Home సంపాదకీయం బ్యాలెట్‌ పైనే మోజు

బ్యాలెట్‌ పైనే మోజు

అభివృద్ధిలో వెనుకబడివున్నాం… అగ్రదేశాలతో పోలిస్తే ఆర్ధికవృద్ధి రేటులో వెనుకబడి వున్నాం… రక్షణ రంగంలో ఇంకా పుంజుకోవాలి… అంతరిక్ష పరిశోధనలపై ఇంకా సాధించాల్సిందెంతో వుంది. సైన్స్‌లో అగ్రదేశాల వేగాన్ని అందుకోలేకపోతున్నాం… ఉత్పత్తుల్లో వేగం పెంచలేకపోతున్నాం… శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో సాధించాల్సిన పురోగతి ఎంతో వుంది… అగ్రదేశాలతో పోలిస్తే భారతదేశం చాలారంగాలలో వెనుకబడేవుంది. ఒప్పుకుందాం! ఆ రంగాలలో వేగవంతమైన పురోగతికి కృషి చేద్దాం. అయితే అగ్రరాజ్యాలలో లేని విధంగా భారతదేశంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌ భారత దేశంలో ఎన్నికలను నిర్వహిస్తోంది. దాదాపు 20ఏళ్ళ క్రితమే దేశంలోకి ఈవిఎంలు ప్రవేశించాయి. దేశంలోని 544 లోక్‌సభ స్థానాలు, 25 రాష్ట్రాలలో ఆనాడే ఈవిఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించి ఎన్నికల ప్రక్రియను అత్యంత సులభతరం చేసింది మన ఎన్నికల కమిషన్‌!

అయితే ఇప్పుడు పలు రాజకీయపార్టీలకు ఈవిఎంలు నచ్చడం లేదు. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు వామపక్ష పార్టీలు, బీజేపీని వ్యతిరే కించే ప్రాంతీయ పార్టీలు ఈవిఎంలను వ్యతిరేకిస్తు న్నాయి. పాత పద్ధతిలో మళ్ళీ బ్యాలెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా ఇంకా బ్యాలెట్‌ ద్వారానే ఎన్నిక లను నిర్వహిస్తున్నారని, అలాంటిది మన దేశంలో ఈవిఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరమేముందన్నది ఈ పార్టీల ధర్మసందేహం! అంతేగాని ఎన్నికల ప్రక్రియలో అమెరికా కూడా చేపట్టలేనటువంటి అధునాతన ఓటింగ్‌ విధానాన్ని మనం అనుసరిస్తున్నామనే స్పృహ ఈ పార్టీలకు లేకుండాపోయింది.

సెప్టెంబర్‌ 27వ తేదీన ఢిల్లీలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఈ ఏడాది చివర్లో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, 2019 ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించే లోక్‌సభ ఎన్నికలపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. గుర్తింపు వున్న 7 జాతీయ పార్టీలను, 51 రాష్ట్ర స్థాయి పార్టీలను సమావేశానికి ఆహ్వానించగా 41 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈవిఎంలపైనే ప్రధాన చర్చ జరిగింది. ఈవిఎంల ట్యాంపరింగ్‌ జరుగుతుందని కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ, బహుజనసమాజ్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు వాదించాయి. బీజేపీ మినహా 6 జాతీయ పార్టీలు ఈవిఎంలను వ్యతిరేకిస్తూ బ్యాలెట్‌కు మద్దతు పలికాయి. రాష్ట్ర పార్టీలలోనూ ఎక్కువ పార్టీలు బ్యాలెట్‌ వైపే మొగ్గు చూపడం ఆశ్చర్యం కలిగించే పరిణామం.

కాంగ్రెస్‌, ఎస్పీ, బిఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు గతంలోనూ ఈవిఎంల పనితీరుపై ఎన్నోసార్లు సందేహాలు వ్యక్తం చేసాయి. ఎన్నికల కమిషన్‌ అధికారులు కూడా ఈవిఎంల పనితీరును ప్రయోగాత్మకంగా వారి ముందే చూపించి సందేహాలు నివృత్తి చేసారు. అయినా ఈవిఎంలపై వీళ్ళ మనసుల్లో నాటుకుపోయిన అనుమానపు బీజాలు మొలకెత్తి మహావృక్షాలుగా ఎదిగాయేగాని, ఆ అనుమానం చావలేదని నిన్నటి ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఋజువైంది.

ఈవిఎంలపై కొన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ప్రధాన కారణం గత నాలుగేళ్ళలో దేశంలోని పలు రాష్ట్రాలలో అధికార బీజేపీ సాధించిన విజయాలే! దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాలలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో వుంది. కొన్ని రాష్ట్రాలలో బీజేపీ విజయాలను అనుమానించాల్సిన అవసరం లేదు. త్రిముఖ పోటీ ఏర్పడి హంగ్‌ ఫలితాలు వస్తాయనుకున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 300కుపైగా సీట్లు రావడం సమాజ్‌వాదీ, బిఎస్పీ పార్టీలను ఖంగుతినేలా చేసింది. యూపి ఫలితాలు వెల్లడించిన రోజునే మెదడు మొద్దుబారిపోయిన ఈ పార్టీల నేతలు అఖిలేష్‌ యాదవ్‌, మాయవతిలు ఈవిఎంల టాంపరింగ్‌ జరిగిందంటూ పెద్దఎత్తున ఆరోపణలు చేసారు. అలాగే బీజేపీ ఉనికేలేని అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాలతో పాటు, అనూహ్యంగా హర్యానాలో అధికారం చేజిక్కించుకోవడం, ఈసారి ఖాయంగా అధికారం కోల్పోతుందనుకున్న గుజరాత్‌లో బీజేపీ తిరిగి విజయకేతనం ఎగుర వేయడం వంటివి ఈవిఎంలపై విపక్షాల అనుమానం బలపడడా నికి కారణమయ్యాయి.

అయితే ఈవిఎంల ట్యాంపరింగ్‌కు అవకాశమే వుంటే మరి బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయినట్లు? పంజాబ్‌లో ఎందుకు అధికారం కోల్పోయినట్లు? యూపీలో జరిగిన రెండు లోక్‌సభ ఉపఎన్నికల్లో ఎందుకు దారుణ పరాజయా లను చవిచూసినట్లు? ఈవిఎంల ట్యాంపరింగ్‌కు అవకాశమే వుంటే కర్నాటకలో ఎందుకు ఓడిపోయినట్లు? ప్రజలు తమను ఏ కారణంతో తిరస్కరించారనే దానిపై ఆలోచించుకోవాల్సింది పోయి రాజకీయ పార్టీలు తమ పరాజయాలకు ఈవిఎంలే ప్రధాన కారణం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఎన్నికల కమిషన్‌ చెప్పినట్లు ఎన్నికల ప్రక్రియలో మళ్లీ బ్యాలెట్‌ విధానాన్ని తీసుకురావడమంటే పోలింగ్‌బూత్‌ల ఆక్రమణకు తెరతీయడమే! హింసను ప్రేరేపించడమే! నిజమే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్‌ విధానమే వుంది. అయితే మన దేశంలోలాగా అక్కడ బూత్‌ల ఆక్రమణ, రౌడీగ్యాంగ్‌ల స్వైరవిహారం, రిగ్గింగ్‌ వంటి దుశ్చర్యలు వుండవు. బ్యాలెట్‌ విధానంలోనూ వారి ఓటింగ్‌ ఎంతో ప్రశాంతంగా జరుగుతుంది. కాని, మన దేశంలో మళ్ళీ బ్యాలెట్‌ను ప్రవేశపెడితే తెరమరుగైన ఎన్నికల హింసా సంస్కృతికి తిరిగి ప్రాణం పోసినట్లే అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ అయిన భారత్‌లో ఎన్నికల ప్రక్రియకు ఈవిఎంలే మేలు. ప్రతి ఓటును ఆధార్‌తో అనుసంధానం చేసి, ఈవిఎంలపై ఇంకా ఏవైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసి, ఎన్నికల సంస్కరణలలో ఇంకొంచెం ముందుకుపోవాలి. అంతేగాని, బూజు పట్టిన బ్యాలెట్‌ తెచ్చి మళ్ళీ ఎన్నికలను రక్తసిక్తం చేయాల్సిన అవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here