబాల లక్ష్మీనరసారెడ్డి పురమందిరం అయినప్పటికీ టౌన్‌హాల్‌గానే ఈ కళామందిరం ప్రసిద్ధి. ఈ చారిత్రాత్మక మందిరంలో అడుగుపెట్టని కళాకారుడే లేడు. ఇక్కడ సభల్లో ప్రసంగించని రాజకీయ నేతలు కూడా బహుఅరుదు. నాటి తరం నుండి నేటి తరం వరకూ పలు రంగాల వారికి వేదికగా నిలుస్తూ రేపటి తరం కోసం కూడా తానెప్పుడూ సిద్ధం అన్న రీతిలో ఈ పురమందిరం ప్రజలకు అంకితమైంది. అయితే ఇప్పుడు అదే పురమందిరం రచ్చకెక్కింది.

ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు వేదికగా నిలిచిన టౌన్‌హాలు ఇప్పుడు వివాదాలకు వేదికయ్యింది. రేబాల కుటుంబీకులు నిర్మించి ఇచ్చిన ఈ మహామందిరానికి 2003లో ప్రముఖ దాత, వ్యాపారవేత్త జె.యస్‌.రెడ్డి దాదాపు 40లక్షలు ఖర్చు చేసి కొత్త వైభవాన్ని తెచ్చాడు. టౌన్‌హాలుకి కొత్త హంగులు తేవాలన్న సంకల్పమైతే జె.యస్‌.రెడ్డి చేశాడు కాని ఆ బాధ్యతలను తమ ఉద్యో గులకి అప్పజెప్పాడు. అప్పట్లో మందిరంలో అలంకరించుండిన దాతలు, ప్రముఖుల ఫాటోలు ”సోకు”గా లేవని తీసి దిబ్బలో వేశారు. లక్షల రూపాయలు విలువ చేసే పురాతన సామాగ్రిని మాయం చేశారు. జె.యస్‌.రెడ్డి పేరే ప్రముఖంగా కనపడేలా బోర్డులు చెక్కించారు.

ఇంతవరకూ బాగానే వుంది. అసలు టౌన్‌హాల్‌ బాధ్యతలు అప్పటివరకూ నిర్వహిస్తుండినవారిపైనే ఆధిపత్యాన్ని సాధించాలని జె.యస్‌.రెడ్డి ఉద్యోగులు చేసిన, చేస్తున్న ప్రయత్నాలే ఇప్పుడు వివా దాస్పదంగా మారాయి. ఎక్కడో బెంగు ళూరులో వుంటూ ఓవైపు చిన్నపిల్లల పార్కు, మరోవైపు క్యాన్సర్‌ ఆసుపత్రి వంటి సేవా కార్యక్రమాలతో పాటు టౌన్‌హాల్‌ పునఃనిర్మాణం లాంటి మంచి సత్కార్యానికి కూడా శ్రీకారం చుట్టిన జె.యస్‌.రెడ్డిని అనవసరమైన వివాదాలలోకి లాగినట్లుగా అయ్యింది. అసలు నెల్లూరులో ఏం జరుగు తోంది. ఏం జరగాలి అన్న విషయాలలో ఆయనను తప్పుదోవ పట్టించి ఇంత డబ్బు పెట్టాం కాబట్టి దాతల కుటుంబసభ్యులపై కూడా మనమే ఆధిపత్యం చెలాయించాలనే ఆయన సిబ్బంది ఆలోచనే ఇప్పుడు బెడిసి కొట్టింది.

ముందునుండి రేబాల కుటుంబం తరపున ప్రాతినిధ్యం వహిస్తుండిన రేబాల హరిశ్చంద్రారెడ్డిని కమిటీ నుండి పీకేసి కేవలం రేబాల అన్న ఇంటి పేరున్న మరో వ్యక్తిని మొక్కుబడిగా సభ్యుడ్ని చేయడం వివాదాస్పదమయ్యింది. విషయం కోర్టు దాకా వెళ్ళింది. అందరికీ అందుబాటులో వుండాలన్న ధ్యేయంతో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని భారీ నిర్మాణాన్ని నెల్లూరు కళా రంగానికి రేబాల కుటుంబ సభ్యులు అంకితం చేస్తే, మేం బాగుచేశాం కాబట్టి పెత్తనం మాదే అంటూ జె.యస్‌. రెడ్డి ప్రతినిధులు ప్రవర్తించడం ఎవ్వరికీ మింగుడుపడలేదు. నెల్లూరులో వ్యాపార దృక్పథంతో నిర్మించిన కళ్యాణ మండ పాలు, కన్వెన్షన్‌ సెంటర్ల తరహాలో టౌన్‌ హాల్లో కూడా ప్రైవేట్‌ వ్యక్తులను శాశ్వ తంగా ఏర్పాటు చేసి, వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చేసిందే శాసనంగా వారికి స్వాతంత్య్రం ఇవ్వడంతో సామాన్యులకు ”టౌన్‌హాల్‌” భారమై దూరమైపోయిందన్న ఆవేదన కూడా ఎక్కువగా వినపడుతోంది.

నెల్లూరులోని చారిత్రాత్మక సంస్థలు ఒక్కొక్కటిగా వివాదాలకు నిలయాలైపో తున్నాయి. వ్యక్తుల స్వార్ధ ప్రయోజనాల కోసం సంస్థలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో టౌన్‌హాల్‌ లాంటి చారిత్రాత్మక కళానిలయాన్ని రచ్చకెక్కనీయ కుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లా కళా రంగంపై వుంది.

జె.యస్‌.రెడ్డి కూడా తమ ప్రతినిధుల చెప్పుడు మాటలకు విలువివ్వకుండా క్రింది కోర్టు, కాకపోతే పైకోర్టు అనే రీతిలో కాకుండా సుహృద్భావ వాతావరణంలో సమస్య పరిష్కారానికి మార్గం చూపి, ఈ కళానిలయంతో పాటు ఆర్‌.యల్‌.రెడ్డి కుటుంబ పరువు నిలబెట్టాలన్నది నెల్లూరీయుల కోరిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here