Home రాష్ట్రీయ వార్తలు బాలూ పుట్టినరోజు..పాటకు పండుగరోజు

బాలూ పుట్టినరోజు..పాటకు పండుగరోజు

గానగంధర్వుని పుట్టిన రోజంటే..పాటకు పండుగ రోజే. భారతీయ సినిమా గర్వించదగ్గ గాయకుడు, విశ్వవిఖ్యాత గాయకుడు, నెల్లూరు ముద్దుబిడ్డ..మన గానాలపట్టి.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్ర హ్మణ్యం (యస్‌పి బాలూ) జన్మదినోత్సవ వేడుకలు ఈనెల 4న నెల్లూరు పురమరదిర ప్రాంగణంలోని ఆరుబయటవేదికపై అద్వితీయంగా జరిగాయి. పాటల కోయిలమ్మ జానకమ్మ ఈ వేడుకకు విచ్చేసి బాలూని ఆశీర్వదించడం, తన ఉజ్వలభవితకు తొలి ఆశీస్సులందించిన జానకమ్మకు బాలూ సాష్టాంగ ప్రణామం చేసి తన కృతజ్ఞతాపూర్వక నమస్కారాన్ని అందజేయడం, తన మాతృమూర్తి శకుంతలమ్మ నుంచి బాలూ ఆశీస్సులందుకోవడం.. వేదికంతా ఆత్మీయతలు వెల్లివిరిసినట్లయింది. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు విచ్చేసి బాలూతో, జాన కమ్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం విశేషం. ఇదే సందర్భంలో జానకమ్మ జీవితచరిత్రను లఘుచిత్రంగా ప్రదర్శించడం ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది. అంతేకాక, రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ, నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో యోగా విభాగం నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులచే ప్రదర్శితమైన ప్ర’యోగా’త్మక నృత్యరూపక ప్రదర్శన.. ఈ వేడుకల్లో ఒక హైలైట్‌గా ఉండి… అందరి కరతాళధ్వను లందుకుంది.

తొలుత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వేదిక వద్దకు రాగానే ప్రేక్షకుల్లో సంతోషం వెల్లివిరిసింది. బాలూ పుట్టినరోజు వేడుకలో తామూ పాల్గొంటున్నామన్న ఆనందం అందరిలోనూ కనిపించింది. శ్రీ విజేత ఆర్ట్స్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలు ఆద్యంతం ఎంతో ఆహ్లాదంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలూ మాట్లాడుతూ, తన పదహారేళ్శ వయసులో 1960-63 ప్రాంతాల్లో గూడూరు కాళిదాస కళానికేతన్‌ వారు నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొన్నప్పుడు, ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన ప్రఖ్యాత గాయని ఎస్‌.జానకి తనను మంచి గాయకుడివవుతావని దీవించారని అన్నారు. మాతృసమానురాలైన ఆ చల్లనితల్లి దీవెనలే తనకు ఇంతటి ఉన్నతస్థానాన్ని తెచ్చాయని బాలూ విన మ్రంగా తెలిపారు. సినీరంగంలో జానకమ్మ పాటలు అద్వితీయమైనవని అంటూ, ఎవరూ పాడలేని ఎంతో కష్టమైన పాటలను కూడా ఆమె అలవోకగా పాడగల దమ్మున్న గాయని అని ఆయన కొనియాడారు. జానకమ్మ ఆశీస్సులు తననెంతగానో ఉన్నతస్థాయికి తీసుకువచ్చాయని, అందుకు కృతజ్ఞతగా సన్మానం చేయాలనుకున్నా ఆమె అంగీకరించకపోవడంతో నమస్కారాన్నే ఆమెకు సత్కారంగా అందజేస్తున్నా నన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎలాంటి అవార్డులు స్వీకరించడం లేదు కనుక, తనపేరిట ఆమెకు ఇవ్వ దలుచుకున్న అవార్డు మొత్తం లక్షరూపాయల నగ దును హైదరాబాద్‌లోని స్పర్శ ఆసుపత్రిలో ఆడియో థియేటర్‌ ఏర్పాటుకు అందజేసినట్లు బాలూ ప్రకటించారు. సంగీతం, సంస్కారం తన సహచరుల వద్ద నుంచి నేర్చుకున్నానని, వారందరి ఆశీస్సులతోనే తను ఇంతవాణ్ణయ్యానని ఆయన అన్నారు. తన గురువు కోదండపాణి పెట్టిన గానభిక్ష వల్లే తాను సినీపరిశ్రమల్లో 53 ఏళ్ళుగా ప్రయాణం సాగిస్తు న్నానన్నారు. మన పరిసరాలను కాపాడుకోవాలని, ‘స్వచ్ఛభారత్‌’ను అందరూ అనుసరించాలని బాలూ ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలూ కుటుంబసభ్యులతో పాటు, మురళీకృష్ణ70 ఎం.డి వీరిశెట్టి హజరత్‌బాబు, విజేతా ఆర్ట్స్‌ గౌరవ ఉపాధ్యక్షుడు ఎంవిఎస్‌ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి వై.శేషగిరీశం, కార్యవర్గసభ్యులు ఎస్‌.సుబ్బారావు, వై.విశ్వనాధ్‌, వి.చంద్రశేఖర్‌, డా.ఎం.సుబ్రహ్మణ్యం, జి.ఆదిశేషు, కె.అనంత్‌ తదితరులు పాల్గొన్నారు.

బాలూకు ‘తథాస్తు దేవతల’ దీవెనలూ ఉన్నాయి – ఎస్‌.జానకి

గానకోకిల ఎస్‌ జానకి మాట్లాడుతూ, తాను ఎలాంటి పురస్కారాలు స్వీకరించడానికి ఇక్కడికి రాలేదని, బాల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు కనుక బాలూను ఆశీర్వదించడానికే వచ్చానని అన్నారు. తాను ఆశీర్వదించినందువల్ల మాత్రమే బాలసుబ్రహ్మణ్యంకు ఇంతటి ప్రఖ్యాతి రాలేదని, ఆయన అసాధారణ ప్రతిభే ఆయనో గొప్పగాయకుడిగా రాణించడానికి దోహదం చేసిందన్నారు. బాలూకు ఉన్న తెలివితేటలు, అదృష్టం అన్నీ కలసివచ్చి ఇంతటి స్థాయి లభించిందన్నారు. పట్టుదల, కృషి, మంచి జ్ఞాపకశక్తి ఇవన్నీ బాలూ ప్రతిభకు నిదర్శనాలన్నారు. అయితే తాను ఆశీర్వదించినప్పుడు, బహుశా తథాస్తు దేవతలు కూడా తధాస్తు అనడం వల్ల బాలూ గొప్ప గాయకుడై ఉంటారని ఆమె నవ్వుతూ అన్నారు. గాయకునిగానే కాక, సంగీత దర్శకునిగా, డబ్బింగ్‌ కళాకారునిగా, నటునిగా ఆయన విభిన్న వైశిష్ట్యాలతో ప్రేక్షకులందరినీ మెప్పించారని ఆమె ప్రశంసించారు. సంగీతదర్శకులు చెప్పిన స్వరాలను, వారు ఊహించినదానికంటే గొప్పగా పాడే ప్రతిభాపాటవాలు బాలూకు ఉన్నాయన్నారు. ఆయనకున్న స్వరజ్ఞానం, సంగీతపరిజ్ఞానం అపారమన్నారు. బాలూ సంగీతదర్శకంలోనూ తానెన్నో పాటలు పాడానని, ఆ పాటలు అద్భుతంగా ఉండి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన గానప్రస్థానాన్ని వివరించారు. సినీరంగంలో తొలుత తనకు విషాదభరితమైన పాటలు పాడే అవకాశమే లభించిందని, అయితే పుట్టిన బిడ్డ బాగా ఏడ్చిన తర్వాతే జీవితంలో నవ్వుతూ రాణిస్తుంది కనుక, తాను కూడా అదేవిధంగా భావించి ఆ పాటలు పాడి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నానన్నారు.

అబ్బురపరచిన ప్ర’యోగా’త్మక నృత్యరూపకం

తొలుత రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ, నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో యోగా విభాగం నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులచే ప్రదర్శితమైన ప్ర’యోగా’త్మక నృత్యరూపక ప్రదర్శన ఆద్యంతం ఎంతో అద్భుతంగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. ఈ అద్వితీయమైన..అపురూపమైన యోగవిన్యాసాలు జరుగుతున్నంతసేపు ప్రేక్షకులు మైమరచిపోయారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, పవిత్రమైన గంగానదిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ కాపాడుకోవాలని, స్వచ్ఛభారత్‌ను పాటించాలనే అంశాలను సూచిస్తూ అత్యద్భుతంగా చేసిన యోగా విన్యాసాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. దాదాపు అర్ధగంటకు పైగానే ఈ సాహసవిన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అనంతరం అందరూ ఆ యోగ విన్యాసకులను అభినందిస్తూ చేసిన కరతాళధ్వనులతో పురమందిర ప్రాంగణం మార్మోగింది.

ఇదంతా సాంబమూర్తిగారి పుణ్యమే – విఏకె రంగారావు

బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన భారతీయ సినిమా గాయకునిగా ఎదగడానికి కారణం ఆయన తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తిగారి పుణ్యమేనని, నెల్లూరుతోనూ, బాలూ, జానకమ్మలతో తనకున్న అనుబంధాన్ని ప్రముఖ సంగీత సాహిత్య నృత్య విశ్లేషకులు విఏకె రంగారావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

సంగీతం భగవంతుని భాష – భువనచంద్ర

సంగీతం అనేది భగవంతుని భాష అని, నెల్లూరు నుంచి ఆ సంగీత ప్రవాహం గంగోత్రి ప్రవాహంలా సాగి అందరినీ అలరిస్తోందని బాలూ-జానకమ్మల పాటల ప్రస్థానాన్ని ప్రముఖ సినీకవి భువనచంద్ర ఈ సందర్భంగా వివరించారు.

పాటకు పుట్టినరోజు – వెన్నెలకంటి

ఎస్పీ బాలు పుట్టినరోజు అంటే పాటకు పుట్టిన రోజని, ఇది తెలుగుపాట పుట్టిన రోజని, భారతీయ పాట పుట్టిన రోజని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సినీకవి వెన్నెలకంటి అన్నారు. తనకు సినీపరిశ్రమలో చోటు కల్పించి తనకు అన్నివేళలా చేయూతనిచ్చింది బాలూగారేనని అంటూ, తనకు తల్లితండ్రి గురువు దైవం బాలూ గారేనన్నారు.

ఇదెంతో అపూర్వం… అదృష్టం – జిల్లా ఎస్పీ రామకృష్ణ

సంగీతరంగంలో ఎంతో సుప్రసిద్ధులైన ఎస్‌.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం తన అదృష్టమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. వారి పాటలు ఎంతో సుప్రసిద్ధమైనవన్నారు.

వారి స్వరం… మనకు వరం – తుంగా శివప్రభాత్‌రెడ్డి

బాలూ గంధర్వగానం, జానకమ్మ సమధుర స్వరం ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తుందని, వారి స్వరమే వారికో వరమని ‘లాయర్‌’ వారపత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి అన్నారు. నిన్నటి తరం, నేటి తరం, భావితరం.. బాలూ, జానకమ్మల పాటలతో తరిస్తున్నారని అన్నారు. గానకోకిల జానకమ్మకు నెల్లూరు మెట్టిన ఊరని, ఫన్‌ డాక్టర్‌ చంద్రశేఖరం గారి కోడలుగా ఆమె నెల్లూరుతో తన అనుబంధాన్ని ముడివేసుకుందన్నారు. భారతీయసినిమా గాయకునిగా బాలూ తన ప్రఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటుకుంటున్నారని, సింహపురికి ఇదెంతో గర్వకారణమని అన్నారు.

బాలూ… అందరికీ ఆదర్శం – విద్యాసాగర్‌

వర్ధమాన సంగీతకారులందరికీ బాలూ ఆదర్శమని, ఆయనకున్న సంగీత పరిజ్ఞానం అమోఘమని ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ అన్నారు. పెద్దలను, చిన్నారులను సైతం గౌరవించే తత్వం బాలూ గారి నుంచి నేర్చుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here