Home జిల్లా వార్తలు మారని మేకపాటి

మారని మేకపాటి

వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో గెలవాలంటే కెప్టెన్‌ ఒక్కడే ఆడితే సరిపోదు… ప్లేయర్లు కూడా సమర్ధవంతంగా ఆడాలి. టీమ్‌ శక్తిసామర్ధ్యాల మీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కెప్టెన్‌ ఒక్కడే ఆడి టీమ్‌ను గెలిపించలేడు. వైసిపి అనే టీమ్‌కు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి కెప్టెన్‌ లాంటోడు. 2014 ఎన్నికల్లో జట్టులోని మిగతా సభ్యులతో పనిలేదు… నేనొక్కడినే ఆడి జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తానని ఎం.ఎస్‌.ధోని లాగా అతివిశ్వాసంతో ముందుకుపోయి బోల్తా పడ్డాడు.

ఇంతకాలానికి కెప్టెన్‌ ఒక్కడే ఆడితే చాలదు, మిగతా ఆటగాళ్ళు కూడా సమర్ధులై, ఆట తెలిసినవాళ్ళై వుండాలని తెలుసుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే రాజకీయంగా మంచి ఆటగాళ్ళను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ పరంపరలోనే పార్టీలోకి రావాలనుకుంటున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డిని వైకాపాలోకి తీసుకోవడం ఇందులో భాగమే! జిల్లాలో వైసిపి బలంగావుంది. ఆనం పార్టీలో చేరితే నాలుగైదు నియోజకవర్గాలలో ఇంకొంత బలం చేకూరుతుంది. అదీగాక జిల్లాలో పార్టీ బలానొక్కటే నమ్ముకోలేం. అభ్యర్థుల బలం కూడా వుంటే మరీ మంచిది. ఏ కోణంలో చూసినా వైకాపాకు ఆనం రామనారాయణరెడ్డి బలమైన నాయకుడు. ఆయనను పార్టీలోకి తీసుకోవడాన్ని ఎవరూ రాజకీయం చేయాల్సిన పనిలేదు.

కాని, ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రంగా ఆనం రామనారాయణరెడ్డిపై మేకపాటి వర్గీయులు కొందరు కరపత్రాల ద్వారా దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన పలు పార్టీలు మారాడని ప్రచారం చేస్తున్నారు. ఈ జిల్లాలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వెంకయ్యనాయుడు, జక్కా వెంకయ్య లాంటి వారికి తప్పితే పార్టీలు మార్చని చరిత్ర ఎవరికుంది! మేకపాటి బ్రదర్స్‌ పార్టీలు మార్చలేదా? జనతా నుండి కాంగ్రెస్‌లోకి, అక్కడనుండి తెలుగుదేశంలోకి తిరిగి కాంగ్రెస్‌లోకి… ఇప్పుడు వైకాపాలో… పార్టీలు మార్చడంలో మరి ఆనంకు వీళ్ళకు తేడా ఏముంది. ఆనం రామనారాయణరెడ్డికి ఇంకా సొంత కెపాసిటీ అన్నా వుంది. ఈరోజు ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి, ఉదయగిరి వంటి నియోజకవర్గాలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసినా నువ్వా, నేనా అనే రీతిలో పోటీ ఇవ్వగలడు. మేకపాటి సోదరులలో ఎవరైనా సరే ఈరోజు వైసిపి నుండి కాకుండా తెలుగుదేశం నుండి పోటీ చేసి గెలవగలరా? కనీసం గట్టిపోటీ ఇవ్వగలరా? అసలు ఆనం రామనారాయణరెడ్డి 2014లోనే ఆత్మకూరులో గట్టిగా ఎలక్షన్‌ చేసుంటే నెల్లూరు లోక్‌సభలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఓడిపోయుండేవాడు. ఆత్మకూరులో మేకపాటి గౌతంరెడ్డి గెలుపు సందేహంగా వుండేది.

ఆనం రామనారాయణరెడ్డిని తక్కువ అంచనా వేసి మాట్లాడడం కరెక్ట్‌ కాదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వైకాపాకే కాదు, జగన్‌కు ఆయనను నమ్ముకున్న నాయకులకు జీవన్మరణ సమస్యలాంటివి. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవకుంటే చాలామంది నాయకులు, అనుచరుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి, ఎవరికి ఏ సీటు ఇవ్వాలన్నది జగన్‌ చూసుకుంటాడు. తమ సీట్లు ఎక్కడ పోతాయోనని చెప్పి మేకపాటి సోదరులు బలమైన నాయకులు పార్టీలోకి రాకుండా అడ్డుకుంటే వీళ్ళు జగన్‌కు మిత్రులు కాదు అనుకూల శత్రువులుగా మారుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here