Home జిల్లా వార్తలు యుద్ధానికి సైన్యం సిద్ధం

యుద్ధానికి సైన్యం సిద్ధం

ఎన్నికల కోడ్‌ కూసింది. అక్షర క్రమంలోనే కాదు, ఎన్నికలలోనూ మీరే ముందంటూ తొలిదశ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్టారు. ఇంత తొందరగా ఎన్నికలు ముంచుకొస్తాయని ఎవరూ వూహించలేదు. దీంతో ఇరు పార్టీల అధిష్టానాలు గెలుపుగుర్రాలను ఎలక్షన్‌ రేస్‌కు సిద్ధం చేసే పనిని ఆఘమేఘాల మీద మొదలుపెట్టాయి.

నెల్లూరుజిల్లాలో చూస్తే పది అసెంబ్లీ స్థానాలలో ఒకట్రెండు చోట్ల తప్ప అన్ని చోట్లా అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఏ నియోజకవర్గంలో ఎవరి అవకాశాలు ఎంతంత మాత్రంగా వున్నాయనేదానిపై ఓ విశ్లేషణ. పోటీలో జనసేన, బీజేపీ, సీపీఎం వంటి పార్టీలు కూడా ఉండేటప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం, వైసిపిల మధ్యే వుండబోతోంది.

హోరాహోరీగా నెల్లూరు నగరం…

ఈసారి రసవత్తరంగా వుండబోతుంది. వైసిపి నుండి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, టిడిపి నుండి మంత్రి పి.నారాయణ రంగంలోకి దిగారు. నెల్లూరు నగరం నుండి అనిల్‌కు వరుసగా ఇది మూడో ఎలక్షన్‌. దాదాపు పదేళ్లుగా ఆయన నగర ప్రజల మధ్యే వుంటున్నాడు. ప్రజాసమస్యల పోరాటాలలో వుంటున్నాడు. అన్నింటికంటే కూడా జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా వుంటూ వై.యస్‌. అభిమానులకు చేరువయ్యాడు. సిటింగ్‌ ఎమ్మెల్యేగా అనిల్‌పై ఎటువంటి వ్యతిరేకత లేదు. ప్రభుత్వంపై బలమైన వ్యతిరేకత అనిల్‌కు అనుకూలం కానుంది. రాష్ట్రంలో జగన్‌కు ఓ అవకాశమిద్దామనే సాధారణ ప్రజల ఆలోచన కూడా అనిల్‌కు కలిసిరావచ్చు. ఇక కొత్తగా నమోదైన ఓటర్లలో సైతం మెజార్టీ షేర్‌ వైసిపికే రావచ్చు. ఎందుకంటే ప్రత్యేకహోదా ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి ఎక్కు వుగా వెళ్లింది వైసిపినే! జగన్‌ యువనాయకుడు కావడం, అనిల్‌ కూడా యువకుడే కావడం, నగరంలో యువత ఎక్కువుగా వుండడం కూడా అనిల్‌కు కలిసొచ్చే అంశం.

టీడీపీ అభ్యర్థిగా మంత్రి పి.నారాయణకు తొలి ఎన్నికలివి. ఆయన పార్టీ కండువాను భుజం మీద వేసుకున్నది కూడా ఇప్పుడే! నగరంలో నారాయణ అయితేనే గట్టి పోటీనివ్వగలడనే ప్రచారం నేపథ్యంలో ఆయన పోటీకి దిగాల్సివచ్చింది. నారా యణకు ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలనేంత అభిమానం వచ్చేటంత గొప్పగా గతంలో నారాయణ నెల్లూరులో సేవా కార్యక్రమాలేమీ చేయలేదు. క్రింద స్థాయి నుండి స్వయంకృషితో జాతీయ స్థాయిలో విద్యాసంస్థలను విస్తరించిన కృషీవలుడిగా ఆయనకు పేరుంది. పోతే, గత నాలుగేళ్ళ కాలంలో నగరంలో భారీ ఎత్తునే వందల కోట్లలో అభివృద్ధి పనులు జరిగాయి. అయితే ఈ పనులు ఒక కాలమాన ప్రకారం ఒక పద్ధతిగా జరిగివుంటే నారాయణకు ఆ పేరొచ్చేది. కాని వందల కోట్ల పనులను కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే హడావిడిగా చేయిం చాడు. దీనికితోడు కాంట్రాక్ట్‌ పనులన్నీ కూడా ఒకరికే ఇవ్వడం వల్ల కూడా నారాయణకు అనుకున్నంత మైలేజీ రాకుండా పోయింది. సిమెంట్‌ రోడ్లు, పార్క్‌లు, ఎన్టీఆర్‌ ఇళ్ళు భారీఎత్తున జరిగినా సరైన ప్లానింగ్‌ లేక, వాటి మీద నారాయణ తన బ్రాండ్‌ వేసుకోలేకపోయాడు. నియోజకవర్గంలోని రెండో నగర పరిధిలో టీడీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ వుంది. సొంత సామాజికవర్గమైన కాపులపై నారాయణ బలంగా ఆశలు పెట్టుకుని వున్నాడు. ఇక ఆర్ధికశక్తి ప్రభావం కూడా బాగానే పని చేయొచ్చు. నారాయణ నెట్‌వర్క్‌ బాగానే వుంది. అయితే ఇక్కడ ఒక్కటైతే నిజం… తెలుగుదేశం ఫ్లేవర్‌తో నారాయణ గెలవాలంటే కష్టం… ఎంతవరకైనా సరే తన సొంత పరపతి తోనే ఆయన గెలవాల్సివుంటుంది.

కోవూరులో పాతకోళ్ళే…!

జిల్లాలోనే సంపన్న నియోజకవర్గంగా పేరుబడ్డ కోవూరు అసెంబ్లీకి టీడీపీ, వైసిపి అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుండి సిటింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దిగుతుండగా, వైసిపి నుండి మాజీఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎలక్షన్‌ సంవత్సరం మారిందేగాని అభ్యర్థులు, పార్టీలు మారలేదు. ఇక కోవూరు ఓటర్లు ఎంతవరకు మారా రనేది చూడాలి!

2014 ఎన్నికల్లో జిల్లాలోని 10సీట్లలో వైసిపి 3సీట్లు ఓడిపోతే అందులో కోవూరు ఒకటి. ఇక్కడ ప్రసన్న ఓటమికి ప్రత్యేక కారణాలేమీ లేవు. ఆరోజు ఆర్ధికంగా ఆయన వెనుకబడి వుండడంతో పాటు సిటింగ్‌ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై వున్న వ్యతిరేకత కూడా ప్రసన్నపై ప్రభావం చూపింది. దీనికితోడు ఆరోజు తెలుగుదేశం ఎంపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కావడం కూడా ప్రసన్న ఓటమికి ఓ కారణం.

కాని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. 2014 ఎన్నికల్లో కోవూరులో తెలుగుదేశంకు కాంగ్రెస్‌ కేడర్‌ తోడయ్యింది. అంతకు రెండేళ్ళ క్రితమే జరిగిన ఉపఎన్నికల్లో ప్రసన్న పోటీ చేసి గెలిచి వున్నాడు. 2014 ఎన్నికల నాటికి కొంత ఓటు డైవర్ట్‌ అయ్యింది. పోలంరెడ్డి అంతకుముందు రెండుసార్లు ఓడిపోయి వుండడంతో ఆయనకు మళ్ళీ ఒక ఛాన్స్‌ ఇద్దామనే కోణం కూడా ఆయనకు కలిసొచ్చింది.

రేపటి ఎన్నికల్లో పోలంరెడ్డికి అన్ని ఆప్షన్స్‌ లేవు. పార్టీ కేడర్‌, సొంత బలగం… వీటి మీదే ఆయన గెలుపు ఆధారపడి వుంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వుంది. సిటింగ్‌ ఎమ్మెల్యేగా పోలంరెడ్డిపై కూడా వ్యతిరేకత వుంది. ఇక తెలుగుదేశంలోనే అసమ్మతి వుంది. నాయకులంతా కలిసి కట్టుగా పనిచేస్తారనే నమ్మకం లేదు. కాకపోతే ఎలక్షన్‌ చేయ డంలో పోలంరెడ్డి ఘనాపాటి. ఆశలు పూర్తిగా నిర్వీర్యమైనా కూడా ఆశలు మళ్ళీ చిగురించేలా చేయగల సమర్ధుడు. కాబట్టి పార్టీ కేడర్‌ కంటే కూడా ఆయన సొంత వ్యూహంపైనే పార్టీ గెలుపోటములు ఆధారపడి వుంటాయి.

నల్లపరెడ్డి ప్రసన్నరెడ్డికి మాత్రం ఈ ఎన్నికలలో గెలుపు అవసరం. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, సిటింగ్‌ ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో సానుకూల ధోరణి లేకపోవడం ప్రసన్నకు కలిసొచ్చే అంశం. ఇక జగన్‌పై ప్రజల్లో వున్న ఆదరణ, ప్రసన్న గత ఎన్నికల్లో ఓడిపోయి వుండడం, అయినా పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్యనే వుండడం వంటివి ఆయనకు ఉపయోగ పడొచ్చు. సొంత వర్గముంది. కాకపోతే ఆర్ధిక వనరుల్లో వీక్‌ అనే ప్రచారముంది. నియోజకవర్గంలో ‘రెడ్డి’ సామాజికవర్గం బలమెక్కువ. ఈసారి ఈ వర్గీయులంతా కూడా జగన్‌ను గట్టిగా బలపరుస్తున్నారు. ఇది కూడా ప్రసన్నకు కలిసొచ్చే అంశం.

మొత్తానికి కోవూరు బరిలో పాత కోళ్ళే పందేనికి దిగాయి. ప్రసన్నకు పార్టీ బలం పెద్ద ఆధారమైతే పోలంరెడ్డికి పార్టీకంటే సొంత వ్యూహం, సొంత అనుచర గణమే పెద్ద ఆయుధం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here