Home జిల్లా వార్తలు మారుతున్న రాజకీయం – ఫుల్‌టైం పోయి… అంతా పార్ట్‌టైమ్‌!

మారుతున్న రాజకీయం – ఫుల్‌టైం పోయి… అంతా పార్ట్‌టైమ్‌!

ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎలావుండేవాళ్ళు… అధికారంలో వున్నోళ్లయినా, ప్రతిపక్షంలో వున్నోళ్లయినా… పూర్తిగా రాజకీయాలకే అంకితమై వుండేవాళ్ళు. వాళ్ళ వ్యాపారం, వృత్తి, ఉద్యోగం అంతా కూడా రాజకీయమే.

బెజవాడ గోపాలరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య,వెంకయ్యనాయుడు, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, దొడ్ల కామాక్షయ్య, స్వర్ణ వేమయ్య, కలికి యానాదిరెడ్డి, పసల పెంచలయ్య, కె.వి. సుబ్బారెడ్డి, నువ్వుల వెంకటరత్నంనాయుడు, ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం సంజీవరెడ్డి, సి.వి.శేషారెడ్డి, జక్కా వెంకయ్య, ధనెంకుల నరసింహం, బెజవాడ పాపిరెడ్డి, డాక్టర్‌ బి.సుందరరామిరెడ్డి, డాక్టర్‌ వి.వి. ఆర్‌.కె. యాచేంద్ర, ఆనం వివేకానందరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి… గత జిల్లా రాజకీయా లను పరిశీలిస్తే రాజకీయమే వ్యాపకంగా వున్న నాయకులే మనకు కనిపిస్తారు. వీళ్ళకు బరువు, బ్రతుకు, బాధ్యత అంతా రాజ కీయమే! నిరంతరం ప్రజల మధ్య ఉం డడం, ప్రజల సమస్యలపై పోరాడడమే వారి దైనందిన జీవితంగా ఉండేది. గతంలో జిల్లాలో ఒక లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలుంటే అన్ని స్థానాలలోనూ ఫుల్‌టైం పొలిటీషియన్స్‌ ఎన్నికైవుండే వాళ్ళు. గెలిచినా, ఓడినా అందరూ పూర్తికాలం రాజకీయాలకే అంకితమైన నాయకులు ఆ కాలంలో వుండేవాళ్ళు.

రాజకీయాలలోకి కాంట్రాక్టర్‌లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఎప్పుడైతే ప్రవేశించారో, రాజకీయాలలో డబ్బు ప్రభావం ఎప్పుడైతే మొదలైందో… అప్పటి నుండే పూర్తికాలం రాజకీయ నాయకులు తెరమరుగు కాసాగారు. పార్ట్‌టైం పొలిటీషియన్స్‌ రాజకీయాలను ఆక్రమించుకుంటూ రాసాగారు. కాల క్రమంలో జిల్లా రాజకీయాలపై పార్ట్‌టైం పొలిటీషియన్స్‌దే పైచేయి అయ్యింది.

2014 ఎన్నికలనే చూద్దాం… నెల్లూరు లోక్‌సభ స్థానం నుండి గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఒక కాంట్రా క్టర్‌. ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా కాంట్రాక్టరే! ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బిల్డర్‌, బొల్లినేని రామారావు కాంట్రాక్టర్‌, కురుగొండ్ల రామకృష్ణ వ్యాపారవేత్త, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రియల్టర్‌, మేకపాటి గౌతంరెడ్డి కాంట్రాక్టర్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాపారవేత్త. 2014 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళలో ఏ వ్యాపారాలు, కాంట్రాక్ట్‌లు లేకుండా వున్నది నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌లే! సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఉద్యోగాన్ని వదిలి వచ్చాడు. పాశం సునీల్‌కు కాం ట్రాక్ట్‌లు, వ్యాపారాలు ఏమీ లేవు.

2019 ఎన్నికల రేసులో కూడా పార్ట్‌టైం పొలిటీషియన్స్‌ ఎక్కువుగా రంగంలో వుండబోతున్నారు. ఎంపి సీటుకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సీట్లకు వ్యాపార, కాంట్రాక్ట్‌, పారిశ్రామిక రంగా లకు చెందిన పి.నారాయణ, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, బొల్లినేని కృష్ణయ్య, బొల్లినేని రామారావు, కావ్య కృష్ణారెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌ రెడ్డిలు రేస్‌లో వున్నారు.

పూర్తికాలం రాజకీయ నాయకులుగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, కిలివేటి సంజీవయ్య, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి.. వంటి నాయకులు టీడీపీ, వైసిపిల తరపున టిక్కెట్ల రేసులో వున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఈసారి కూడా పార్ట్‌ టైం నాయకులకే ప్రాధాన్యత దక్కనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here