Home సంపాదకీయం మినీ సంగ్రామం

మినీ సంగ్రామం

2019లో జరగబోయే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపెవరిది? నరేంద్ర మోడీ ఇమేజ్‌తో మళ్ళీ ఎన్డీఏనే గెలుస్తుందా? లేక ఎన్డీఏ ప్రభుత్వంపై వున్న వ్యతిరేకతతో బీజేపీ వ్యతిరేక ఐక్యకూటమిని విజయం వరిస్తుందా? ఈ ప్రశ్నలకు దాదాపు ఓ అయిదారు నెలల ముందే సమాధానం రాబోతోంది. 2019లో కేంద్రంలో ఎవరి జెండా ఎగురనుందన్నది డిసెంబర్‌ 11వ తేదీన మినీసంగ్రామంగా చెప్పుకోబడే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లం కాబోతుంది.

ఫైనల్స్‌కు ముందు సెమీఫైనల్స్‌గా భావించబడే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ పచ్చజెండా ఊపింది. సాధారణంగా నిర్ణీత కాలవ్యవధి పూర్తయిన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరంలతో పాటు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 12, 20తేదీలలో ఛత్తీస్‌గఢ్‌లోని 90 స్థానాలకు, నవంబర్‌ 28న మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు, మిజోరంలోని 40 స్థానాలకు, డిసెంబర్‌ 7వ తేదీన రాజస్థాన్‌లోని 200 స్థానాలకు, తెలంగాణ లోని 119 స్థానాలకు ఎన్నికలు జరుపనున్నారు. డిసెంబర్‌ 11వ తేదీన ఆయా పార్టీల భవిష్యత్‌ తేలనుంది.

కేంద్రంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి గెలుపు గుర్ర మెక్కాలని కాంగ్రెస్‌ తీవ్రంగా పోరాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత వుందా? లేక మోడీ ఇమేజ్‌ బలంగా వుందా? అన్నది కూడా ఈ ఎన్నికల్లో తేలబోతోంది.

ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ లలో బీజేపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌, మిజోరంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు వరుసగా మూడు దఫాలుగా అధికారంలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో మాత్రం ప్రతి ఎలక్షన్‌కు అధికారం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మారుతూనే వుంది. ఈసారి కూడా రాజస్థాన్‌లో అదే పరిస్థితి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వసుంధర రాజె సింధియా రాజస్థానీయుల మనసులు గెలుచుకోవడంలో విఫలమవుతూనే వున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు గాని, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌కు గాని ప్రజల్లో మద్దతు వుంది. వారి పాలనపై ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇప్పటికీ ఆ రెండు రాష్ట్రాలలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులుగా వారే ప్రచారంలో వున్నారు. కేవలం రాష్ట్ర పరిధిలోని అంశాలు మాత్రమే ప్రభావితం చేస్తే ఆ రెండు రాష్ట్రాల్లోనూ తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. కేంద్రప్రభుత్వం అమలు చేసిన నోట్ల రద్దు, జిఎస్టీ, పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వంటివి ప్రభావం చూపితే మాత్రం ఆ మూడు రాష్ట్రాలలోనూ బీజేపీకి చుక్కలే! 2019 ఎన్నికలకు ముందే ఆ పార్టీకి తిరోగమనం మొదలైనట్లు!

బీజేపీకి ఈ ఐదింటిలో మూడు రాష్ట్రాలే జీవన్మరణ సమస్య. కాంగ్రెస్‌కు ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా కీలకం కానున్నాయి. అధికారంలో వున్న మిజోరంలో మళ్ళీ గెలవాలి. మిగిలిన నాలుగు రాష్ట్రాల లోనూ కాంగ్రెస్సే ప్రతిపక్ష స్థానంలో వుంది. ముందస్తు సర్వేలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం వుందని చెబుతున్నాయి. అయితే ఐక్యకూటమి ద్వారా బీజేపీకి దూకుడుకు కళ్లెం వేయాలనుకున్న కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఆలోచనలకు ఎస్పీ, బిఎస్పీ పార్టీలు గండి కొట్టాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ పార్టీలతో సీట్ల బేరం వికటించి కాంగ్రెస్‌ ఒంటరిగానే పోరాటానికి సిద్ధమైంది. తెలంగాణలో మాత్రం మహా కూటమి ప్రయత్నాలు సఫలమైనట్లే కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలను కోరుకుంది. నిన్న మొన్నటివరకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అనుకూల వాతావరణమే కనిపించింది. అయితే కాంగ్రెస్‌, తెలుగుదేశంల కలయికతో టీఆర్‌ఎస్‌కు ఇక్కట్లు తప్పేటట్లు లేవు. మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో టీడీపీ-కాంగ్రెస్‌ జెండాలు ఒకే వాహనానికి కట్టడం అన్న అరుదైన దృశ్యం తెలంగాణ ఎన్నికల్లోనే ఆవిష్కృతమైంది. తెలంగాణలో బీజేపీది నామమాత్ర పాత్ర. అధికారం కోసం పోరాటం జరిగేది టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే! అయినా ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలవడం బీజేపీకి భవిష్యత్‌ దృష్ట్యా అవసరం. కాబట్టి ఆ దిశగా ఆ పార్టీ నుండి టిఆర్‌ఎస్‌కు సహకారం అందుతూనే వుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు రేపటి ఢిల్లీ సమరానికి దిక్సూచిగా మారనున్నాయి. శత్రువును బలహీన పరచాలంటే ఈ ఎన్నికల్లో గెలుపు అత్యవసరం. అది మోడీకైనా, రాహుల్‌కైనా! కర్నాటక ఎన్నికల ఫలితాలు అటు కాంగ్రెస్‌కు ఇటు బీజేపీకి మింగుడుపడ కుండా వచ్చాయి. కాని, ఈ ఐదు రాష్ట్రాలు అలా కాదు… బీజేపీ, కాంగ్రెస్‌ల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఈ రాష్ట్రాలు అధికారమే కాదు రేపు కేంద్రంలో అధికారం ఎవరిదన్న విషయాన్ని కూడా తీర్చేస్తాయి. కాబట్టే 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు కీలకం కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here