Home జిల్లా వార్తలు బొమ్మిరెడ్డికి మొండి చేయి!

బొమ్మిరెడ్డికి మొండి చేయి!

బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి… వెంకటగిరి నియోజక వర్గంలో వైసిపికి ఎవరూ లేని కాలంలో నేనున్నానంటూ ముందుకొచ్చాడు. నాలుగున్నరేళ్ళు పార్టీ జెండా మోసాడు. కార్యకర్తల చేత మోయించాడు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు శాయశక్తులా కృషి చేశాడు. ఇందుకోసం ఆర్ధికం గానూ ఎంతో నష్టపోయాడు. వచ్చే ఎన్నికలలో తానే అభ్యర్థినంటూ ప్రజల ముందుకు వెళ్ళాడు. విస్తృతంగా ప్రచారం చేశాడు. నియోజకవర్గంలో రాఘవకు సానుకూల వాతావరణం ఏర్పడింది. అంతా అనుకూలంగా వుందనుకున్న తరుణంలో వైసిపి అధిష్టానం నుండి ఆయనకు ఊహించని షాక్‌… ఇకనుండి వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా ఆనం రామనారాయణరెడ్డి వ్యవహరిస్తాడని, మీకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేస్తామని. అది కూడా పార్టీ అధినేత వై.యస్‌.జగన్‌ చెప్పలేదు. ఆయన నేరుగా మాట్లాడి పరిస్థితులను వివరించి ఎందుకు సీటు ఇవ్వలేకపోతున్నామో చెప్పివుంటే కొంతన్నా బాధ తగ్గేది. కాని ఆయన నేరుగా మాట్లాడకుండా పార్టీ జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేత చెప్పించాడు. ఈ పద్ధతిపైనే బొమ్మిరెడ్డి రాఘవ తీవ్ర ఆగ్రహంతో వున్నట్లు తెలుస్తోంది.

ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరడం మూలంగానే వెంకటగిరి సీటు రాఘవకు లేకుండా పోయిందంటున్నారు. ఆనంను పార్టీలోకి తీసుకోవడంలో తప్పు లేదు. కాని, బొమ్మిరెడ్డిని పక్కన పెట్టాల్సిన అవసరమేముంది! 11వ తేదీ విశాఖలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్ల సమావేశానికి కూడా రాఘవను ఆహ్వానించలేదు. నాలుగున్న రేళ్ళు ఒక నియోజకవర్గంలో పార్టీని నడిపిన నాయకుడికి ఇచ్చే గౌరవమిదేనా? ఎన్నికల నాటికి పరిస్థితులను బట్టి చెప్పొచ్చుగా? అది కూడా లేదు. జిల్లాలో మేకపాటి కుటుంబానికి మూడు సీట్లు ఇవ్వాల్సిన అవసరముందా? వాళ్ళకు సొంత బలం అంటూ ఏమీ లేదు. రెండు సీట్లే వారికి ఎక్కువ. ఆనంకు ఆత్మకూరు ఇచ్చేసి.. లోక్‌సభ, ఉదయగిరి సీట్లు వారికి ఇచ్చేయవచ్చు. లేదంటే నెల్లూరు లోక్‌సభకు ఆనంను పంపించి ఉదయగిరి, ఆత్మకూరు అసెంబ్లీలు మేకపాటి కుటుంబసభ్యులకు ఇచ్చి వుండొచ్చు.

2014 ఎన్నికల్లోనే ఇవ్వాల్సిన దానికంటే మేకపాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీ అభ్యర్థి కావడం వల్లే పార్లమెంటు పరిధిలో వైసిపి రెండు సీట్లను చేజార్చుకుంది. జిల్లాలో స్థానాలకు తగ్గట్లు సరైన అభ్యర్థులను పెడితే ఈసారి వైసిపి గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనే ప్రచారం వుంది. కాని గతంలోలాగే మేకపాటికి ఎక్కువ సీన్‌ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా రాజమోహన్‌రెడ్డినే పెడితే గతంకంటే ఎక్కువ సీట్లు కాదు కదా సగం సీట్లు రావడం కూడా కష్టమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here