Home సంపాదకీయం మృత్యువుపై విజయం

మృత్యువుపై విజయం

దురదృష్టం వెంటాడుతున్నప్పుడు..కర్ర కూడా పామై కరుస్తుందని సామెత. ఒక్కోసారి అంతే. సరదాగా ఏ సాహసమో చేయాలని ప్రయత్నిస్తే చివరికది ప్రాణాలమీదికి వస్తుంటుంది. అదృష్టం బావుంటే బతికి బట్టకడతాం.. లేకుంటే లేదు. ఇలాంటి ఘటనలు ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిత్యం బోలెడు జరుగుతూనేవుంటాయి.

అయితే, థాయ్‌లో ఇటీవల జరిగిన ఘటన మాత్రం వళ్ళు గగుర్పొడిచేంత ఆందోళన కలిగించేదే! అయితే, సహాయకుల సాహసంతో కథ సుఖాంతమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. థాయ్‌లో ఒక పెద్ద గుహ వుంది. దాని పేరు తామ్‌ లువాంగ్‌ గుహ. అది సుమారు పదికిలోమీటర్ల పొడవుంటుంది. లోపలంతా చీకటిగా..వంకరటింకరగా ఏదో మాయాగుహలా ఉంటుందది. లోపలికి వెళ్తే.. ఇక తిరిగివస్తామన్న నమ్మకం కూడా లేదు. అంత భయంకరమైన గుహను సరదాగా చూసొద్దామని కొంతమంది పిల్లలు ముచ్చట పడ్డారు. వారంతా 11 నుంచి 16 ఏళ్ళ వయసున్న బాలలే. వీరంతా ఫుట్‌బాల్‌ ప్లేయర్లు కావడం విశేషం. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడడానికి వచ్చి పనిలోపనిగా ఆ గుహను కూడా చూడాలని అనుకోవడం, అందుకు వారి కోచ్‌ నేను ఆ గుహను చూపిస్తానంటూ తీసుకు వెళ్ళడంతో కథ ప్రారంభమైంది. మొత్తం 12 మంది పిల్లలు, ఒక కోచ్‌. ఈయనకు పాతికేళ్ళ వయసు. అందరూ కలసి ఆ కొండ గుహలోకి వెళ్ళారు. అలా చూస్తూ చూస్తూ..రెండు కిలోమీటర్ల దూరం లోపలకి వెళ్ళిపోయారు. ఇంతలో దురదృష్టం వర్షం రూపంలో వారిని వెంటాడింది. వారు లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే బయట హోరుమంటూ కుంభవృష్టి కురవడంతో వారు వెళ్ళిన దారంతా రాళ్లూరప్పలూ, బురద, వరద నీటితో నిండిపోయాయి. అంతే, దారులన్నీ ఎక్కడికక్కడ మూసుకుపోవడంతో వారి పరిస్థితి సంకటంగా మారింది. వెనుదిరిగి రావడానికి దారి లేకపోవడంతో ఆ గుహ లోపలెక్కడో వారంతా చిక్కుకుపోయారు. అసలే, కటికచీకటి..పైగా ఎటుచూసినా వరదనీరు..బురదనీటి ప్రవాహమే. ఈత కొడుతూ వచ్చేయవచ్చు కదా అనుకుంటే, అందులో ఏ ఒక్కరికి కూడా ఈత రాదు. జూన్‌ 23వ తేదీన జరిగిందిది. వారు లోపలకి వెళ్లాక భారీ వర్షం కురవడంతో వరదనీరు లోపలికి ముంచెత్తింది. గుహను తొలిచి బాలలను పైకి తీసుకువద్దామంటే, గుహ పైభాగమంతా దట్టమైన అడవి. ఆ కొండలోపలున్న గుహలో వారు సరిగ్గా ఎక్కడున్నారో తెలిసే పరిస్థితే కనిపించలేదు. అప్పటికీ అక్కడక్కడా ఆ గుహకు సుమారు వంద రంధ్రాలు వేసినా, వారి ఆచూకీ తెలియలేదు. మరోవైపు, బాలలు అక్కడే ఉంటే గాలి వెలుతురు లేక, ఊపిరాడక మరణించే ప్రమాదం ఎంతైనా వుంది. అలా ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చే ప్రయత్నంలోనే గజ ఈతగాడు, థాయిలాండ్‌కు చెందిన నావికాదళం మాజీ సీల్‌ సమన్‌ గునన్‌ ప్రాణాలు కోల్పోయాడు కూడా. ఈ సంఘటనతో అటు గుహ లోపలున్న బాధితులకు, ఇటు గుహ వెలుపల వున్న సహాయక సిబ్బందికి, ఇవన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తున్న ప్రపంచప్రజలకు తీరని ఆందోళన కలిగించాయి. చకచకా రోజులు గడుస్తుంటే.. బాలలు ఇప్పుడు ఏ దశలో ఉన్నారో అంటూ ప్రతిరోజూ అందరికీ ఆందోళనే. ఒక దశలో ఇక ఆ బాలల్ని రక్షించడం సాధ్యం కాదనే అందరూ అనుకున్నారు కూడా. అయితే, 8వ తేదీన గజ ఈతగాళ్ళు ఎంతో సాహసంతో గుహ లోపలకు వెళ్ళి ఆరుగురు బాలలను క్షేమంగా బయటకు తీసుకురావడంతో అందరిలోనూ ఆశలు వెల్లివిరిశాయి. ఏరోజు కారోజు సరికొత్త ఆలోచనలతో సహాయక సిబ్బంది, అన్ని రకాల యంత్రాలు, పరికరాలు, పలుదేశాల యంత్రాంగం అంతా శరవేగంగా కదిలారు. ఒక్కక్షణం కూడా ఆగకుండా అన్ని చర్యలను చకచకా తీసుకున్నారు. 9వ తేది నాటికి మరో నలుగురు బాలలను సురక్షితంగా గుహ వెలుపలకి తీసుకువచ్చారు. వాతావరణం అనుకూలించకపోయినా, పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నా సహాయక యంత్రాంగం, నిపుణులు నిరాశచెందక అహరహం తమ కృషిని కొనసాగించారు. తమ విజ్ఞానాన్నంతా రంగరించి.. తమ అత్యద్భుతమైన ఆలోచనలతో.. సాంకేతిక పరిజ్ఞానాన్నంతా కుమ్మరించారు. ఎట్ట కేలకు… ఈ బృహత్‌యత్నంలో అందరూ కలసి ఘనవిజయం సాధించారు. మృత్యువు కబళించేస్తుం దనుకున్న ఆ బాలలందరినీ, కోచ్‌తో సహా అందరినీ జులై 10వ తేదీ నాటికి ఆ మృత్యుగుహ నుంచి మిగిలినవారందరినీ వెలుపలికి సురక్షితంగా తీసుకు వచ్చి బాధితుల కుటుంబాల కన్నీరు తుడిచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల అభినందనలు అందు కున్నారు. ఈ 18 రోజులూ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా వారి ప్రాణాలు కాపాడిన సహాయక సిబ్బంది, ఎందరో నిపుణులు..అందరూ మహానుభావులే!.. ఈ సందర్భంలో, బాలల్ని కాపాడేందుకు స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌మస్క్‌ ఒక చిన్న జలాంతర్గామిని కూడా అప్పటికప్పుడు తయారుచేయించడం విశేషం. ఈ ఘటనలో, బాలలను కాపాడంలో భారతీయ కంపెనీ అయిన కిర్లోస్కర్‌ కంపెనీవారి సాంకేతిక పరిజ్ఞానం కూడా చక్కగా ఉపయోగపడడం అభినందనీయం!.. ఏదేమైనా టెక్నాలజీ ఒక అద్భుతం!… బోరుబావుల్లో పడిన చిన్నారులను వెలికితీయడం వంటి సందర్భాల్లో ఇలాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చూసుకోవడం అన్ని దేశాలకూ మంచిదే!.. కాగా, అన్నిరోజుల పాటు కేవలం వాననీటినే తాగి ప్రాణాలు నిలబెట్టుకున్న ఆ బాలల ఆత్మవిశ్వాసం కూడా అద్భుతమైనదే. ఆ చిమ్మచీకట్లో.. కేవలం టార్చ్‌ వెలుతురులోనే డైవింగ్‌ చేస్తూ గుహ వెలుపలికి రావడం ఆ బాలల మనోధైర్యానికి ప్రతీక. ముఖ్యంగా, సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తున్న నేటి అధునాతన కాలంలో ఎన్నెన్నో ప్రమాదాల నుంచి కాపాడుతున్న టెక్నాలజీకి ఈ సందర్భంగా..ధన్యవాదాలు. ఏదేమైనా, ఎంతో సాహసోపేతంగా 12 మంది బాలలను, వారి కోచ్‌నూ ఆ మృత్యుగుహ నుంచి కాపాడి, ప్రపంచ ప్రజల అభినందనలందుకున్న సహాయసిబ్బందికీ, నిపుణులకీ…అధికార యంత్రాంగానికి.. అభి నందనలు!.. అన్నిటికీమించి బాధితులందరినీ రక్షించిన సహాయక సిబ్బంది ధైర్యసాహసాలకి జేజేలు!…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here