Home సంపాదకీయం మాయమవుతున్న మానవత్వం

మాయమవుతున్న మానవత్వం

ఈ భూమిపై సకల జీవరాశులలో మనిషీ ఒకడే. పుట్టుక, చావు విషయంలో మిగతా జీవరాశికి మనిషికి పెద్ద తేడా లేదు. కాని, బ్రతికే విషయంలో తేడా చూపించాడు. పశు పక్ష్యాదులకు లేని ఎన్నో గుణాలు మనిషిలో వున్నాయి. మనిషికి తెలివి, దయ, ప్రేమ, అభిమానం, బాధ, త్యాగం… ఈ మంచి లక్షణాలేనా… పశువులు, ౄరమృగాలలో వుండే చెడు లక్షణాలు కూడా వున్నాయి. ఈ సమాజంలో మానవతా లక్షణాలు చూపించిన వాళ్ళు ఆదర్శమహనీయులుగా, పశుత్వంతో చెలరేగిన వాళ్ళు చెదపురుగులుగా ముద్రపడిపోతుంటారు.

కరెంట్‌ షాక్‌ తగిలి ఒక కాకి రోడ్డుమీద పడిపోతే ఒక్క నిమిషంలో వెయ్యి కాకులు గుమికూడిపోతాయి. ఆ చనిపోయిన కాకితో వచ్చిన కాకులకు బంధుత్వం వుండదు, రక్తసంబంధం అంతకన్నా వుండదు. ఈ కాకేమో తన ఆస్తులను మిగతా కాకులకు పంచి వుండదు. అయినా సాటి తమ జాతి జీవి ప్రాణం కోల్పోతే ఆ జాతికి చెందిన మిగతాప్రాణులు పడే బాధను మనుషులు ఈ రోజుకీ అర్ధం చేసుకోలేకపోతున్నారు.

ప్రపంచంలో దాదాపు 200 దేశాలున్నాయి. అన్ని దేశాలలో రాజకీయపార్టీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, ఎన్నికలు, ప్రచారాలు, విమర్శలు వంటివి వున్నాయి. అయితే భారతదేశంలో వున్నంత చెత్త రాజకీయాలు ఏ దేశంలోనూ వుండవేమో! ఇంత దరి ద్రపు రాజకీయ వ్యవస్థ ఇంకెక్కడా వుండదేమో! రాజ కీయాలలో మానవతా విలువలు కోల్పోయిన నాయ కులు పలు సందర్భాలలో తాము మనుషులమన్న సంగతి మరచిపోయి మృగావతారాలెత్తుతున్నారు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు కేంద్రంగా వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, ఈ సంఘటనపై అధికార తెలుగు దేశం పార్టీ నాయకుల ప్రకటనలు మానవతా భావా నికి నిలువునా సమాధి కట్టాయని చెప్పవచ్చు. ఏదైనా ప్రమాదం లేదా అపాయం జరిగినప్పుడు పగోడినైనా పరామర్శించే సంప్రదాయం మన పూర్వీకులు మనకు నేర్పించారు. చావుకైనా, పెళ్లికైనా శత్రువు ఇంటికి వెళ్లే సంస్కారాన్ని మనకు అలవాటు చేసారు. అలాంటి గొప్ప సంస్కారాన్ని ఈ రాష్ట్ర నాయకులు కొందరు మరచిపోయారు.

జగన్‌పై హత్యాయత్నం ఒక కోణం. దాని నేపథ్యం వేరు, దానిని చూడాల్సిన దృష్టి కోణం వేరు. మనకు పటిష్టమైన భద్రతా వ్యవస్థలున్నాయి. నిఘా సంస్థలున్నాయి. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపితే జగన్‌పై దాడి డ్రామానా లేక కుట్ర జరిగిందా? అదీగాకుంటే నిందితుడు పబ్లిసిటీ కోసం చేసాడా? ఏదో ఒకటి తేల్చడం పెద్ద పనేమీ కాదు.

కాని, ఆంధ్రప్రదేశ్‌ను ఏలుతున్న తెలుగుదేశం పెద్దలలో ఆ స్పృహ లోపించింది. జగన్‌పై హత్యాయత్నం జరిగిందని తెలిసాక ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ముందు బాధ్యతాయుత కోణంలో వ్యవహరించాలి. సంఘటన ఎలా జరిగిందనే దానిపై విచారించాలి. ప్రతిపక్ష నేత పరిస్థితి ఎలా వుంది, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి అనేవి పరిశీలించాలి. వైద్యులతో మాట్లాడాలి. పరామర్శించాలి. తర్వాత దానిని రాజకీయ కోణంలో వాడుకోవచ్చు. లేదా పోలీసుల దర్యాప్తులో అది బూటకం అని ప్రాథమికంగా తేలితే ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షంపై బురద చల్లొచ్చు.

బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవన్నీ చేయలేదు. సంఘటన జరిగిన నాలుగు గంటల్లోనే ప్రెస్‌మీట్‌ పెట్టడం, దాడినొక డ్రామాగా అభివర్ణించడం, దీనిని కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేసే ప్రయత్నం చేయడం, దీనికి మళ్లీ ప్రత్యేకహోదా, ఆపరేషన్‌ గరుడ అనే పాచిపోయిన పదాలను జత చేయడం, జరిగిన సంఘటన నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడానికి గంటల కొద్ది సంబంధం లేని విషయాలు మాట్లాడడం… సంఘటన జరిగాక ఒక ముఖ్యమంత్రిగా కాదు, మామూలు మనిషిగాన్నా ఒక గంట మనం వ్యవహరించలేకపోతున్నామంటే… మనుషులుగా మనం ఎంత దిగజారిపోతున్నట్లు? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ విషయంలో చంద్రబాబునే అనుసరించారు. ఒక మంత్రివర్యులు మేం స్కెచ్‌ వేస్తే పిల్లకాయలను పెట్టి గిల్లడం గిచ్చడం వుండదు… అంతా భారీ స్థాయిలోనే వుంటుందంటే… ఇంకొక ఎంపీ మేం తలచుకుంటే జగన్‌ను కైమా కొట్టుండేవాళ్లం అని వాగడం… ఇంకో ఎమ్మెల్సీ చెత్తవాగుడు పతాక స్థాయికి చేరి రాజకీయ నాయకుల మీదే వెగటుపుట్టేలా చేసింది. పార్టీలో తమను తొక్కేస్తున్నాడని చెప్పి జగన్‌ హత్యకు ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలే ప్లాన్‌ చేసారట. ఇలాంటి చెత్తవాగుడు వాగేవాళ్ళు మన ప్రజాప్రతినిధులు. ఈ ఎమ్మెల్సీ వాదననే తీసుకుందాం. రాజకీయ పదవుల కోసం విజయమ్మ, షర్మిలలు ఆ పని చేస్తే…? మరి 2003లో అలిపిరి వద్ద చంద్రబాబు హత్య కోసం మందు పాతరలు పెట్టించింది ఎవరనుకోవాలి? మనుషులన్నాక కాస్త ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి.

జగన్‌పై దాడి సంఘటనలో అధికార పార్టీ అధినేత పైత్యం ఎంతగా ముదిరిందంటే… మానవీయ కోణంలో జగన్‌ను పరామర్శించిన ఇతర పార్టీల నేతలను తిట్టేంతగా పెరిగిపోయింది. దాడి గురించి తెలియగానే పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు స్పందించి పరామర్శించారు. రాజకీయ అనుభవం లేని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, బీజేపీ, సీపీఎం, సిపిఐ నాయకులు అందరూ పరామర్శిం చారు. ఒక్క తెలుగుదేశం నాయకులే కనీస సంప్ర దాయ విలువలను మరిచారు. జరిగిన దాడిని హేళన చేస్తూ, దీనినొక డ్రామాగా ప్రజల మనసుల్లోకి ఎక్కించే ప్రయత్నం చేసారు.

ఈ దేశంలో రాజకీయ నాయకుల హత్యలు, సహజ మరణాలు సంభవించిన సమయంలోనూ లేదా రాజకీయ నాయకులపై దాడులు జరిగిన సందర్భాలలోనూ రాజకీయాలకతీతంగా నాయకులు పరస్పరం కలుసుకున్న సంఘటనలున్నాయి. ఇందిరాగాంధీ పాడెను ఎన్టీఆర్‌ మోసాడు. ఎన్టీఆర్‌ చనిపోయిన రోజున ఆయన భౌతికకాయం వద్దకు ముందుగా కాంగ్రెస్‌ నాయకులే పరుగులు తీసారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగిన రోజున ప్రతిపక్ష నేతగా వున్న వై.యస్‌.రాజశేఖరరెడ్డి తిరుపతిలో నిరసన దీక్ష చేశారు. అంతెందుకు… తమిళ రాజకీయాలలో పిల్లి, ఎలుకల్లాగా పోట్లాడుకున్న కరుణానిధి, జయలలితలు కూడా పలు సందర్భాలలో మానవీయ కోణాన్ని చాటుకున్నారు. జయలలిత చనిపోయినరోజున కరుణానిధి వ్రాసిన కవిత కోట్లాదిమంది ప్రజల గుండెలను పిండేసింది.

రాజకీయాలలో శత్రుత్వం సిద్ధాంతాలకు, ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాలి. ఆ శత్రుత్వం వ్యక్తిగతాల్లోకి జొరబడితే మనిషి మానవ లక్షణాలను కోల్పోతాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను అలాంటి జాడ్యమే ఆవహించింది. నాయకులు మనుషులమన్న సంగతి మరచిపోయి మాటల్లో చేతల్లో పరిధిలు దాటి ప్రవర్తిస్తుండడం శోచనీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here