Home జిల్లా వార్తలు మితిమీరుతున్న ధోరణి… మాట తూలుతున్న కాకాణి

మితిమీరుతున్న ధోరణి… మాట తూలుతున్న కాకాణి

రాజకీయాలకో భాష ఉంది… ఒక భావం వుంటుంది. వాడే పదాలకో పద్ధతి వుంటుంది. చేసే విమర్శలకో హద్దు వుంటుంది. కాలు జారితే తీసుకోవచ్చేమో గాని, నోరు జారితే తీసుకోలేం. ముఖ్యంగా ప్రజా జీవితంలో వుండే రాజకీయ నాయకుల భాషను, వాడే పదాలను పదిమంది వింటుంటారు. వారు మాట్లాడే భాష, చేసే విమర్శలు పదిమందిని ఆకట్టుకునేటట్టుండాలే గాని, ఆ పదిమంది అసహ్యించుకునేటట్లుండకూడదు. మనం వాడే భాష, మాట్లాడే మాట మన గౌరవం పెంచాలి, మనలోని సంస్కారాన్ని చాటాలి!

ఈ జిల్లా ఎంతోమంది జాతీయ స్థాయి ఉద్ధండ రాజకీయ పిండాలను అందించింది. బెజవాడ గోపాలరెడ్డి, యం.వెంకయ్యనాయుడు, పుచ్చలపల్లి సుందరయ్య, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఏ.సి.సుబ్బారెడ్డి… ఇలా ఎందరో నాయకులు ఈ జిల్లాలో మన కళ్ళ ముందు రాజకీయాలు చేసారు. వీరంతా ఒకే పార్టీలో వున్నోళ్ళు కాదు… వేర్వేరు పార్టీలలో ప్రత్యర్థులుగా వున్నోళ్ళే! రాజకీయ శత్రుత్వం కూడా తక్కువ వుండేది కాదు. ఒకర్నొకరు ఓడించుకోడానికి తీవ్రంగా శ్రమించే వాళ్ళు. వాళ్ళు ఒకర్నొకరు విమర్శలు చేసుకున్నారంటే… ఆ విమర్శలు కేవలం రాజకీయ, పరిపాలనా పరమైన అంశాలకే పరిమితమై వుండేవి. వారి విమర్శల్లో, ఆరోప ణల్లో సంస్కారం వుట్టిపడేది. వ్యక్తిగత విమర్శలకు, వ్యక్తిగత వైషమ్యాలకు తావిచ్చేవాళ్ళు కాదు.

అలాంటి సంస్కారవంతమైన నాయకులకు పుట్టినిల్లు నెల్లూరుజిల్లా. అలాంటి జిల్లాలో ఈరోజు కొందరు నాయ కులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చాలా రోత కలిగిస్తున్నాయి.

నెల్లూరుజిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ లేనంతగా సర్వేపల్లి నియోజకవర్గం కేంద్రంగా వ్యక్తిగత విమర్శల దాడి ఎక్కువుగా వుంటోంది. ముఖ్యంగా మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యక్షంగా సభలలోనూ, సోషల్‌ మీడియా లోనూ వాడుతున్న భాష తీవ్ర అభ్యంతర కరంగా వుంటోంది.

సర్వేపల్లి నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. గత మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే దాదాపు పదేళ్ళ పాటూ సోమిరెడ్డి, సి.వి.శేషారెడ్డిల మధ్య విమర్శల దాడి నడిచింది. అయితే వాళ్ళ మధ్య విమర్శలెప్పుడూ హద్దులు దాటలేదు. వారి విమర్శలు, ఆరోపణలన్నీ కూడా అభివృద్ధి, అవినీతి అనే అంశాల చుట్టే తిరిగేవి. వ్యక్తిగతంగా ఒకర్నొకరు కించ పరచుకున్న సందర్భాలు లేవు. ఆ తర్వాత పదేళ్ళ పాటు సోమిరెడ్డి వర్సెస్‌ ఆదాల అన్నట్లుగా ఇరువురి మధ్య విమర్శల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. విమర్శలలో వేడి వాడిని పెంచారే గాని వ్యక్తిగత విమర్శల జోలికి పోలేదు. వ్యక్తి త్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు.

కాని, సోమిరెడ్డిపై కాకాణి చేస్తున్న విమర్శలు, ఆయన వాడుతున్న భాష వారికి భిన్నంగా వుంది. ఆయన భాష హద్దులు దాటుతోంది. సోమిరెడ్డిని ఉద్దేశించి ఆయన పెడుతున్న మారుపేర్లు కూడా ఆయన హోదాకు తగ్గట్లు లేవు. ఆయన వాడుతున్న పదాలు, తిట్లు అసలు పత్రికలలో వ్రాసేటట్లుగా కూడా లేవు.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. మన నోరు అదుపులో వుంటే జనం మన ముంగిట్లో వుంటారు. నంద్యాల ఉపఎన్నికల్లో చంద్రబాబుపై జగన్‌ అనవసరంగా ఒక మాట తూలినందుకు దాని నష్టం చాలా జరిగింది. నాలుకకు రెండువైపులా పదును వుంటుంది. సంస్కార వంతంగా ఆ నాలుక పనిచేస్తే సమాజంలో మన గౌరవం పెరుగుతుంది. అదే నాలుక క్రమశిక్షణ తప్పితే మన పరువే మంటకలుస్తుంది. నాయకులు దీనిని గమనించు కుంటే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here