Home సంపాదకీయం బోరుమంటున్న మలబారు

బోరుమంటున్న మలబారు

పచ్చని ప్రకృతి సోయగాలకి..రమణీయమైన ప్రకృతి సుందర దృశ్యాలకి నెలవై.. పర్యాటకులకు స్వర్గధామంగా పేరొందిన కేరళ..ఇప్పుడు జలవిలయంతో గడగడ వణికిపోతోంది. ఇప్పటికే భారీగా కురిసిన కుండపోత వానలతో, హోరెత్తే ఈదురు గాలులు..ముంచెత్తే వరదలతో కల్లోలమైపోయింది. పచ్చపచ్చని హరిత పతాకాన్ని ఎగురవేస్తూ ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే కేరళ..ఇప్పుడు అన్నమో రామచంద్రా అంటూ అల్లాడిపోతోంది. ఎల్లవేళలా అయ్యప్పస్వామి భక్తుల శరణుఘోషలతో మార్మోగే దివ్యభూమి..ఇప్పుడు వరద తాకిడితో కకావికలమైపోయింది. దేవభూమిలో ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. మహిళలు, వృద్ధులు.. పసికూనలు ఆకలికి తట్టుకోలేక మరింతగా అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా నీటి ప్రవాహాలే. అలల కల్లోలంతో కేరళ అల్లకల్లోలమైపోయింది. ఈ జలవిలయంలో ఇప్పటిదాకా కనీసం నాలుగువందల మందికిపైగానే వరద నోటికి చిక్కి బలైపోయి ఉం టారని అంచనా. ఇంకా లక్షలాదిమంది ప్రజలు నిరా శ్రయులయ్యారు. బాధితుల సంఖ్య అసంఖ్యాకంగానే ఉంది. మొత్తంగా సుమారు 20వేల కోట్లకు పైగానే ఆస్తినష్టం ఉంటుందని అంచనా. కేరళలోని 89 పట్టణాలు, 9500గ్రామాలు ఈ విలయంతో జల దిగ్బంధంలో కూరుకుపోయాయని, సుమారు మూడు లక్షల ఇళ్ళ దాకా పూర్తిగా వరదనీటిలో మునిగి పోయాయని సమాచారం. అయితే, వాస్తవానికి ఇలాంటి విపత్తుల్లో ఈ అంచనాలన్నా మించిన నష్టం..కష్టం మరెంతగానో ఉంటుందని అందరికీ తెలిసిందే. ఆగస్టు 8 నుంచి 15వ తేది వరకు కేరళలో ఎన్నడూ కనీవినీ ఎరుగనంత వర్షం కురిసింది. సాధా రణ వర్షపాతం కంటే మూడున్నర రెట్లు అధికంగా వాన విలయంలా వచ్చి ఊపేసింది. ఆగస్టు 16న ఒక్కసారిగా 137 మిల్లీమీటర్లు కురవడంతో భారీవర్షాలతో కేరళ నిండా మునిగిపోయింది. ఒక్క ఇడుక్కి ప్రాంతంలో ఒకేరోజున 266 మీల్లీమీటర్లు కురిసిందంటే చిన్న విషయం కాదు. కుంభవృష్టి అంటే ఇదే. ఒక కిలోమీటర్‌ మైదానంలో ఆ ఒక్కరోజు వచ్చిన వాననీటిని కుమ్మరిస్తే పదంతస్తుల భవనమంత ఎత్తున జలాశయం ఏర్పడుతుందని.. అంత పెద్దవానను కేరళలో ఈ నూరేళ్ళలో ఎప్పుడూ చూడలేదని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ”అయినా, ఇంతటి జలప్రళయాన్ని మేమెప్పుడూ చూడలేదయ్యా, వానంటే జల్లులుగా కురుస్తుందని అనుకున్నాం కానీ, ఇలా కుండలు పగలగొట్టి పైన కుమ్మరించినట్లు అదేపనిగా రోజుల తరబడి వాన రావడం ఇదేనంటూ”.. అక్కడి ప్రజలు ఈ కుంభవృష్టికి బెంబేలెత్తి పోయారు. ఈ జలవిలయంతో కేరళ కష్టం అంతా ఇంతా కాదు. కళ్ళ ముందే తమ ఇళ్ళన్నీ కూలిపోయాయి. లక్షలాదిమంది ప్రజలు సర్వం కోల్పోయారు. పంటలు మునిగిపోయాయి. పశుపక్ష్యాదులెన్నో చనిపోయాయి. ఎటుచూసినా కళేబరాలు..దుర్గంధంతో..బురదమయంగా మారిన వరద నీటి ప్రవాహాలతో నిలువనీడ లేక కేరళ ప్రజలు అల్లాడిపోతున్నారు. కేరళలోని త్రిశూర్‌, కొట్టాయం, అలెప్పి, ఎర్నాకులం తదితర ప్రాంతాల్లోని రెండు, మూడంతస్తుల భవనాలు సైతం నేలకూలిపోయాయంటే వరదల ఉధృతి ఎంత బలంగా ఉండిందో ఊహించుకోవచ్చు. మొదటి అంతస్తువరకు నీళ్ళలో మునిగిపోయాయంటే ఎంత ఎత్తున నీళ్ళు ప్రవహించాయో అంచనా వేసుకోవచ్చు. పంటలు పూర్తిగా నేలమట్టమైపోయాయి. ఎక్కడ చూసినా నీటి ప్రవాహాలే.. కోలుకోలేని విషాదాలే. మొత్తంగా కేరళ..ఒక విరిగిన కెరటంలా కకా వికల మైంది… పగిలిన కన్నీటి కడవలా మిగిలింది. కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు ఉగ్గబట్టు కోవడం తప్ప బాధితులకు మరో గత్యంతరం లేని దుస్థితి ఏర్పడింది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేక, తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్ళు కూడా దొరక్క ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. ప్రకృతి విలయానికి అన్ని వ్యవస్థలూ అస్తవ్యస్తమైపోయాయి. పర్వతప్రాంతమైన ఇదుక్కి జిల్లా, మలప్పురం, త్రిసూర్‌లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కోచి అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా నీట మునిగిపోయింది. శబరిగిరి వద్ద పంపానది ఉధృ తంగానే ఉంది. అయ్యప్పకొండకు వెళ్ళే మార్గమంతా బురదమయమైపోయింది. కేరళంతా ఇదే దుస్థితి. వరద వెళ్ళాక.. బురద మిగిలింది. రోడ్లన్నీ మట్టి కొట్టుకుపోయి..ఇళ్ళన్నీ బురద నిండిపోయి..బాధితుల హాహాకారాలు మిన్నుముడుతున్నాయి. తక్షణ సాయంగా కేంద్రం 600కోట్లు ప్రకటించింది. అయినా, అది చాలదు. ఇంత భారీ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఇంకా భారీ నిధులు కావాలి. అనేక రాష్ట్రాలు, ప్రజలు మానవతాదృక్ఫధంతో తమశక్తి మేరకు విరాళాలు అందిస్తూనే ఉన్నారు. అయినా, కేరళకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఆ విషాదానికి కొలమానాలు లేవు. కేరళ కోలుకోవాలంటే కనీసం పదేళ్ళయినా పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రకృతి ఉపద్రవాల్ని జాతీయవిపత్తుగా పరిగణించి కేంద్రప్రభుత్వం ప్రజలను అన్నివిధాలా ఆదుకోవాలి. ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు కేంద్రం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే వేలాదిమంది సైనికులు, ఇతర బలగాలు, స్వచ్ఛంధసంస్థలు వేలాదిమందిని పునరావాస కేంద్రానికి తరలించి ఆదుకుంటున్నాయి. వీరజవాన్లు ప్రాణాలకు తెగించి అనేక ప్రమాదకర ప్రాంతాల నుంచి సైతం ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. వారి సేవలకు విలువ కట్టలేం. అయినా, ఒక విలయం..ఎన్నో బాధలకు నిలయం. మరణించినవారి కుటుంబాల వేదనలు వర్ణనాతీతం. బాధితుల నష్టాలు, కష్టాలు ఎవరూ ఆర్చలేరు..తీర్చలేరు. అయినప్పటికీ అందరూ మనవంతు శక్తిమేరకు బాధితులకు బాసటగా ఉంటూ, మరణించినవారి కుటుంబాలకు తమవంతు అండదండలందించాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. జలవిలయంతో బావురుమంటున్న కేరళ కన్నీటిని తుడవాలి. అందుకు ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఒక్కటై బాధితులకు తమవంతు ఆపన్నహస్తం అందించాలి. అదే మానవత్వం…కేరళ ప్రజలను ఆదుకోవడమే ఇప్పుడు అందరి తక్షణ కర్తవ్యం!….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here