Home గల్పిక బిల్లు చూసి కళ్ళు తిరిగిన కుమారస్వామి

బిల్లు చూసి కళ్ళు తిరిగిన కుమారస్వామి

కర్నాటక రాజధాని గ్రీన్‌సిటి బెంగుళూరు. సచివాలయంలోని తన ఛాంబర్‌కు అప్పుడే వచ్చాడు ముఖ్య మంత్రి కుమారస్వామి. ఆయన కుర్చీలో కూర్చోగానే ఫోన్‌ మోగింది. ఆయన ఫోన్‌ ఎత్తాడు. ఏం కుమారస్వామి, ఆఫీసుకు వచ్చావా? అని అవతలి కంఠం ప్రశ్నిం చింది. ఆ గొంతు వినగానే కుమారస్వామి టక్కున నిలబడి ఫోన్‌లోనే నమస్తే పెడుతూ… వచ్చానమ్మా, రోజూ 9 గంటల కల్లా ఆఫీసుకు వచ్చేస్తున్నానమ్మా, మీరు అప్పజెప్పిన పనులన్నీ చేస్తున్నా నమ్మా అని చెప్పాడు. అవతల నుండి ఆ గొంతు… ఇంతకీ టిఫిన్‌ చేసొచ్చావా అని అడిగింది. మీరు చెబితే తింటానమ్మా అని కుమారస్వామి అన్నాడు. తిని తగలబడు అంటూ ఆ గొంతు ఫోన్‌ పెట్టేసింది. కుమారస్వామి కుర్చీలో కూలబడి తల పట్టుకున్నాడు. అదంతా చూస్తున్న పి.ఏ నంజూడప్ప… ఎవరు సార్‌ ఫోన్‌ అని అడిగాడు. దానికి కుమార స్వామి… అందరికీ మొగుళ్ళు మొగోళ్ల రూపంలో తగులుకుంటారు, నాకు సోనియా రూపంలో తగులుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక… కుమార స్వామి నీకు మద్దతునిస్తాం, సీఎం కుర్చీలో కూర్చోమని ఆమె చెబితే ఏంటో అనుకున్నాను… ఎగిరి గంతేసి సీఎం కుర్చీలో కూర్చున్నాను. సీఎం కుర్చీ నాకిచ్చి దీని రిమోట్‌ మాత్రం సోనియా గాంధీ తన చేతిలో పెట్టుకుంది. రిమోట్‌తో నడిచే కారుబొమ్మలాగా తయారైంది నా పరిస్థితి అని వాపో యాడు. అందుకు నంజూడప్ప… ఊరు కోండి సార్‌, ఈ కష్టాలు ఎక్కువకాలం వుండవులే, యూనైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభు త్వంలో ప్రధానిగా మీ నాన్నను సోనియా గాంధీ ఎక్కువ కాలం కష్టపెట్టలేదు, సంవత్సరంలోనే విముక్తి కల్పించింది. మిమ్మల్ని కూడా మహా అంటే ఇంకో ఆరు నెలలు ఇబ్బంది పెడతారు అని ఓదార్చాడు. అంతలో ఛాంబర్‌లోకి అసెంబ్లీ కార్యదర్శి చెంగళప్పగౌడ్‌ వచ్చి కుమారస్వామి చేతికి ఒక కవర్‌ ఇచ్చాడు. ఏంటిది అని కుమారస్వామి అడిగాడు. తమరి ప్రమాణస్వీకారోత్సవానికి విచ్చేసిన వివిధ పార్టీల అధినేతలు హోటల్‌లో బసచేసిన బిల్లులు సార్‌ అని చెంగళప్ప గౌడ్‌ చెప్పాడు. కుమారస్వామి కవర్‌ చించి బిల్లు చూడసాగాడు. అరవింద్‌ కేజ్రీవాల్‌ – రూ.1,40,000/-, మమతా బెనర్జీ రూ.80,000/-, మాయావతి రూ.1,10,000/-, రాహుల్‌గాంధీ 95,000/-, అఖిలేష్‌యాదవ్‌ రూ.80,000/-, సీతారాం ఏచూరి రూ.25,000/-… అలా చదువుకుంటూ చివరికొచ్చాడు. చంద్రబాబునాయుడు అన్నచోట బిల్లు అమౌంట్‌ చూసాడు. అది చూడగానే షాక్‌ గురై కుర్చీలోనే స్పృహ తప్పి పడిపోయాడు. నంజూడప్ప, చెంగళప్పగౌడ్‌లు ఆందోళనకు గురై అక్కడే వున్న వాటర్‌ బాటిల్‌ తీసుకుని మొహంపై నీళ్ళు చల్లారు. కుమారస్వామి స్పృహలోకి వచ్చాడు. నంజూడప్ప వుండి… ఆ బిల్లులో ఏం చూసారు సార్‌, అంతగా స్పృహ తప్పి పడిపోయారు అని అడి గాడు. ఆ చంద్రబాబునాయుడు మనిషా, మహాఋషా… సంసారా? సన్యాసా? ఏమి చేస్తే ఇంత బిల్లు వచ్చింది అని కుమారస్వామి అన్నాడు. ఎంత బిల్లు వచ్చింది సార్‌ అంటూ నంజూడప్ప ఆ బిల్లు తీసుకుని చూసాడు. అంతే అతను కూడా కుప్పకూలిపోయాడు. ఈసారి కుమారస్వామి, చెంగళప్పగౌడ్‌లు కలిసి నంజూడప్ప మొహంపై నీళ్ళు చల్లి లేపారు. ఈసారి చెంగళప్పగౌడ్‌ బిల్లు తీసుకోబోతుండగా కుమారస్వామి వుండి… నీ గుండె గట్టిదైతేనే ఆ బిల్లు చూడు అని చెప్పాడు. అందుకు చెంగ ళప్ప… ఏ ఇబ్బంది లేదు సార్‌ అంటూ బిల్లు తెరచి చంద్రబాబునాయుడు అన్న చోట బిల్లు అమౌంట్‌ చూసాడు. రూ. 1,116/- వుంది. ఆశ్చర్యంతో చెంగళప్ప గౌడ్‌… ఇదేంటి సార్‌, ఈ బిల్లేంటి సార్‌, అంతర్జాతీయ స్థాయి నాయకుడు చంద్ర బాబునాయుడి గారి ఒకరోజు బస ఖర్చు వెయ్యి నూటపదహారు రూపాయలేనా? ఇంతకీ ఆయన ఎక్కడ బస చేసినట్లు, ఏం తిన్నట్లు అని అడిగాడు. అప్పుడు నంజూడప్ప వారితో ఈ విధంగా జరిగి వుండొచ్చు అని ఒక వూహాచిత్రం ప్లాన్‌ చేసి ఎయిర్‌ స్క్రీన్‌పై ప్లే చేసాడు.

్య్య్య్య్య

నూటపాతిక ప్రపంచ మేటి నగరా లను కాచి వడపోస్తే వచ్చిన అమరావతి నగరమది. ఉండవల్లిలోని తన కార్యా లయంలో హైటెక్‌రత్న చంద్రబాబు వున్నాడు. మంత్రులు కె.ఇ.కృష్ణమూర్తి, నారాయణ, దేవినేని ఉమా, కళా వెంకట్రావు, ఎంపీ సీఎం రమేష్‌లు వున్నారు. చంద్రబాబు వారితో… కుమారస్వామి ప్రమాణస్వీకారానికి మనమంతా బెంగుళూరు పోవాలని చెప్పాడు. గన్నవరం ఎయిర్‌పోర్టులో స్పెషల్‌ ఫ్లైట్‌ సిద్ధంగా వుందని సీఎం రమేష్‌ చెప్పాడు. విమనాలు, గిమానాలు వద్దు… ప్రజల సొమ్ము పాముతో సమానం. ఒక ఇన్నోవా కారును మాట్లా డండి… మన డీజిల్‌ మనమే పోసుకుని బెంగుళూరుకు పోదాం అని చంద్రబాబు చెప్పాడు. వెంటనే సీఎం రమేష్‌ తన ఇన్నోవా కారును తెప్పించగా అందరూ దాంట్లో ఎక్కి నెల్లూరు, తిరుపతి మీదుగా బెంగుళూరుకు చేరుకున్నారు. చంద్రబాబు బృందం కోసం తాజ్‌ గ్రాండ్‌ 7స్టార్‌ హోటల్‌లో విడిది ఏర్పాటు చేసినట్లు మెసేజ్‌ పెట్టారు. కాని చంద్రబాబు నేరుగా మెజిస్టిక్‌ సెంటర్‌కు వెళ్లాడు. మంజునాథ లాడ్జిలో దిగాడు. ఐదుగురికీ ఐదు మడత మంచాలు తీసుకున్నాడు. 500 రూపాయలైంది. తలా ఒక పులి హోర పొట్లం తెప్పించుకున్నారు. ఒక్కో పొట్లం 50రూపాయల లెక్కన 250 రూపాయలైంది. ఆ రాత్రికి మడత మంచాల మీదే పడుకుని నిద్రపోయారు. తెల్లారింది. లాడ్జిలో కామన్‌ బాత్రూమ్‌లు కావడంతో చంద్రబాబు, కె.ఇ.కృష్ణమూర్తి, దేవినేని ఉమ, సీఎం రమేష్‌, పి.నారా యణలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి స్నానాలు కానిచ్చి రెడీ అయ్యారు. హోటల్‌ క్రిందకొచ్చి ‘పిన్నమ్మ క్యాంటీన్‌’లో తలా ఒక ప్లేట్‌ ఇడ్లీ, తలా ఒక టీ తాగారు. అక్కడ మొత్తం బిల్లు 266 రూపాయ లైంది. అక్కడ నుండి నేరుగా చిన్నస్వామి స్టేడియంలో కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

నంజూడప్ప వూహాచిత్రం ఇక్కడితో ముగిసింది. అదంతా చూసాక కుమార స్వామి… చంద్రబాబు నాయకుడు కాదు మహానాయకుడు… ప్రతి ప్రజాప్రతినిధి ఆయనలాగా పొదుపు చేస్తే ప్రపంచంలోనే మన దేశ ఆర్ధిక వ్యవస్థను కొట్టే శక్తి ఇంకే దేశానికీ ఉండదు అని చెబుతుండగా… అప్పుడే కర్నాటక ఆర్ధిక కార్యదర్శి బిరద శంకర్‌ లోపలకు వచ్చాడు. సార్‌, ఇంతకు ముందు మీకు పంపిన బిల్లులో చిన్న పొరపాటు జరిగింది. రెండు అంకెలు మిస్‌ అయ్యాయి. చంద్రబాబు గారి బిల్లు అమౌంట్‌లో ముందు 87 అనే అంకెలు చేర్చండి అని చెప్పాడు. కుమారస్వామి అలాగే చేర్చి చదివాడు. 8,71,116 రూపాయలు… ఆ బిల్లు చూడగానే కుమారస్వామి టక్కున కళ్లు తిరిగి కింద పడ్డాడు. ఈసారి నంజూడప్ప, చెంగ ళప్పలు బకెట్‌తో నీళ్ళు తెచ్చి మొహాన పోసినా ఆయన స్పృహలోకి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here