Home సంపాదకీయం మోగిన నగారా!

మోగిన నగారా!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ భారతదేశంలో వుంది. ఈ దేశంలో ఎన్నికలంటే ఆషామాషీ విషయం కాదు. ప్రపంచ దేశాలకే ఆదర్శవంతమైన ఎన్నికల వ్యవస్థ మనది. దాదాపు 82కోట్ల మంది ఓటర్లు… 29 రాష్ట్రాలు… 7 కేంద్రపాలిత ప్రాంతాలు… 543 లోక్‌సభ నియోజకవర్గాలు…. ఇంతటి సువిశాల దేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే వేదిక సార్వత్రిక ఎన్నిక.

అలాంటి చారిత్రాత్మక ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఎన్నికతో పాటు నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం ముహూర్తం నిర్ణయించేసింది. మార్చి 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశలలో పోలింగ్‌ జరుగనుంది. ఏప్రిల్‌ 11వ తేదీన తొలిదశలో 20 రాష్ట్రాలకు సంబంధించి 41లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 18వ తేదీన రెండో దశలో 13రాష్ట్రాలకు సంబంధించి 97లోక్‌సభ స్థానాలకు, 3వ విడతలో ఏప్రిల్‌ 23వ తేదీన 14రాష్ట్రాలకు సంబంధించి 115 స్థానాలలో, ఏప్రిల్‌ 27వ తేదీన నాలుగో విడతలో 9రాష్ట్రాలకు సంబంధించి 71 స్థానాలలో, మే 6వ తేదీన ఐదో విడతలో 7 రాష్ట్రాలకు సంబంధించి 51 స్థానాలలో, మే 12వ తేదీన ఆరో విడతలో 7 రాష్ట్రాలకు సంబంధించి 59 స్థానాలలో మే 19వ తేదీ ఏడో దశలో 8రాష్ట్రాలకు సంబంధించి 59 స్థానాలలో ఎన్నికలు జరుగనున్నాయి. మే23వ తేదీన దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడి కేంద్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందనేది తేలనుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇక తొలివిడతలోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు పెట్టడం వల్ల డబుల్‌ ఓటు సమస్యను అధిగమించే అవకాశ ముంది. సీమాంధ్రులు చాలామంది హైదరాబాద్‌ మరియు కొన్ని తెలంగాణ పట్టణాల్లో ఓటు హక్కును కలిగి వుండడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తమ సొంత గ్రామాలలో కూడా ఓట్లు కలిగి వున్నారు. రెండు చోట్లా ఒకేరోజు ఎలక్షన్‌తో ఈ సమస్యను చాలావరకు ఎదుర్కొన్నట్లే!

ఏపిలోని 175 శాసనసభ స్థానాలకు కూడా ఏప్రిల్‌ 11వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగబోతున్నాయి. ఏపి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్చి 18న నోటిఫికేషన్‌ వెలువడుతోంది. 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ వుంటుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 10రోజులు మాత్రమే గడువు వుంటుంది. దేశ ఎన్నికల చరిత్రలో అభ్యర్థుల ప్రచారానికి ఇంత తక్కువ వ్యవధి రావడం ఇదే తొలిసారి.

ఏపిలో ఇంతవరకు ప్రధాన పార్టీలు రెండూ పూర్తిస్థాయిలో అధికారికంగా అభ్యర్థులనే ఖరారు చేయలేదు. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసిపిలు రెండూ కూడా ఇంత తొందరగా ఏపిలో ఎన్నికలు పెడతారని ఊహించలేదు. ఏప్రిల్‌ 11వ తేదీన పోలింగ్‌ అనడంతో ఇరు పార్టీల నాయకులు షాకయ్యారు. వెంటనే పార్టీ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకుని అభ్యర్థుల ఎంపిక పనిలో పడ్డారు. అలాగే వ్యవధి తక్కువగా ఉండడంతో సుడిగాలి ప్రచారానికి ఇరు పార్టీల అధినేతలు సమాయత్తమవుతున్నారు.

2014 ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి రావడం తెలిసిందే! బీజేపీకి సొంతంగా 283 స్థానాలు రాగా ఎన్డీఏలోని మిత్రపక్షాలను కలుపుకుని 334 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌ 44 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఆ ఎన్నికల్లో యూపిఏ ప్రభుత్వ కుంభకోణాలపై దేశ ప్రజలు ఎంతగా విరక్తి చెందారనే విషయం బయటపడింది. అదే సమయంలో నరేంద్ర మోడీ పట్ల దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకం బీజేపీ అనుహ్య విజయానికి బాటలు వేసింది.

మరి రేపు జరిగే ఎన్నికలు ఎవరితో ఎవరికి జరగబోతున్నాయి? అయిదేళ్ళ ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం కాబోతున్నాయా? దేశ ప్రజలు నరేంద్ర మోడీకి సరైన ప్రత్యామ్నాయంగా రాహుల్‌గాంధీని ఆదరిస్తారా? లేక ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుని ప్రభుత్వ ఏర్పాటులో మూడో ఫ్రంట్‌ కీలకపాత్ర పోషించబో తుందా? కేంద్రంలో బీజేపీని కాదు నరేంద్ర మోడీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్‌ నేతృత్వంలో దాదాపు 23పార్టీలు ఒక కూటమికట్టాయి. అయితే వీటిలో ఎక్కువ పార్టీలు, వాటి నాయకులు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్ళే! మరి ప్రజలు వీళ్లను నమ్ముతారా? కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో 44సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయగలుగుతుందా? ఆ పార్టీకి పెద్దసంఖ్యలో సీట్లొచ్చే రాష్ట్రాలు కూడా పెద్దగా లేవు. ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నది కేరళ, కర్నాటక, మహా రాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలపైనే! కాని అక్కడ రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్‌కు ఈసారి వందసీట్లు వస్తే గొప్పేననిపిస్తోంది.

సర్వేలన్నీ కూడా కేంద్రంలో మళ్ళీ బీజేపీదే అధికారం అని ఘోషిస్తున్నాయి. మోడీ పాలనపై తొలినాళ్ళలో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. అయితే ఆయన నూరుశాతం అంచనాలను చేరుకోలేకపోవచ్చుగాని అవినీతి కుంభకోణాలకు తావులేని ఒక నిజాయితీ ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాడు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి వాటివల్ల మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపించినా మౌలిక రంగాలలో సాధించిన అభివృద్ధి, ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేయడం, నీతివంతమైన పాలన, రైతులకు ఆర్ధిక భద్రత, పిఎంఆర్‌వై గృహనిర్మాణాలు, దేశ వ్యాప్తంగా విద్యుద్దీకరణ, రైల్వే ప్రగతి, ఉగ్రశిబిరాలపై మెరుపుదాడులు, ప్రపంచ దేశాలలో పెరిగిన దేశ ప్రతిష్ట… ఇత్యాది అంశాలన్నీ కూడా ప్రజల్లో మళ్ళీ మోడీ ఇమేజ్‌ను పెంచాయి. దేశం భద్రంగా ఉం డాలంటే మళ్ళీ మోడీనే ప్రధాని కావాలి అనే ఒక బలమైన నినాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తుండగా, బీజేపీయేతర పక్షాలు మాత్రం మోడీపై వ్యతిరేకత, నోట్ల రద్దు వైఫల్యాలు, మైనార్టీ ఓటు బ్యాంకులు బీజేపీని కూలదోసి తమకు పట్టం కడతాయని నమ్ముతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here