Home జిల్లా వార్తలు బ్రదర్స్‌ దారెటు?

బ్రదర్స్‌ దారెటు?

ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి… ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ… వీళ్ళంతా రెండోతరం నాయకులు… ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి, ఆనం చెంచుసుబ్బారెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డి, ఆనం కార్తికేయరెడ్డి. 2009 ఎన్నికల తర్వాత ఆనం వెంకటరమణారెడ్డి మాయమయ్యాడు. స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కొడుకులైన ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డిలు 2014 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏ.సి.సుబ్బారెడ్డి ఆ ఎన్నికల్లో నెల్లూరు నగరం అసెంబ్లీ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, ఆనం రంగమయూర్‌రెడ్డి మాత్రం 12వ డివిజన్‌ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగానే కార్పొరేటర్‌గా గెలిచాడు.

ఈరోజు వివేకా లేడు, ఆయన రాజకీయ వారసులు సుబ్బారెడ్డి, మయూర్‌రెడ్డిలే! వారి చిన్నాన్న ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరడానికి రంగం సిద్ధమవుతోంది. వీళ్ళను కలుపుకునే ఆయన పార్టీలో చేరాలనే ఆలోచనలో వున్నాడు. వైసిపిలో చేరితే ఆయనకు ఎక్కడోచోట అసెంబ్లీ సీటొస్తుంది. రామనారాయణరెడ్డి తన కోసమే కాకుండా మరో అసెంబ్లీ సీటును కాని లేదా కార్పొరేషన్‌ను గాని తమకివ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపిలో కండీషన్‌లు పెట్టి చేరే సీన్‌ లేదు. పార్టీలో చేరాక మన శక్తిసామర్ధ్యాలు చాటుకుని పార్టీలో ఎదగాల్సిందే! ఇప్పుడు వైసిపిలో చేరితే రామనారాయణరెడ్డికి సీటివ్వగలరేగాని ఏసి, మయూర్‌లకు ఏమిస్తారన్నది గ్యారంటీ వుండదు. అయితే వారిద్దరికి ఇంకా భవిష్యత్‌ వుంది కాబట్టి పార్టీలో చేరి తమ చిన్నాన్న నాయకత్వంలో ఎదిగేదానికి అవకాశముంది.

కాగా, తెలుగుదేశం వైపు నుండి వివేకా కొడుకులిద్దరినీ పార్టీలో నిలబెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏ.సి.సుబ్బారెడ్డికి నెల్లూరు టిక్కెట్‌ లేదా కార్పొరేషన్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మయూర్‌రెడ్డి మాత్రం తన చిన్నాన్నతో కలిసి వైకాపాలో చేరడానికే సిద్ధంగా వున్నాడని, ఏ.సి.సుబ్బారెడ్డి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here