Home సంపాదకీయం ముళ్ళబాటలో… బడిబాట

ముళ్ళబాటలో… బడిబాట

కొట్టేసినట్లే. వానమబ్బులు కనిపిస్తే చాలు..బడిదాకా కూడా వెళ్ళక్కరలేకుండానే, చిత్తుకాగితాలతో కాయితప్పడవలు చేసుకుంటూ హాయిగా ఇంటికాడ కూర్చుంటే సరిపోతుంది..అనేవారు అప్పట్లో. ఎందుకంటే, వానొస్తే ఉరిసే బడులు మనకి కొత్తకాదు. అందువల్ల సెలవు ఇవ్వక తప్పదు. కొన్ని బడుల్లోనైతే అసలు గదులే వుండవు కనుక.. చెట్లకిందనే పాఠాలు చదువుకోవచ్చు. పైన మేఘాలు నల్లబడితే చాలు.. గబగభా లేచి ఇంటికి పోనూవచ్చు. అందువల్ల మన చదువులన్నీ వానాకాలపు చదువులని పేరొచ్చింది. ఆ పాతకాలపు నాటి పరిస్థితి ఇంత అధునాతన కాలం వచ్చినా పోలేదంటే దానికి కారణాలు బోలెడు. అటు ప్రభుత్వాలకి కానీ, ఇటు అధికారగణానికి గానీ విద్యారంగం అభివృద్ధి పట్ల ఆశించిన

ఉత్సాహం లేకపోవడమే ప్రధాన కారణం. దానికి తగ్గట్టుగానే విద్యారంగానికి అవసరమైన నిధులుం డవు. అటు కేంద్రప్రభుత్వం కానీ, ఇటు ఆయా రాష్ట్రప్రభుత్వాలు కానీ ఎంతోకాలం నుంచి విద్యా రంగాన్ని ఎదగబెట్టకుండా నిధులివ్వక ఎండబెడుతుం డడమే విచారకరం.

అయితే, విద్యాప్రమాణాలు పడిపోతుండడానికి విద్యార్థుల అలసత్వమే కారణమనే అభిప్రాయం మంచిది కాదు. ఇటీవల లోక్‌సభలో తాజాగా ఆమో దించిన విద్యాహక్కు చట్టం (రెండో సవరణ) బిల్లు ప్రతిపాదనలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. దాని ప్రకారం, పిల్లలు ఇకపై ప్రతి తరగతి లోనూ నిర్ధేశించిన మార్కులు పొందితేనే పై తరగతు లకు పంపుతారు. ఫెయిలైన విద్యార్థులకు ఫలితాలు వెలువడిన రెండు నెలల్లో మరోసారి పరీక్ష నిర్వహి స్తారు. కానీ, అందులోకూడా పాస్‌ కాకుంటే మాత్రం ఆ తరగతిలోనే ఉంచేయాలన్నది ఆ కొత్త ప్రతిపాదన. అయితే, గతంలోకి వెళ్తే..బడిఈడు పిల్లలందరికీ నిర్భంధ ఉచిత విద్య అందిస్తామని విద్యార్థులు ఎలా చదివినా వారిని 8వ తరగతి వరకు ఫెయిల్‌ చేయకూడదని విద్యాహక్కు చట్టంలో పేర్కొన్నారు. 14 ఏళ్ళ లోపు పిల్లలకు తప్పనిసరి విద్య అమలుకావాలన్నదే దాని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, పాసయితే

ఉపాధ్యాయుల గొప్ప, ఫెయిలైతే విద్యార్థుల తప్పు.. అనే నేటి భావన సరైనది కాదు. ఫెయిల్‌ కావడమన్నది పిల్లల తప్పుగా భావించి, ఫెయిలయ్యే పిల్లల్ని చదువుకు దూరం చేయాలనుకోవడం సముచితం కాదు. చదువులో వెనుకబడిన బాలలపై దృష్టిపెట్టి వారిని సరిగ్గా చదివిస్తే మంచి ఫలితాలే వస్తాయి.

అసలు మన విద్యాహక్కు చట్టమే లోపభూయిష్టం. విద్యాహక్కు చట్టంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా దేశంలో ఎన్ని పాఠశాలలు సక్రమంగా ఉన్నాయో నిపుణులతో కమిటీలు వేసి చూస్తే అసలు బండారం బయటపడిపోతుంది. ఇప్పటికీ దేశంలో ప్రాధమిక విద్యారంగ సంస్థలు అనేకానేక అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠశాలలు సక్రమంగా లేకపోయినా, నిబంధనల ప్రకారం

ఉండాల్సిన వసతులు పాఠశాలల్లో కనిపించకపోయినా పట్టించుకునేవారు లేరు. మొండిగోడల మధ్యలోనో, చెట్లకిందనో పిల్లలు అవస్తలు పడి చదువుకునే పరిస్థితి నేటికీ దేశంలోని వేలాది పాఠశాలల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరత నేటికీ తీవ్రంగా ఉంది. ఏళ్ళతరబడిగా ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ ఇలాంటి సమస్యలను పట్టించుకోకపోవడమే బాధాకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విద్యారంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నాయో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.. నాలుగేళ్ళ క్రితం మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి 4.57 శాతం కేటాయించిన కేంద్రం, ఈ ఏడాదికి దానిని 3.71 శాతానికి తగ్గించిందంటే విద్యారంగానికి మన ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యత ఎలా

ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో, సరస్వతీ నిలయాలుగా వర్థిల్లాల్సిన మన పాఠశాలలు ఎప్పుడూ అవస్తలకు నిలయాలుగానే ఉంటున్నాయి. తాగునీటి సౌకర్యం కానీ, మరుగుదొడ్ల వసతులు వగైరాలు కూడా లేకపోవడం వంటి ఇబ్బందుల సంగతి సరే సరి!.. ఇన్ని రకాల సమస్యల ముళ్ళబాటలో బడిబాట ఎలా సాగాలో ఊహించండి. గత నాలుగేళ్ళలో దేశ వ్యాప్తంగా రెండు లక్షల పాఠశాలల దాకా మూతపడ్డా యంటే దేశంలో పాఠశాల విద్య పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చు. విలీనం పేరుతో అనేక పాఠశాలలు కూడా మూతపడ్డాయి. చాలినన్ని గదులు, మంచి వసతులు, తగినంతమంది ఉపాధ్యాయులు ఉండాలే గానీ, విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తి కల్పించి, వారిని బాగా చదివేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడ ఒక్క విషయం ఆలోచించాల్సి ఉంది. దేశంలో నేటికీ ఎంతోమంది విద్యార్థులు దుర్భర పేదరికంతో, రక రకాల సమస్యలతో నలిగిపోతున్నారు. బడుగు, బలహీనవర్గాలు, నిరుపేదల కుటుంబాల్లో ఎన్నో బాధలుంటాయి. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు కూడా వారిమీద ప్రభావం చూపుతుంటాయి. అందువల్ల వారు ఏ కారణంతో చదువుపై ఆసక్తి చూపలేకపోతున్నారో ఉపాధ్యాయులు ఓర్పుతో గ్రహించి, వారిని కూడా చదువులో రాణించేలా కృషిచేయాలే తప్ప ఫెయిలవడం అన్నది విద్యార్థుల తప్పంటూ వారినలాగే వదిలేయడం సరైనది కాదు. ఫెయిలవుతామన్న భయం లేకపోవడం వల్లే విద్యార్థుల్లో అలసత్వం ఏర్పడు తోందని, బాగా చదివే పిల్లలు, చదవని పిల్లలు కూడా పైతరగతులకు వస్తుండడం వల్ల ఉపాధ్యాయులకు బోధన కష్టమవుతున్నదనే వాదనల్లో అసలు అర్ధం లేదు. తగినంతమంది ఉపాధ్యాయులుంటే, గురువుల మంచిబోధనలతో ఇలాంటి సమస్యలను సులభంగానే అధిగమించవచ్చు.

ఏదేమైనా, నిరుపేదలు, అట్టడుగువర్గాల పిల్లలకు అన్యాయం చేసే ఈ సవరణ బిల్లును కేంద్రం పున:పరిశీలన చేసి, ఆ ప్రతిపాదనను విరమించు కోవాల్సివుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి పరిపూర్ణంగా నిధులిచ్చి..పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. విద్యారంగంలో ఉన్న అసౌకర్యాలపై దృష్టిపెట్టి.. పాఠశాలల్లో పుష్కలంగా వసతులు కల్పించి.. అంకితభావంతో విద్యను బోధింపజేయడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. తద్వారా.. బాలలకు బంగరుభవితను చూపాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here