Home జిల్లా వార్తలు మళ్ళీ మేకపాటే అయితే.. ఆదాలకు జాక్‌పాటే..!

మళ్ళీ మేకపాటే అయితే.. ఆదాలకు జాక్‌పాటే..!

రాజకీయాలలో ఎత్తులకు పైఎత్తులు ఉంటాయి. వ్యూహాలకు ప్రతివ్యూహాలు ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులే విజయాన్ని తెచ్చి మన ముందర పెడుతుంటాయి. ఇలాంటి వ్యూహాత్మక రచనే నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేస్తున్నాడని చెప్పవచ్చు.

నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఈరోజు ఒక కీలక మైన నాయకుడిగా మారిపోయాడు. ఎంతలా మారిపోయాడంటే… వచ్చే ఎన్ని కలకు సంబంధించి రాష్ట్రంలో తెలుగు దేశం టిక్కెట్లు ఎవరికీ ఖరారు చేయలేదు. కుప్పం సీటు నుండి నేనే పోటీ చేస్తానని అభ్యర్థులను ఖరారు చేసే చంద్రబాబే ఇంతవరకూ చెప్పుకోలేదు. కొన్ని నెలల క్రితం కర్నూలులో జరిగిన ఓ కార్యక్ర మంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్‌, కర్నూలు అసెంబ్లీకి పోటీ చేస్తాడని ఒక పేరు చెబితే, వెంటనే ఎంపి టి.జి.వెంక టేష్‌… కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిని డిసైడ్‌ చేయ డానికి లోకేష్‌ ఎవరు? అంటూ తీవ్ర స్వరంతో మండిపడ్డాడు. టీడీపీలో అభ్యర్థిని ప్రకటించడం అంటూ జరిగితే అది చంద్రబాబు ద్వారానే జరగాలి. అలాంటిది నెల్లూరుజిల్లాలో మాత్రం నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిని నేనే, ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యే అని ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్వయంగా ప్రకటిం చేసాడు. ఆ తర్వాత పార్టీలో ఎవరూ దానిని ఖండించలేదు. అంటే పార్టీలో ఆదాల ప్రాధాన్యత ఏ స్థాయిలో పెరిగిందో దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.

ఆదాల ధైర్యం అతడే…

రాష్ట్రంలోనే వైసిపి బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరు అగ్రస్థానంలో వుంది. అలాంటి జిల్లాలో నెల్లూరు లోక్‌సభ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయ డానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అంటే ఆయన ధైర్యం ఏంటి? ఈ ప్రశ్నకు సమా ధానమే మేకపాటి రాజమోహన్‌రెడ్డి. నిజమే… ఆయన వెనుకున్న ధైర్యం మేకపాటి! వైసిపి ఎంపీ అభ్యర్థి మేకపాటి అయితే తాను గెలుస్తానన్న నమ్మకమే ఆదాలను నెల్లూరు లోక్‌సభ పోటీ వైపు పరుగులు తీయిస్తోంది.

టీమ్‌ సెట్‌ అయినట్లే..

వైసిపి ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజ మోహన్‌రెడ్డి అయితే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్లాన్‌ ఈ విధంగా వుండబోతుంది. నెల్లూరు నగరం నుండి మంత్రి పి.నారా యణ, నెల్లూరురూరల్‌ నుండి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌, పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డిలలో ఒకరు. కోవూరు నుండి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి నుండి బీద మస్తాన్‌రావు, కందుకూరు నుండి పోతుల రామారావు, ఉదయగిరి నుండి ఏదో ఒక డబ్బులు పెట్టుకునే రెడ్డి అభ్యర్థి, ఆత్మకూరు నుండి బొల్లినేని కృష్ణయ్య… ఇదీ అభ్యర్థుల ప్లాన్‌. ఏ అభ్యర్థికీ ఆదాల డబ్బు సర్ధనవసరం లేదు. ఏదన్నా వుంటే అధిష్టానం చూసు కుంటుంది. ఈ టీమ్‌తో ఎలక్షన్‌కు పోతే ఏడు అసెంబ్లీలలో నాలుగు అసెంబ్లీలలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఎంపీ అభ్యర్థిగా ఆదాల గెలుపు నల్లేరు మీద నడకే! ఒకవేళ మూడు స్థానాలలో టీడీపీ అభ్యర్థులు గెలిచినా కూడా తనకే గెలుపు అవకాశా లుంటాయన్నది ఆదాల నమ్మకం. ఆయన నమ్ముకునే అంశాలను చూద్దాం… సిటింగ్‌ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకతవుంది. ఇప్పటికి మూడు సార్లు ఆయనను గెలిపించారు. ఈసారికి ఎంపీగా ఆదాలకు ఓటేద్దాం అనే ఆలోచన కొందరిలో రావచ్చు. కాబట్టి ఆయన నెగిటివ్‌ ఓటు తనకు కలిసి రావొచ్చనేది ఆదాల అంచనా!

క్రాస్‌ ఓటింగ్‌ విశ్వాసం..

నెల్లూరురూరల్‌ నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి తిరుగులేదు. అక్కడ పోటీ చేయడానికే టీడీపీ నాయకులు సాహసించడం లేదు. అయితే శ్రీధర్‌రెడ్డి అంత కాకున్నా ఈ నాలుగున్నరేళ్ల నుండి రూరల్‌ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. పలు పనులు చేసాడు. నగర పరిధిలోని డివిజన్‌ నాయకులతోనూ, గ్రామాలలోని నాయకులతోనూ పార్టీలకతీతంగా సత్సం బంధాలు కలిగివున్నాడు. అసెంబ్లీకి పోటీ చేసి శ్రీధర్‌రెడ్డికి కాకుండా నాకు ఓటేయ మంటే ఆయన ప్లాన్‌ సక్సెస్‌ కాదేమోగాని, ఎంపీ అభ్యర్థిగా రూరల్‌ ప్రజల ముందుకు వెళ్లి పార్లమెంట్‌ ఓటు వరకు మాత్రం తనకు వేయమని కోరితే ఆదాల సక్సెస్‌ కావచ్చు. రూరల్‌లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరగొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తర్వాత ప్రజలతో టచ్‌లో వున్న నాయ కుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డే! 2014 ఎన్ని కల్లో ఇక్కడ భారీగానే క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. కాబట్టి నాయకుల వారీగా ఓట్లు వేయడంలో రూరల్‌ ఓటర్లకు ప్రత్యేక ట్రైనింగ్‌ ఇవ్వాల్సిన అవసరం కూడాలేదు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ పోటీ చేస్తే గట్టిపోటీ నెలకొంటుంది. అసెంబ్లీ ఫలితం ఎలావున్నా తనకున్న వ్యక్తి గత సంబంధాల దృష్ట్యా పార్లమెంటులో కొద్దోగొప్పో తనకే ఆధిపత్యం వస్తుందని ఆదాల అంచనా! కోవూరు, కావలిలలో ఆదాల వ్యక్తిగత ప్రాబల్యం వుంటుంది కాబట్టి ఈ రెండు చోట్ల క్రాస్‌ ఓటింగ్‌ పెరిగి తనకు మెజార్టీ పెరుగుతుందని ఆయన ధీమా. కందుకూరు, ఉదయ గిరిలలో లోక్‌సభకు, అసెంబ్లీ మెజార్టీలకు పెద్ద తేడా రాకపోవచ్చు. 2014 ఎన్ని కలలో ఆత్మకూరులో వచ్చిన మెజార్టీ వల్లే మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలిచాడు. కాని ఈసారి అక్కడ గౌతమ్‌కు అంత సీన్‌ లేదు. బొల్లినేని కృష్ణయ్య గట్టి పోటీ ఇస్తాడని నమ్ముతున్నాడు. ఎవరు గెలిచినా ఎంపీ కైనా, అసెంబ్లీకైనా పెద్ద తేడా వుండదన్నది ఆదాల నమ్మకం.

ఆదాల దృష్టిలో ఆత్మకూరు, ఉదయ గిరి నియోజకవర్గాలలో వైసిపికి భారీ మెజార్టీలు రాకుంటే చాలు. తాను గెలుస్తా ననే నమ్మకం వుంది. అది కూడా మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైసిపి ఎంపీ అభ్యర్థి అయ్యి, ఆత్మకూరు నుండి ఆనం రామ నారాయణరెడ్డి పోటీ చేయకుంటేనే..!

ఎటూ తేల్చని వై.సి.పి

ఎవరి వూహాగానాల్లో వారున్నప్పటికీ వై.సి.పి వ్యూహం మాత్రం సస్పెన్స్‌లో నడుస్తోంది. అసలు ఆదాలకే వీరు గాలం వేస్తారా..? లేక మాగుంట శీనయ్యను నెల్లూరుకు పోటీ చేయిస్తారా అనే మీమాంస నడుస్తోంది. మరోవైపు రాజమోహన్‌రెడ్డితో పాటు చంద్రశేఖర్‌రెడ్డిని కూడా మార్చాలనే డిమాండ్‌ బలంగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మేకపాటి కుటుంబంలో ముగ్గురికీ సీటిస్తారా లేక ఇద్దరితో సరిపెట్టి స్థానాలు మారుస్తారా అన్నది తెలవలసి వుంది. ఆదాలను టైట్‌ చేయాలంటే యంపి అభ్యర్థిని ఖచ్చితంగా మార్చి ఆత్మకూరు నుండి ఆనంను, వెంకటగిరి నుండి రాం కుమార్‌ను, ఉదయగిరి నుండి గౌతంను బరిలోకి దింపితే టిడిపి ఆశలు అడియాశ లైపోతాయి. ఒకవేళ మాగుంట శీనయ్య పార్టీ మారే ఆలోచనలో లేకపోతే మరో బలమైన కొత్త అభ్యర్థిని కూడా బరిలోదించే ఆలోచనలో వైసిపి వున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా నెల్లూరు పార్ల మెంటు అభ్యర్థిపైనే మిగిలిన అసెంబ్లీల భవిష్యత్తు ఆధారపడి వుందన్నది కాదనలేని వాస్తవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here