Home జిల్లా వార్తలు మేకపాటి ముంచుతాడా?

మేకపాటి ముంచుతాడా?

ఒక్క ఓటు తేడాతో ఒక సీటు ఓడిపోవచ్చు. ఒక్క సీటు తోడాతో ఒక పార్టీ ఓడిపో వచ్చు. రాజకీయాలలో లెక్క అన్నది చాలా ముఖ్యం. ప్రతి సీటును ప్రతి ఓటును విలువైనదిగా భావించినప్పుడే రాజకీయాలలో లక్ష్యాలను అందుకోగలుగుతారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీలున్నాయి. ఒక్క ఓటు తేడాతో వైసిపి ఒక సీటు ఓడిపోయిందనుకుందాం… ఒక్క సీటు తేడాతో అధికారమే రాకపోవచ్చు. వైసిపికి 87 వచ్చి… తెలుగుదేశంకు 88 వచ్చి అప్పుడు తిరిగి అధికారంలోకి వస్తే.. అలాంటి పరిస్థితిని అసలు తట్టుకోగలరా? చేసిన పొరపాట్లను అప్పుడు సరిదిద్దుకోగలరా?

మరి మరోసారి వైసిపిలో అలాంటి పొరపాట్లకు అవకాశమివ్వాలనుకుంటున్నారా? రాష్ట్రంలోనే వైసిపి ఎంతో బలంగా వుందనుకుంటున్న నెల్లూరుజిల్లాలోనే పరిస్థితిని చేజేతులా పాడుచేసుకుంటున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ పరిణామాలకు కారణం పార్టీలో మేకపాటి కుటుంబ రాజకీయం.

2014 ఎన్నికల్లో మేకపాటి కుటుంబానికి మూడు సీట్లిచ్చారు. నెల్లూరు లోక్‌సభతో పాటు ఆత్మకూరు,

ఉదయగిరి అసెంబ్లీలలో ఆ కుటుంబసభ్యులే పోటీ చేశారు. ఎంపి అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వల్లే అప్పుడు రెండు అసెంబ్లీలు ఓడిపోయారనే ప్రచారం వుంది. ఎలాగూ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి దానిని సీరి యస్‌గా తీసుకోలేదు. అదే ఒకట్రెండు సీట్ల తేడాతో అధికారం మిస్‌ అయ్యుంటే దీనిని సీరియస్‌గా తీసుకోవల్సిన పరిస్థితే కదా! మేకపాటి కుటుంబానికి మూడు సీట్లు వల్లే 2014 ఎన్నికల్లో వైసిపిలో చేరాల్సిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశంలో చేరి, వాళ్ళకు బలమైన అభ్యర్థి, వైసిపికి గట్టి ప్రత్యర్థి అయ్యాడు.

2019 ఎన్నికల్లో మరోసారి మేకపాటి కుటుంబం పార్టీకి భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి లేవనెత్తబట్టే, ఆత్మకూరు సీటును వదులుకుంటానని చెప్పబట్టే ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరాడు. తీరా ఆయన వైసిపిలో చేరాక తూచ్‌… ఆత్మకూరు నాదే అనడంతో రామనారాయణరెడ్డిని వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. దీంతో అక్కడ ఇన్‌ఛార్జ్‌గా వుండిన జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అలిగి పార్టీకి రాజీనామా చేసివెళ్ళాడు. అక్కడితో అయ్యిందా! నెల్లూరు ఎంపి అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వుంది. మళ్ళీ ఆయనే ఎంపీ అభ్యర్థి అయితే దాని ప్రభావం అసెంబ్లీ అభ్యర్థులపై కూడా పడుతుంది. అందుకని ఆయనకు బదులుగా ఎంపి అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని పార్టీలోకి తీసుకుని దింపుతామని పార్టీ నాయకత్వం ప్రతిపాదిస్తే, దానికి మేకపాటి అలిగాడు. దీనివల్లనే ఆదాల తెలుగుదేశంలోనే వుండిపోయి నెల్లూరు రూరల్‌లో పోటీకి సిద్ధమయ్యాడని తెలుస్తోంది.

కావలిలో చిచ్చుకు కూడా మేకపాటే కారణం. విష్ణు, వంటేరులేమో సిటింగ్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. మేకపాటి వాళ్ళేమో ప్రతాప్‌కే సీటివ్వాలని పట్టుబట్టారు. వీళ్లకు మధ్యే మార్గం ఆదాలను పార్టీలోకి తీసుకుని కావలి నుండి పోటీలోకి దించి వున్నా సరిపోయుండేది. ఏ సమస్యా వుండేది కాదు.

కొన్ని నెలల క్రితం వరకు నెల్లూరుజిల్లాలోని పది అసెంబ్లీలలో కనీసం 8సీట్లు వైసిపి గెలుస్తుందన్న ప్రచారం వుండింది. ఇప్పుడు ఏడు నియోజకవర్గా లలో నువ్వా-నేనా అనే రీతిలో పోటీకొచ్చాయి. ఇక రేపు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపి అభ్యర్థి అయితే పరిస్థితులు ఇంకెంతగా తల్లక్రిందులవుతాయో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here