Home జిల్లా వార్తలు మూడు చోట్ల ఖరారు… ‘దేశం’ కేడర్‌లో హుషారు!

మూడు చోట్ల ఖరారు… ‘దేశం’ కేడర్‌లో హుషారు!

రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ బలహీనంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి! ఇక్కడ ఆ పార్టీకి అభ్యర్థుల సమస్య ప్రధాన సమస్యగా వుండింది. ఎవరు పార్టీలో వుంటారో, ఎవరు పార్టీలో నుండి వెళతారో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఏ నియోజకవర్గానికి ఎవరిని అభ్యర్థిగా నియమించాలనే విషయంపై అయోమయం నెలకొనివుంది.

ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారుతుందని భావించిన చంద్రబాబు, వైసిపి బలంగా వున్న నియోజకవర్గాలలో గట్టి అభ్యర్థులను నిలపాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మూడు స్థానాలకు ముగ్గురు ప్రధాన నాయకులను అభ్యర్థులుగా ఖరారు చేసేశారు. అయితే ఇది అధికారికంగా వెలువడలేదనుకోండి!

నెల్లూరు నగరానికి మంత్రి నారాయణ, నెల్లూరురూరల్‌కు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సర్వేపల్లికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఖరారు చేశారు. సర్వేపల్లి సోమిరెడ్డికి కొత్త కాదు. 1994 నుండి ఆయనే పోటీ చేస్తున్నాడు. ఇప్పటికి ఐదుసార్లు పోటీ చేశాడు. రెండుసార్లు గెలిచి, మూడు దఫాల నుండి ఓడిపోతున్నాడు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీయై మంత్రి పదవి పొంది, తన పదవి ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశాడు. ఐదేళ్ళుగా నియోజకవర్గాన్ని వదిలి పెట్టకుండా తిరుగుతున్నాడు. గెలుపే ధ్యేయంగా కృషి చేస్తున్నాడు. మరి ఈసారి ప్రజలు సోమిరెడ్డి అభివృద్ధిని చూస్తారా లేక తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తారా? జగన్‌ పట్ల అభిమానం చూపిస్తారా…? అనే అంశాల మీద ఇక్కడి గెలుపోటములు ఆధారపడివున్నాయి.

నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీకి దిగబోతున్నాడు. ఆయనకు ఇది తొలి ఎన్నిక! కొంతకాలంగా నెల్లూరు నగరానికి ఆయన పేరు ప్రచారంలో వుంది. అయితే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడంపై అనుమానాలు వున్నాయి. ఆ అనుమానాలకు తెర దించారు. వైసిపి బలంగా వున్న నియోజకవర్గాలలో నెల్లూరు సిటి కూడా వుంది. మంత్రి నారాయణ అయితేనే ఇక్కడ పోటీ ఇవ్వగలడని చంద్రబాబు ఆయనను దించారు. తెలుగుదేశం పార్టీ పెట్టాక ఇంతవరకు నెల్లూరు సిటీ నుండి ఆరుసార్లు పోటీ చేస్తే రెండుసార్లు మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఒకరకంగా చూస్తే గెలుపుకు ఆ పార్టీ ముఖం వాచిందనే చెప్పాలి. మరి నారాయణతో ఆ కల నెర వేరుతుందా? అన్నది కూడా చూడాలి.

నెల్లూరురూరల్‌లో మాత్రం ఎన్నో పేర్లు చక్కర్లు కొట్టాయి. నాలుగున్నరేళ్ళు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన ఆదాల ప్రభాకర్‌రెడ్డే ఈ సీటు నుండి పోటీ చేయడానికి సంకోచించాడు. పార్టీలో కొందరు నాయకుల పట్ల వున్న అనుమానం వల్లే ఆదాల ఇక్కడ పోటీకి వెనకడుగేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్ర బాబు… నువ్వే ఇక్కడ సరైన పోటీ అని చెప్పడంతో ఆదాల రూరల్‌ బరిలోకి దిగడానికి సిద్ధమయ్యాడు. రూరల్‌ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గమైనప్పటికీ రూరల్‌ ఏర్పడినప్పటి నుండి ఇప్పటికి రెండుసార్లు ఎన్నికలు జరిగితే ఓసారి కామ్రేడ్లకు, మరోసారి బీజేపీకి అలయన్స్‌లో సీట్లు ఇవ్వడంతో ఓటమికి గురైంది. ఈసారి సీన్‌ మారింది. తొలిసారిగా తెలుగుదేశం ఇక్కడ నుండి అభ్యర్థిని సైకిల్‌ గుర్తుతో బరిలో దించింది. నాలుగున్నరేళ్ళు ఇన్‌ఛార్జ్‌గా వున్న ఆదాలనే బరిలో దింపడంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఆదాల అభ్యర్థి కావడంతో రూరల్‌లో రూలర్‌ ఎవరన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

జిల్లా తెలుగుదేశంలో వీళ్ళ ముగ్గురూ సీనియర్లు. వీళ్ళకు రూటు క్లియర్‌ కావడంతో మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల పైనే కసరత్తు మిగిలివుంది.

అసంతృప్తితో ఆశావహులు…

జిల్లాలో నెల్లూరు సిటి, నెల్లూరు రూరల్‌, సర్వేపల్లి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసి నట్లే! సర్వేపల్లి సీటు మీద ఏ నాయకుడూ ఆశలు పెంచుకోలేదు. మొదట్నుండి అది సోమిరెడ్డిదే అనే పేరుంది. నెల్లూరు సిటి, రూరల్‌పై మాత్రం పలువురు నాయకులు ఆశలు పెంచుకున్నారు. సిటీపై మాజీఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీమున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ అనూరాధలు రేసులో వున్నప్పటికీ… ఇప్పుడు, నారాయణే బరిలో దిగడంతో వీళ్ళు సరిపెట్టుకున్నారు.

రూరల్‌ విషయంలోనే కొంత ఇబ్బంది వచ్చింది. మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు, పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డికి ఈ సీటుపై మధ్యలో ఆశలు కల్పించారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఫిక్సయినట్లు రూరల్‌లో కూడా ఆదాల మొదటి నుండి ఫిక్స్‌ అయ్యుంటే రెండో పేరే పరిశీలనలోకి వచ్చేది కాదు. ఆదాల లోక్‌సభకు పోటీ చేస్తాడన్న నేప థ్యంలో రూరల్‌కు మంత్రి నారాయణ తన మనిషిగా మేయర్‌ అజీజ్‌ పేరును, సోమిరెడ్డి తన అనుచరుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి, ఆదాల తనకు ముఖ్యుడైన ఆనం జయకుమార్‌రెడ్డి పేర్లను ప్రతిపా దించి వారిలో లేని ఆశలు కల్పించారు. కోవూరు సీటుకు పోటీపడుతున్న పెళ్ల కూరును నెల్లూరురూరల్‌ సీటు ఇస్తామని డైవర్ట్‌ చేశారు. మైనార్టీల కోటాలో నెల్లూరు సిటీ సీటడిగిన అజీజ్‌ను కూడా నెల్లూరు రూరల్‌ రేస్‌లో పెట్టారు. తీరా చూస్తే వీరి ముగ్గురిలో ఎవరికీ సీటు లేదు. దీంతో ఈ ముగ్గురూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఈ ముగ్గురినీ బుజ్జగించ డానికి నానా తంటాలు పడుతున్నాడు. అటు రూరల్‌లోనూ ఇటు నగరంలోనూ వీళ్ళవసరం పార్టీకి చాలావుంది. చంద్ర బాబు వీరిని ఎలా బుజ్జగిస్తాడో వేచిచూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here