Home జాతీయ వార్తలు మళ్ళీ మోడీ మానియా పని చేస్తుందా?

మళ్ళీ మోడీ మానియా పని చేస్తుందా?

దేశ వ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. ఏప్రిల్‌ 11వ తేదీన 91లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో తొలి అంకం ముగిసినట్లయ్యింది. ఇక ఆరు దశల పోలింగ్‌ మిగిలివుంది. దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పూర్తి మెజార్టీతో ఒక పార్టీ అధికారంలోకి రావడం కష్టం. మరి కూటమికైనా అలాంటి అవకాశం వుందా?

ఒకసారి 2014 ఎన్నికలను పరిశీలిస్తే దేశమంతటా నరేంద్ర మోడీ ప్రభంజనం పని చేసింది. దీనికితోడు యూపిఏ రెండో విడత పరిపాలనలో అవినీతి కుంభ కోణాలు మోతెక్కిపోయాయి. ఉగ్రవాద చర్యలు పెచ్చు మీరాయి. ఆర్ధికవేత్తగా పేరుగాంచిన మన్మోహన్‌సింగ్‌ పరిపాలనలో ద్రవ్యోల్భణం పెరిగిపోయింది. ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రజలు యూపిఏ ప్రభుత్వాన్ని పెద్ద దరిద్రంగా భావించారు. 2014 ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు. కనీసం లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.

2014లో మోడీ హవా… యూపిఏ ప్రభుత్వంపై వ్యతిరేకత… ఎన్డీఏకు 334 సీట్లను కట్టబెట్టింది. కూటమిలోని బీజేపీయే 283సీట్లతో మెజార్టీ మార్క్‌ను దాటింది.

మరి అలాంటి మోడీ హవా మరోసారి దేశంలో రానుందా?! దేశ ప్రజలు రెండోసారి కూడా మోడీకే పట్టం కట్టనున్నారా? ఈ అంశాలపై లోతుగా చర్చిస్తే కాంగ్రెస్‌పై ప్రజలకు గతంలో వున్నంత వ్యతిరేకత ఇప్పుడు ఉండకపోవచ్చు. అలాగే మోడీపై గతంలో వున్నంత అభిమానం ఇప్పుడు ఉండకపోవచ్చు. కాని, కాంగ్రెస్‌ను మళ్ళీ నెత్తిన పెట్టుకునేంత సాహసం చేసే స్థితిలో మాత్రం దేశ ప్రజలు లేరు. కాంగ్రెస్‌ వల్ల ఈ దేశం అభివృద్ధి చెందడం కంటే కూడా అవస్థల పాలైందని ఎక్కువుగా నమ్ముతున్నారు. ఈ దేశంలో శాశ్వతంగా పాతుకుపోయిన సకల సమస్యలకు గత కాంగ్రెస్‌ పాలకులే కారణంగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు, తాత్కాలిక తాయిలాల విధానాలు ప్రజలకు రుచించడం లేదు.

కాంగ్రెస్‌ మీద ప్రజలకు ఇంతగా విరక్తి పెరగడానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీనే! తన ఐదేళ్ళ పాలనలో ఆయన భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఎంతో గొప్పదిగా చూపించాడు. దేశ ప్రత్టిను ఇనుమడింపజేశాడు. అనేక అంశాలలో భారత్‌ను అగ్రరాజ్యాల పక్కన నిలబెట్టాడు. ప్రపంచానికి భారత్‌ను విశ్వగురుగా మలిచే ప్రయత్నంలో అలుపెరుగని కృషి చేశాడు. రాయి శిల్పం కావాలంటే ఉలి దెబ్బలు తట్టుకోక తప్పదని చెప్పిన మోడీ నోట్ల రద్దు ద్వారా దేశ ప్రజలకు కొంచెం నొప్పినైతే కలిగించాడు. నోట్ల రద్దు అన్నది ఎంతో పకడ్బందీగా అమలు చేయాలి. ఆర్ధిక నిపుణుల పర్యవేక్షణలో జరగాలి. కాని, ముందుచూపు లేకుండా మోడీ చేసిన నోట్ల రద్దు ప్రజలకు అష్టకష్టాలు చూపించింది. అలాగే ఎన్డీఏ వ్యూహాత్మకంగా అమలులోకి తెచ్చిన జిఎస్టీపై మొదట వ్యతిరేకత వచ్చినా కాలక్రమంలో అన్నీ సర్దుకున్నాయి.

దేశ ప్రజలకు బీజేపీ ఏదైతే వాగ్ధానం చేసిందో అవినీతికి తావులేని పరిపాలనను అందించడంలో మోడీ సక్సెస్‌ అయ్యాడు. ఈ ఐదేళ్లలో ఒక్క కుంభకోణం లేదు, ఒక్క కేంద్రమంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు లేవు. అందరూ నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే కేంద్రమంత్రులే!

వాళ్ళు తమ తమ శాఖల ద్వారా ఎంతో ప్రగతిని చూపించారు. ముఖ్యంగా రైల్వేలో అనూహ్య ప్రగతి సాధించారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పాదన పెంచారు. కరెంట్‌ లేని గ్రామాలనేవే ఇప్పుడు దేశంలో లేవు. ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, రహదారుల అభివృద్ధిలో విశేష ప్రగతి వుంది. దేశంలో ఒక ఆర్ధిక క్రమశిక్షణ ఏర్పాటు చేశారు. పన్నులు ఎందుకు కట్టాలి అనే స్థాయి నుండి దేశం కోసం పన్నులు కట్టాలి అనే స్థాయిలో ప్రజలకు అవగాహన వచ్చేలా చేశారు.

అయితే ప్రపంచంలోని అన్ని దేశాలతో మోడీ నెరపిన దౌత్య సంబంధాలు ఆయన పరిపాలనలో చెప్పుకోదగిన ముఖ్యఅంశం. ఆఖరకు అరబ్‌ దేశాలు కూడా మోడీ నాయకత్వాన్ని సమర్ధించాయి. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అన్ని దేశాలు కూడా భారత్‌కు మద్దతుగా నిలిచాయి. రక్షణ రంగంలో, అంతరిక్ష రంగంలో ఈ అయిదేళ్ళలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో అనితర విజయాలనే సాధించింది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కఠిన వైఖరినే అవలంభించింది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రదాడులకు సర్జికల్‌ స్ట్రైక్‌, ఎయిర్‌ స్ట్రైక్‌ వంటి వాటి ద్వారా చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పింది. అదే సమయంలో దేశంలోని బడుగు, బలహీన రైతుల బాగు కోసం పలు పథకాల ద్వారా చేయూతనందిస్తూ సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తుంది.

నాకు రెండోసారి అవకాశం ఇవ్వండని ప్రజల ముందుకు పోయి ఓటడగడానికి మోడీకి ఎన్నో అర్హతలున్నాయి. కాంగ్రెస్సే ఓట్లడిగే హక్కును కోల్పోయింది. అయినా కూడా రాహుల్‌ ప్రధాని అభ్యర్థిగా మళ్ళీ కాంగ్రెస్‌ ప్రజల ముందుకొచ్చింది. గతంలో వచ్చిన 44సీట్లు రెట్టింపు కావొచ్చేమో గాని, ఆ పార్టీ లేదా యూపిఏ కూటమికి మళ్ళీ అధికార పీఠం అప్పగిం చేంత సాహసం భారత ప్రజలు చేయలేకపోవచ్చు!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here