Home జిల్లా వార్తలు యుద్ధానికి.. ఆదాలను సిద్ధం చేస్తున్నారా?

యుద్ధానికి.. ఆదాలను సిద్ధం చేస్తున్నారా?

జగన్‌ సొంత జిల్లా కడపలో కూడా లేని ప్రతికూల పరిస్థితిని తెలుగుదేశం పార్టీవాళ్ళు నెల్లూరుజిల్లాలో ఎదుర్కొంటున్నారు. అధికారంలో వుండి కూడా ఇక్కడ పార్టీకి బలమైన అభ్యర్థుల కొరత వుంది. ముఖ్యంగా నెల్లూరు లోక్‌సభకు ఈసారి అభ్యర్థిగా ఎవరిని నిలపాలనే దానిపై పార్టీలో కసరత్తు జరుగుతోంది. 2014 ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఈసారి అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతుండడం వల్ల లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై పార్టీలో అన్వేషణ మొదలైంది. అయితే ఎంతగా శోధించినా ఆదాలకు మించిన అభ్యర్థి కానరావడంలేదు. ముఖ్యంగా ‘రెడ్డి’ సామాజికవర్గానికి చెందిన నాయకుడినే లోక్‌సభ అభ్యర్థిగా దించాలి. పి.నారాయణ, బీద మస్తాన్‌రావు వంటివాళ్ళు ప్రత్యామ్నాయంగా వున్నప్పటికీ ఆదాల పూర్తిగా దిగనంటేనే ఇక వాళ్ళను పరిశీలించే పరిస్థితి.

ఆదాలను నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా తిరిగి నిలబెట్టే దిశగానే పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆదాల అభ్యర్థి అయితే నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీల అభ్యర్థులకు కూడా ఊపొస్తుందనే అభిప్రాయం పార్టీవర్గాలలో వుంది. లోక్‌సభ పరిధిలోని 7అసెంబ్లీలలో 5అసెంబ్లీల అభ్యర్థులను ఆదాల ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పించినట్లు సమాచారం.

2014 ఎన్నికల్లో ఆదాల కేవలం 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. లోక్‌సభ పరిధిలో 5అసెంబ్లీలలో వైసిపి గెలిచినా, టీడీపీ రెండు సీట్లే గెలిచినా లోక్‌సభ ఓట్లకొచ్చేసరికి ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య పెద్ద తేడా లేకుండా పోయింది. కేవలం ఆత్మకూరులో టీడీపీకి గట్టి అభ్యర్థి లేకపోవడం, వైసిపికి 30వేలకు పైగా మెజార్టీ రావడంతో అక్కడ వచ్చిన ఓట్లతోనే మేకపాటి రాజమోహనరెడ్డి గట్టెక్కాడు. సిటింగ్‌ ఎంపీగా అప్పుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై వున్న వ్యతిరేకత, వైసిపిలోనే క్రాస్‌ఓటింగ్‌ జరగడం, ఆరోజుకు వున్న పరిచయాలు భారీ క్రాస్‌ ఓటింగ్‌కు కారణమయ్యాయి.

అయితే ఆదాల ఈసారి లోక్‌సభ బరిలో దిగితే అప్పటి అనుకూల పరిస్థితులు ఉండకపోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేకత జిల్లాలో బలంగా వుంది. గతంలోలాగా వైసిపి నాయకులు క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్సహించే అవకాశాలు లేవు. ప్రభుత్వంపై వున్న వ్యతిరేకత వల్ల ఈసారి ఓటర్లు అభ్యర్థులను చూసి ఓట్లు వేసే పరిస్థితి వుండదు. అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకే ప్యాట్రన్‌లో ఓట్లు పడొచ్చు. ఒకవేళ వైసిపి అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డినే రంగంలోకి దించితే ఆయనపై గతంలో పనిచేసినంత వ్యతిరేకత ఈసారి పనిచేస్తుందా అన్నది కూడా సందేహమే! కాకపోతే మేకపాటి బదులు ఇంకొకరిని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపితే ఆ వ్యతిరేకత కూడా వుండకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here