Home జిల్లా వార్తలు మాయలోడితో పోరాడుతున్నాం!

మాయలోడితో పోరాడుతున్నాం!

39 డిగ్రీల ఎండదెబ్బకు మధ్యాహ్నం 12గంటలు దాటితే జనం రోడ్డు మీద తిరగడం లేదు. అలాంటిది మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా జనం కదల్లేదు… మెదల్లేదు… వేలాదిగా పోటెత్తి వచ్చిన జన సమూహం ముందు మిడిమేళంగా కాసిన ఎండ కూడా వెలవెలపోయింది.

ఈ నెల 5వ తేదీన నెల్లూరు, జాతీయ రహదారి ఆనుకుని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమర శంఖారావం’ సభ విజయవంతంగా జరిగింది. వైకాపా అధినేత ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్న ఈ సభకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చారు. మధ్యాహ్నం 12గంటలకల్లా సభకు జనం పోటెత్తినట్లు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో సభ అయినా ఎలాంటి షామియానాలు వేయలేదు. జనం ఎండలోనే కదలకుండా కూర్చున్నారు. జగన్‌ ప్రసంగం ఆపేంతవరకు కూడా జనం కదల్లేదు, మెదల్లేదు.

ఇక తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో దిగి అక్కడ నుండి నాయుడుపేట, గూడూరుల మీదుగా నెల్లూరులోని సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. జగన్‌ కనిపించగానే సభా ప్రాంగణం ‘జై జగన్‌’ నినాదాలతో హోరెత్తి పోయింది. ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా సభా వేదికకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై ఆయన నడుస్తూ ప్రజలతో, కార్యకర్తలతో ముచ్చటించడం, వారి ప్రశ్నలకు జగన్‌ సమాధానాలివ్వడం వంటివి హాజరైన అభిమానులలో ఎనలేని ఉత్సాహాన్ని నింపాయి.

జగన్‌ తన ప్రసంగంలో… మనం మాయలోడితో యుద్ధం చేస్తున్నామని, పోరాడి యుద్ధంలో గెలవాలని కాకుండా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లతో యుద్ధం గెలవాలనే నీచ మనస్తత్వం వున్న చంద్రబాబు మాయోపాయాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా గెలవాలనుకుంటు న్నాడనడానికి హైదరాబాద్‌లో జరిగిన ఐ.టి గ్రిడ్‌ డేటా చోరీ ఉదంతమే పెద్ద ఉదా హరణగా పేర్కొన్నారు. తెలుగుదేశం వాళ్ళు కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ లక్షలాది వైసిపి కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని, ప్రతి కార్యకర్త తమ ఓటు వుందో లేదో చూసుకుని, లేకుంటే నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు తాత్కాలిక తాయిలాలతో మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారని, 57నెలలు ప్రజలను ఎండబెట్టి, ఈ మూడు నెలల్లో మీకు తిండి పెడతానంటూ వస్తున్నాడని, ఇతని మాయలకు మరోసారి మోసపోయే స్థితిలో తెలుగుప్రజలు లేరని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు 600 హామీలిచ్చి వాటిని అటకెక్కించిన ఘనత చంద్రబాబుదే నన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలతో రాష్ట్రంలో నవ శకాన్ని ఆరంభిద్దామన్నారు. అలాగే జిల్లాలో దుగరాజపట్నం పోర్టు విషయమై ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వస్తే ఇక్కడ పోర్టు నిర్మించడంతో పాటు 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సభలో పార్లమెంటు సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.వరప్రసాద్‌, మాజీమంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైసిపి నాయకులు టి.రఘురామ్‌, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మేరిగ మురళి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పేర్నాటి శ్యాంసుందర్‌రెడ్డి, ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు.

జోష్‌ పెంచింది…

జిల్లాలో వైసిపి బలంగా వుంది. పార్టీకి సమర శంఖారావం సభ విజయవంతం కావడంతో మరింత జోష్‌ను తెచ్చినట్లయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here