Home రాష్ట్రీయ వార్తలు బ్యాండ్‌ పడింది

బ్యాండ్‌ పడింది

తెలంగాణ ఎన్నికలలో మహాకూటమి గెలిచి వుంటే పరిస్థితి ఎలా వుండేది? సీఎం అభ్యర్థులందరూ అమరావతిలో చంద్రబాబు ఇంటి బయట పడిగాపులు కాస్తుండే వాళ్ళు… చంద్రబాబు లోపల కూర్చుని సీఎంగా ఎవరిని పెట్టాలి, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై రాహుల్‌గాంధీతో ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. పచ్చ ఛానెల్స్‌లో క్షణక్షణానికి స్క్రోలింగ్స్‌ మారుతుండేవి. ‘తెలంగాణ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు’… ‘సీఎం అభ్యర్థులంతా చంద్రబాబు కరుణ కోసం పడిగాపులు’… ‘చంద్రబాబు చుట్టూ తెలంగాణ రాజకీయం’…

అంచనాలు తారుమారయ్యాయి. దీంతో వీళ్ళకు ఈ పని లేకుండా పోయింది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ గెలుపుకు కేసీఆర్‌ కారణం కావచ్చు. కాంగ్రెస్‌ ఓటమికి కారణం చంద్రబాబు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్‌పార్టీ తన నెత్తిన తానే మట్టేసుకుంది. చంద్రబాబుతో పొత్తే వాళ్ళ కొంప ముంచింది.

తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలుగా వేరుపడ్డాయి. 2014 ఎన్నికల్లో టిడిపి, వైసిపిలు కూడా తెలంగాణలో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గెలిచింది. వైసిపి, టిడిపిలు ఇక ఆంధ్రా పార్టీలుగా ముద్రపడ్డాయి. టిడిపి, వైసిపిల నుండి గెలిచిన వాళ్ళు కూడా చాలావరకు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. కొందరు కాంగ్రెస్‌, బీజేపీలవైపు వెళ్లారు. అంటే ఈ రెండు ఆంధ్రా పార్టీలు అక్కడ నిర్వీర్యమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం ఒకే ఒక సీటును గెలుచుకుంది. సెటిలర్లు అంతా కూడా టిఆర్‌ఎస్‌ వైపు వెళ్లిపోయారని చంద్రబాబు అప్పుడే అర్ధం చేసుకుని వుండాలి. కాని, ఆయన అలా అర్ధం చేసుకోలేదు. తెలంగాణలో ఇంకా తనకు బలముందని, హైదరాబాద్‌పై మళ్ళీ పెత్తనం సాగించాలని, అందుకు ఒక్కడి శక్తి చాలదని కాంగ్రెస్‌తో జత కట్టాడు. కాంగ్రెస్‌కు ఇక్కడే దరిద్రం మొదలైంది. కూటమి ప్రచారం అంతా చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయింది. కూటమి ప్రచార సభలలో చంద్రబాబు తన భజనే ఎక్కువుగా చేసుకోసాగాడు. తెలంగాణ ప్రజల సమస్యల కంటే కూడా హైదరాబాద్‌ నా పుణ్యమే అన్నట్లు చంద్రబాబు మాట్లాడసాగాడు. తెలంగాణ ప్రజలు ఆయన మాటలను స్వాగతించలేదు. సరికదా, ఆయనపై ఇంకొంత వ్యతిరేకత పెరిగింది. అన్నింటికి మించి కాంగ్రెస్‌లో చంద్రబాబు పెత్తనాన్ని ఆ పార్టీకి బలమైన మద్దతుదారులుగా వున్న రెడ్లు సహించలేకపోయారు. హైదరాబాద్‌ సిటీతో పాటు ఆయా జిల్లాల్లో రెడ్ల ప్రాబల్యం బలంగా వుంటుంది. చంద్రబాబు కాలుపెట్టాక ఆయనపై వ్యతిరేకతతో వీళ్లంతా టిఆర్‌ఎస్‌ వైపు మళ్లారు. దీనికితోడు కాంగ్రెస్‌, టిడిపిల కూటమి ఓడిపోవాలనే కసితో వైసిపి అభిమానులు, పవన్‌ అభిమానులు కూడా టిఆర్‌ఎస్‌కే మద్దతు పలికారు. ఇక సెటిలర్స్‌ అయితే చంద్రబాబును అసలు పట్టించుకోలేదు. ఈ పర్యవసానాల నేపథ్యంలోనే టిఆర్‌ఎస్‌కు ఘనవిజయం. కూటమికి దారుణ పరాజయం. కొంతకాలం క్రితం చంద్రబాబు ఆవేశంగా చెప్పాడు… కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానని… ఈ రూపంలో ఆయన కాంగ్రెస్‌ను నాశనం చేస్తాడని ఎవరూ వూహించలేదు. టిఆర్‌ఎస్‌ వాళ్లకు నిజమైన కృతజ్ఞత అన్నది వుంటే… చంద్రబాబుకు వాళ్ళు జీవితాంతం ఋణపడి వుండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here