Home గల్పిక భూలోకంలో నారదుడి సంక్రాంతి

భూలోకంలో నారదుడి సంక్రాంతి

అది బ్రహ్మలోకం… సరస్వతీదేవి వీణ వాయిస్తుండగా బ్రహ్మదేవుడు మైమ రచి వున్నాడు. అంతలో నారాయణ… నారాయణ… అనే మాటలు వినిపించే సరికి బ్రహ్మదేవుడు ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. ఎదురుగా సుపుత్రుడు నార దుడు… ఏం కుమార, ఇలా వచ్చావు, మా ఇద్దరి మధ్య తగవులు పెట్టడానికి కాదు కదా? అని అడిగాడు. అందుకు నారదుడు… తండ్రీ మీకు అంత సీన్‌ లేదు. తల్లి డామినేషన్‌ వున్న దగ్గర ఎక్కడా గొడవలు రావు. భూలోకంలో ఎక్కడచూసినా మా తల్లి సరస్వతీదేవి విగ్రహాలే వుంటాయి. ఏ చిన్నారికైనా ఆమెకు పూజ చేయించాకే విద్యాభ్యాసం మొదలుపెట్టిస్తారు. భూలోకంలో మీకు పూజలే లేవాయె… మీ ఇద్దరి మధ్య తగవులెందుకు వస్తాయి అని చెప్పాడు. డామినేషన్‌ సరస్వతీదేవిదే అనేసరికి బ్రహ్మదేవుడి అహం దెబ్బతింది. మనసు చిన్నబుచ్చుకుని కోపంతో ఇంట్లోకి వెళ్లి పోయాడు. సరస్వతీదేవి వీణ పక్కనపెట్టి లేచొచ్చి… నా మీద నీకు అభిమానం వుంటే మనసులో పెట్టుకో, దానిని బయట పెట్టి ఇలా మీ నాన్నను బాధపెట్టొద్దు… ఎంతైనా మగవాళ్ళు కదా! నిజాలు విని తట్టుకోలేరు అని చెప్పి… ఏమన్నా పని మీద వచ్చావా నాయనా అని అడిగింది. అందుకు నారదుడు… సంక్రాంతి పండక్కి భూలోకంకు వెళదామనుకుంటున్నా… ఈ ఆధునిక కాలంలో కూడా సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారో చూద్దామనుకుం టున్నా తల్లే!… అని చెప్పాడు. అప్పుడు సరస్వతీదేవి… వెళ్లిరా నాయనా, కాక పోతే అక్కడ ఎవరి మధ్య గొడవలు పెట్టొద్దు అని చెప్పింది. దానికి నారదుడు అయ్యో… పిచ్చి తల్లి! అక్కడ నాకు అంత సీన్‌ వుండదు. అక్కడుండే మీడియా ఛానెల్స్‌ ముందు నేనెంత అని చెప్పి ఆమె ఆశీస్సులు తీసుకుని భూలోకానికి బయలు దేరాడు.

————–

ఢిల్లీలోని టెన్‌జనపథ్‌… సోనియా గాంధీ సంక్రాంతి ఎలా జరుపుకుం టుందో చూద్దామని చెప్పి… నారదుడు ఒక ఎద్దును తీసుకుని సన్నాయి వాయిస్తూ అక్కడ ఆగాడు. అమ్మా తల్లీ డూడూ బసవన్న వచ్చాడు.. ధర్మం చెయ్యి తల్లీ అని అరిచాడు. లోపల నుండి సోనియా గాంధీ, రాహుల్‌, మన్మోహన్‌సింగ్‌లు బయటకు వచ్చారు. నారదుడు బస వన్నతో… అమ్మగారికి దండం పెట్టు అన్నాడు. బసవన్న ముందు కాళ్ళు ముం దుకు చాపి దండం పెట్టాడు. అమ్మగారు చల్లంగుండాలా…. అమ్మగారు ఈ దేశాన్ని ఏలాల… ఏమంటావు అని అడి గాడు. బసవన్న తలాడించాడు. అప్పుడు సోనియాగాంధీ… నీ దగ్గర ఒక బసవన్నే వున్నాడు… నా దగ్గర వున్నోళ్లందరూ బసవన్నలే! గులాంనబీ, అహ్మద్‌పటేల్‌, మల్లిఖార్జున ఖర్గే, కమల్‌నాథ్‌, కపిల్‌ సిబాల్‌, వి.హెచ్‌…. అందరూ ఒకసారి బయటకు రండి అని కేకేసింది. అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. మన్మోహన్‌ సింగ్‌తో సహా అందర్నీ వరుసగా నిలబెట్టి సోనియా ‘సిట్‌’ అని అరిచింది. అందరూ కూర్చున్నారు… ‘స్టాండ్‌’ అంది… అం దరూ లేచారు. రొటేట్‌ యువర్‌ హెడ్స్‌ అని అరిచింది. అందరూ మెడలు తిప్ప సాగారు. అప్పుడు నారదుడితో సోనియా… నా ఇంటి నిండా బసవ న్నలే… నేను రోజూ వారితో ఆడుకుం టుంటాను… నీ బసవన్న విన్యాసాలు వాటి ముందు ఏపాటి అని అంది. నారదుడికి మతిపోయినంత పనై, అక్కడ నుండి వస్తుండగా రాహుల్‌ పరుగెత్తు కుంటూ వచ్చి… ఓ స్వామి, నీకీ విషయం తెలుసా అని నారదుడిని అడిగాడు. ఏ విషయం అని నారదుడు అడిగాడు. రాఫెల్‌ డీల్‌లో నరేంద్రమోడీ లక్ష కోట్ల రూపాయలు తిన్నాడు అని రాహుల్‌ అన్నాడు. ఈ విషయం నాకెందుకు చెబుతున్నావని నారదుడు అడిగాడు. నీకే కాదు, నాకు కనిపించిన ప్రతివాడికీ ఈ విషయం చెబుతున్నాను, నువ్వు కూడా ఇంకో నలుగురికి చెప్పు అంటూ రాహుల్‌ అక్కడనుండి వెళ్లిపోయాడు. నారదుడు సోనియా ఇచ్చిన స్ట్రోక్‌ నుండి బయట పడి ఈసారి హరిదాసు వేషంలో ప్రధాన మంత్రి కార్యాలయం వద్దకు వెళ్లాడు. పిఎంఓ ఆఫీసు ముందు రామ సంకీర్తన పాడుతూ చిడతలు వాయిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడు డైమండ్‌ ప్రధాని నరేంద్ర మోడీ బయటకు వచ్చాడు. మోడీని చూడగానే హరిదాసు వేషంలో వున్న నారదుడి ముఖం వెలిగి పోయింది. హరిదాసును నరేంద్రమోడీ ప్రేమగా పలుకరించాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నారదుడు మన సులో… ఎంతైనా బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళే… హిందువుల పండుగలను గౌర వించేది వీళ్ళే! ఆ సోనియాగాంధీ విదేశీ యురాలు కాబట్టే కదా మన సంక్రాంతి విలువ తెలుసుకోలేకపోయింది. మోడీ చూడు హరిదాసుకు ఎంత ప్రాధాన్యత నిస్తున్నాడో అని మనసులో అనుకున్నాడు. ఈలోపు మోడీ నారదుడితో… ఇలా భిక్షాటన చేసి రోజుకు ఎంత సంపాదిస్తా వేంటి అని అడిగాడు. రోజుకు ఐదు వేలన్నా వస్తాయని నారదుడు అన్నాడు. ఎంత కాలం నుండి చేస్తున్నావు ఈ పని అని మోడీ అడిగాడు. ఓ వెయ్యి సంవత్స రాల నుండి అని నారదుడు నోటికొచ్చింది చెప్పేసాడు. ఇక్కడ వెయ్యి సంవత్సరాలు మనిషి ఎలా బతుకుతాడు అని మోడీ ఆలోచించలేదు. వెయ్యి సంవత్సరాలకు అతను ఎంత సంపాదించి వుంటాడన్నది లెక్కేశాడు. వెంటనే ఐ.టి అధికారులను, పోలీసులను, జిఎస్టీ అధికారులను పిలి పించాడు. వారితో… ఈ హరిదాసు రోజుకు 5వేలు లెక్కన వెయ్యేళ్ళ నుండి సంపాదిస్తున్నాడంట… ఐ.టి, జిఎస్టీ ఏమీ కట్టడం లేదు, వెయ్యేళ్ళకు అతని ఆదాయం లెక్కకట్టి అపరాధ రుసుంతో సహా ఆదాయపన్ను, జిఎస్టీ వసూలు చేయండి, లేకపోతే జైలులో వేయించండి అని చెప్పి అక్కడనుండి వెళ్లిపోయాడు.

—–

నారదుడు ఐటి, పోలీసు అధికారుల చెర నుండి చచ్చీచెడి బయటపడ్డాడు. ఢిల్లీలో లాభం లేదు… ప్రపంచంలోకే మేటి నగరం అమరావతిలో అయితే సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటుం టారు అనుకుని విమానం ఎక్కి గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగాడు. కారులో నేరుగా ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడ నారదుడు జంగందొర వేషం కట్టి, చేతిలోని గిలక వాయిస్తూ… అమ్మ పలుకు జగదాంబ పలుకు… కొండదేవర ఆన… దొరా ధర్మం చేయండి అని అరిచాడు. లోపల నుండి హైటెక్‌రత్న చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్‌, బ్రాహ్మణిలు వచ్చారు. జంగందొర వేషంలో వున్న నారదుడు… భువనేశ్వరితో… అమ్మగారు… అయ్య గారికి చెప్పి ఒక కోటు ఇప్పించండి, మిమ్మల్ని ఆ ఈశ్వరుడు చల్లంగా చూస్తాడు అని చెప్పాడు. అప్పుడు చంద్ర బాబు జంగం దొరతో… జంగం దేవరా… నీకు కొన్ని విషయాలు చెబుతా విను… కంప్యూటర్‌లు కనిపెట్టింది నేనే, సెల్‌ ఫోన్‌లు కనిపెట్టింది నేనే… సూర్యుడు నేను చెబితేనే ఉదయిస్తాడు… నేను చెప్పాకే అస్తమిస్తాడు… సముద్రాన్ని కంట్రోల్‌ చేసేది నేనే… అలలకు ఎలా శబ్దం చేయాలో నేర్పింది నేనే, నీకు తెలుసో లేదో… బోగి పండుగరోజున బోగి మంటలు వేయాలని, సంక్రాంతి పండక్కి అరిశెలు చేసుకోవాలని చెప్పింది నేనే… అసలు తెలుగోళ్ళకు సంక్రాంతి పండుగ కనిపెట్టింది నేనే… నేను ఇంకో విషయం చెప్పనా… 2018 సంవత్సరం పోయాక 2019 సంవత్సరం రావాలని కూడా చెప్పింది నేనే అని చెప్పాడు. అంతా విన్నాక నారదుడికి మతి తప్పి ‘నారాయణ నారాయణ’ మంత్రం బదులు… ”అది నేనే ఇది నేనే” అనే పాట పాడుకుంటూ వెళ్ళసాగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here