Home జాతీయ వార్తలు ముందస్తుకు.. ముహూర్తం?

ముందస్తుకు.. ముహూర్తం?

ముందస్తు ఎన్నికలు… తాజా జాతీయ రాజకీయాలలో ఇప్పుడిదొక చర్చ. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరులోనే లోక్‌సభకు ముందస్తు ఎన్నికలకు పోనుందన్న సంకేతాలు అందుతున్నాయి. నిన్న జమ్మూ-కాశ్మీర్‌లో పీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకోవడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ముందస్తు ఎన్నికలకు, జమ్మూకాశ్మీర్‌లో పిడిపితో సంబంధాలు తెంపుకోవడానికి సంబంధమేంటనే సందేహం కూడా రావచ్చు. జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుతం గవర్నర్‌ పాలన విధించారు. ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేసి అక్కడ సొంతంగా అధికారంలోకి రావాలన్న ఆలోచన కూడా బీజేపీ నేతలు వున్నట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా ఎన్డీఏ ప్రభుత్వం ‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌’ అనే నినాదాన్ని వినిపిస్తోంది. అయితే దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. వాటి ఎలక్షన్‌లు వివిధ కాలాలలో జరుగుతుంటాయి. లోక్‌సభ ఎన్నికలు జరిగే కాలానికి, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరిగే కాలానికి అసలు పొంతన వుండదు. ఇలా జరగాలంటే చాలా రాష్ట్రాలలో ప్రభుత్వా లను గడువుకంటే ముందే రద్దు చేయాలి. మరికొన్ని రాష్ట్రాలలో గడువు పొడిగించాలి. ఇది కష్టసాధ్యమైన పనే! అదీగాక కొన్ని రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి మధ్యలోనే అవి కుప్పకూలే పరిస్థితులుంటాయి. అలాంటప్పుడు ఆ రాష్ట్రాలలో మధ్యంతర ఎన్నికలు పెడతారా? ఒకవేళ పెట్టిన తర్వాత ప్రభుత్వం ఐదేళ్ళు వుండాల్సి వస్తే, మళ్ళీ లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదు కదా? కాబట్టి ‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌’ అన్నది ఒకేసారి రూపుదాల్చడం కష్టం. అయినా పాక్షికంగా దీనిని ఆచరణలోకి తెచ్చే అవకాశం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేతుల్లోవుంది. ఈ ఏడాది ఆఖర్లో దాదాపు 5రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మరో 5రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలతో పాటూ లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఏడాది ఆఖర్లో నిర్వహించాల్సిన 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయలేరు, గడువు ప్రకారం నిర్వహించాల్సిందే! కేంద్రం తలచుకుంటే లోక్‌సభకు కూడా ఈ రాష్ట్రాలతో పాటే సార్వత్రిక ఎన్నికలకు పోవచ్చు. కాని దీనివల్ల పెద్దగా

ఉపయోగం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి! అలాకాకుండా ఈ ఐదు రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూడా ముందస్తు ఎన్నికలకు ఒప్పించగలిగితే ఎన్డీఏ పెద్దల ‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌’ ఆశయం పాక్షికంగానైనా నెరవేరినట్లవుతుంది. ఇలా రెండు మూడు దఫాల ప్రక్రియ ముగిసాక దేశమంతటా కూడా ఒకేసారి లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిపే పరిస్థితి వస్తుంది.

ఈ ప్రక్రియకు ఇప్పటి నుండే అంకురార్పణ చేయాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరపాలనుకుంటున్న రాష్ట్రాలలో కూడా ఎక్కువ రాష్ట్రాలు బీజేపీకి కీలకమైనవే! జాతీయ పరిస్థితులను కేంద్రంగా చేసుకునే బీజేపీ ముందస్తు ఎన్నికలకు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే నోట్ల రద్దు, జిఎస్టీ, పెట్రోల్‌ ధరలు బీజేపీకి ప్రతికూల అంశాలు. ఎన్నికలనాటికి నోట్ల రద్దు ప్రభావం పెద్దగా వుండకపోవచ్చు. జిఎస్టీ వల్ల ఉపయోగాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. పెట్రోల్‌ ధరల విషయంలోనే బీజేపీపై వ్యతిరేకత ఎక్కువుగా వుంది. అయితే దీనిని జిఎస్టీ పరిధిలోకి తేవడం లేదా తన పరిధిలో ధరలు తగ్గించడం పెద్ద సమస్య కాదు.

ఇక అనుకూల అంశాలను తీసుకుంటే ఒక్క అవినీతి కుంభకోణం లేని పాలన అందించారు. ప్రభుత్వంలో అవినీతి తగ్గింది. జిఎస్టీతో దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేశారు. ఈ ప్రభుత్వం విదేశాల నుండి ఒక్క రూపాయి అప్పు తేలేదు. మోడీ విదేశాంగ విధానంతో ప్రపంచంలోనే భారత్‌కు ఎనలేని గుర్తింపు వచ్చింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్ర వాద దాడులను చాలావరకు అరికట్టగలిగారు. ఇక ఈ నాలుగేళ్ళలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. విద్యుత్‌, రవాణా, రైల్వే వ్యవస్థలు మెరుగుపడ్డాయి. జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రచర్యలపై ఇక ఉక్కుపాదం మోపే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టారు. మొత్తంగా చూస్తే మరోసారి ప్రజల్లో జాతీయతా భావాలను ప్రేరేపించే విధంగా బీజేపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుంది. లోక్‌సభతో పాటు దేశంలోని మూడొంతుల్లో ఒక వంతు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు సఫలమైతే మన తెలుగురాష్ట్రాలకు కూడా ముందస్తు ఎన్నికలు తప్పవేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here