Home జిల్లా వార్తలు బొమ్మాళి… నెల్లూరును వదలా?

బొమ్మాళి… నెల్లూరును వదలా?

చచ్చిపోయాక కూడా కొందరి ఆత్మలు తమకు ఇష్టమైన వారి చుట్టూ, లేదా ఇష్టమైన ప్రదేశాల చుట్టూ తిరుగుతుంటాయంటారు. కొందరు మనుషులకు బ్రతికుండగానే వారి మనసు ఇష్టమైన ప్రాంతాల చుట్టే తిరుగుతూ వుంటుంది. ఈ కోవలోకి చెందిన అధికారే మువ్వా రామలింగం!

ఈ జిల్లాలో పనిచేసిన అధికారులందరినీ ఒక జాబితాగా చేసి అందులో అత్యంత వివాదాస్పద అధికారులతో టాప్‌టెన్‌ లిస్ట్‌ను ప్రకటిస్తే అందులో నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌గా మువ్వా రామలింగం నిలిచిపోతాడు.ఏ జిల్లాలో వున్నా, ఏ హోదాలో వున్నా వివాదాలతో సహజీవనం చేయడం ఆయన నైజం.

20ఏళ్ళ క్రితం నెల్లూరులో డిప్యూటీ డిఇఓగా పనిచేసినప్పుడు ఆయనపై వివిధ రూపాలలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలకు కూడా దిగాయి. ఇక్కడనుండి బదిలీపై వెళ్ళి పలుచోట్ల పనిచేసినా వివాదాలు ఆయన వెన్నంటే నడిచాయి. తర్వాత అక్కడక్కడా పనిచేసి తనకు ఇష్టమైన నెల్లూరుకే డిఇఓగా వచ్చాడు. 2013-15ల మధ్య ఆయన డి.ఇ.ఓగా పనిచేసిన కాలంలో యధాతధంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉపాధ్యాయినులను వేధిస్తున్నాడనే పేరొచ్చింది. వీటిపై విచారించిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. అయితే ఆ తర్వాత ఆయన జిల్లాకు చెందిన మంత్రి ద్వారా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును గట్టిగా పట్టాడు. ఆయన ద్వారా 2016లో మళ్ళీ పోస్టింగ్‌ తెచ్చుకుని డిఇఓగానే మళ్ళీ తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు. యధావిధిగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఉపాధ్యాయ సంఘాలతో వివాదాలు, విద్యాశాఖలో అక్రమాలు… వీటన్నింటిపై విచారణ జరిపించిన ప్రభుత్వం మువ్వాను రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్ట్‌ చేసుకోమని ఆదేశించింది.

అయితే మువ్వా మళ్ళీ ఎవరిని పట్టుకున్నాడోగాని ఆ తర్వాత నెల్లూరు బి.ఇడి కళాశాల ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్‌ తెచ్చుకున్నాడు. అక్కడ మూడు నెలలకే వివాదాలు వచ్చాయి. రామలింగాన్ని మళ్ళీ అక్కడనుండి బదిలీ చేసి రంపచోడవరం ఐటిడిఏ డిఇఓగా బదిలీ చేసారు. నెల్లూరు గాలి, నెల్లూరు నీళ్ళు, నెల్లూరు తిండి, నెల్లూరు వాసనలకు అలవాటుపడ్డ రామలింగం ఎలా ప్రయత్నాలు చేసాడో ఏమో… మళ్ళీ నెల్లూరుజిల్లాకే పల్లిపాడు డైట్‌ ప్రిన్సిపాల్‌గా వచ్చాడు. ఈసారి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు మాత్రం ఆయన జిల్లాకు అవసరం లేదంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. మరి కలెక్టర్‌ ప్రయత్నం ఫలిస్తుందో, రామలింగం పంతం నెగ్గుతుందో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here