Home రాష్ట్రీయ వార్తలు ముందుకు పోతే మునకే!

ముందుకు పోతే మునకే!

”వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌” కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గత కొంతకాలంగా భుజాలకెత్తుకున్న నినాదం. జమిలి ఎన్నికల వల్ల ఏ పార్టీ లాభపడుతుంది, ఏ పార్టీ నష్టపోతుంది అన్నది అప్రస్తుతం. కాని, దేశ ఆర్ధిక వ్యవస్థకు మాత్రం నష్టం తగ్గుతుంది. భారం తగ్గుతుంది. అధికార యంత్రాంగానికి ప్రయాస తగ్గుతుంది. ఎలక్షన్‌ వాతావరణం అంతా కూడా ఒకట్రెండు నెలల్లో ముగుస్తుంది. ఆ తర్వాత నాలుగేళ్ళ పది నెలల కాలంలో పరిపాలనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడానికి అవకాశముంటుంది.

కేంద్రం ఈ దిశగానే కసరత్తు ప్రారంభించింది. అన్ని పార్టీల అభిప్రాయ సేకరణ కోసం లా కమిషన్‌ను నియమించింది. జమిలి ఎన్నికలకు కొన్ని పార్టీలు వ్యతిరేకంగా వున్నాయి. మరికొన్ని పార్టీలు అనుకూలంగా తమ అభిప్రాయాల్ని వెల్లడించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు జమిలి ఎన్నికలకు ‘సై’ అంటున్నాయి. ఒక్క తెలుగుదేశం మాత్రం జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా వుంది.

జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు దీనికి అనుకూలంగా మాట్లాడింది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే! అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ఆ తర్వాత పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టొచ్చంటూ ఆయన పలు సందర్భాలలో చెప్పాడు. కాని, ఇప్పుడు మాత్రం జమిలి ఎన్నికలకి ససేమిరా అంటున్నాడు.

జమిలి ఎన్నికలకు పోవాలంటే రాష్ట్ర అసెంబ్లీని ముందుగానే రద్దు చేయాల్సి వుంటుంది. దేశంలోని అన్ని పార్లమెంటు స్థానాలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి ఈ ఏడాది ఆఖర్లోగాని లేదా వచ్చే ఏడాది మొదట్లో గాని అను కూలంగా వుంటుంది. ఏపి అసెంబ్లీకి 2019 మే నెల దాకా గడువుంది. జమిలి ఎన్నికలకు వెళితే ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ బలంగా వుందో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబు ఖచ్చితంగా ఏదో ఒక కూటమి వైపు ఉండాల్సి వస్తుంది. బీజేపీకి దూరమైనప్పటి నుండి ఆయన కాంగ్రెస్‌తో సన్నిహితంగా వుంటున్నాడు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలను కూడగట్టి తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటుకు పావులు కదుపుతున్నాడు. జమిలి ఎన్నికలు జరిగి బీజేపీ ఓడిపోయి తృతీయ ఫ్రంట్‌, కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబుకు సమస్యేమీ లేదు. అలాకాకుండా మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వస్తే చంద్రబాబుకు సినిమా మొదలవుతుంది. ఏపిలో తిరిగి అధికారం దక్కించుకుంటే నిలదొక్కుకోగలడు. కాని, ఓడిపోతే పరిస్థితి దారుణంగా వుంటుంది. అదే ఏపి అసెంబ్లీ కంటే ముందుగా పార్లమెంట్‌ ఎన్నికలు జరిగితే… ఫలితాలను బట్టి ట్రెండ్‌ అర్ధమవుతుంది. ఏపిలో తన పార్టీ పరిస్థితేంటో తెలుస్తుంది. సీట్లు తక్కువ వస్తే అసెంబ్లీ ఎన్నికలనాటికి సరిదిద్దు కోవడానికి అవకాశముంటుంది. అదీగాక బీజేపీయే మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో తెగిపోయిన సంబంధాలను మళ్ళీ అతికించుకునే ప్రయత్నాలు చేయవచ్చు. బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు వస్తే… రాష్ట్రంలో ఆ పార్టీతోనైనా అంటకాగొచ్చు. కేంద్రంలో కాంగ్రెస్‌ సంబంధిత ప్రభుత్వమే వస్తే ప్రతిపక్ష నేత జగన్‌పై కేసులు తిరగతోడించి వైసిపిని బలహీనపరిచే ప్రయత్నం చేయవచ్చు. కేంద్రం అండతో వైసిపిలో వున్న పెద్ద లీడర్‌లను తిరిగి కాంగ్రెస్‌లోకే వెళ్ళే విధంగా ఒత్తిళ్ళు తెప్పించవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ తిరిగి ప్రాణం పోసుకుంటే వైసిపి ఓటు చీలి తాను లాభపడవచ్చు.

ఇన్ని రకాలుగా ఆలోచిస్తుండబట్టే చంద్రబాబు ముందుగా పార్లమెంటు ఎన్నికలు జరిగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలని చెప్పి అందరితోపాటు తానూ ముందస్తుకుపోతే మునిగిపోతాననే భయం ఆయనను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here