Home గల్పిక బాబును పరామర్శించిన ప్రపంచ నేతలు

బాబును పరామర్శించిన ప్రపంచ నేతలు

ఏంది చంద్రబాబు ఇంత గలీజు బ్రతుకా నీది. నాలుగు సీట్ల కోసం కాంగ్రెసోళ్ల మోచేతి నీళ్ళు తాగాల్నా, అడుక్కుంటే ఆ సీట్లు నేను పడేస్తా కదబ్బా… నేను రెండో కన్ను తెరిస్తేనే పోయి కరకట్టమీద పడ్డావ్‌, మూడో కన్ను తెరిస్తే ఏమవుతది నీ బ్రతుకు… తూ… నీ బ్రతుకు చెడ… తూ… నీ బ్రతకు చెడ.. అదే డైలాగ్‌ పదేపదే రిపీట్‌ అవుతూ చెవుల్లో మార్మోగసాగింది… తల అటు తిప్పినా అదే డైలాగ్‌… ఇటు తిప్పినా అదే డైలాగ్‌. చెవులు తుప్పెక్కి స్తున్నాయి… ఆ హింస భరించలేక ‘నో’ అంటూ లేచాడు చంద్రబాబు. అర్ధరాత్రి దాటి 2గంటలైంది. ప్రపంచ మేటి నగరాలలో టాప్‌ టెన్‌లో నెంబర్‌ వన్‌లో వున్న అమరావతి సిటీ ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు పడుకుని వున్నాడు. పడుకునే ముందు టీవీలో కేసీఆర్‌ స్పీచ్‌ చూడడంతో మనసు కకావికలమైంది. కేసీఆర్‌ మాటలతో చంద్రబాబుకు తొలిసారిగా తన మీద తనకే అసహ్యమేసింది. ఇంత బ్రతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్లు… రాజ కీయాలలో ఎన్టీఆర్‌ అంతటోడిని మట్టి కరిపించిన నన్ను, నా క్రింద పనిచేసిన ఈ కేసీఆర్‌ ఇంత హింసపెడుతున్నా డేంటి… అసలు వీడి భాషేంటి… వీడి బాధేంటి… అని ఆలోచిస్తూ పడుకున్నాడు. నిద్రపోయాడనేగాని నిద్రలోనూ కేసీఆర్‌ తిట్లే చెవిలో మార్మోగసాగాయి. ఆ ఎఫెక్ట్‌తోనే ఆయన నిద్రలో నుండి కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు. ఆయన అరుపు దెబ్బకు భువనేశ్వరిదేవి కూడా లేచి ముందు నీళ్ళు తాగమని చేతికి చెంబు ఇచ్చింది. చంద్రబాబు నీళ్ళు తాగాక కుదుటపడ్డాడు. అప్పుడు భువనేశ్వరీదేవి… ఏమైందండి అని అడిగింది. కేసీఆర్‌ తనను తిట్టిన తిట్ల గురించి చంద్రబాబు చెప్పాడు. అందుకు ఆమె… ఆ కేసీఆర్‌ ఒక క్వార్టర్‌ తాగా డంటే ఎన్ని భాషలైనా మాట్లాడతాడు, ఎన్ని భాషల తిట్లైనా తిడతాడు. మీకేమో ఆ తాగుడు అలవాటు లేకపోయె… అందుకే ‘ముత్యాలముగ్గు’ సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్లు మనిషన్నాక కాసింత కళాపోషణ వుండాలి… మీకు ఏ అలవాటూ లేదు… కనీసం ఆ తాగుడు అలవాటన్నా వుండుంటే కేసీఆర్‌కు పోటీగా మీరూ తిట్లు నేర్చుకుని వుండే వాళ్ళు కదా అని నిష్టూరపడింది. ఇప్పుడు కేసీఆర్‌ను తిట్టడం కోసం నేనెక్కడ తాగుడు అలవాటు చేసుకునేదిలే… పొద్దున్నే మాట్లాడుకుందాం… నిద్రొస్తుంది అంటూ చంద్రబాబు మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు.

———-

తెల్లారి 8గంటలైంది. చంద్రబాబు తన జీవితంలో తొలిసారిగా ఆలస్యంగా నిద్రలేచాడు. భారంగా కళ్ళు తెరిచాడు. అప్పటికే తన బెడ్‌రూంలో పెట్టిన ఆరోజు దినపత్రిక ‘తెలుగుజ్యోతి’ని పట్టుకుని ఫ్రంట్‌ పేజీ చూసాడు. ‘థూ నీ బ్రతుకు చెడ” – చంద్రబాబుపై కేసీఆర్‌ ఫైర్‌… అనే వార్తను చూసి, పేపర్‌ను దూరంగా విసిరేసాడు. తర్వాత టీవీ ఆన్‌ చేసాడు. ఏబిసిడి ఛానల్‌ పెట్టాడు. సోంబేరి సోమనాథ్‌ చర్చావేదిక కార్యక్రమం జరుగుతోంది. కేసీఆర్‌ చంద్రబాబును ‘థూ నీ బ్రతుకు చెడ’ అని తిట్టడంపై చర్చ నిర్వహిస్తున్నారు. ఇద్దరు నాయకులు దానిని వ్యతిరేకిస్తుంటే ఇంకో ఇద్దరు నాయకులు మాత్రం ‘థూ నీ బ్రతుకుచెడ’ అని తిట్టడంలో అభ్యంతరం లేదని, అది మన బాషా సాహిత్యంలో వారసత్వంగా వస్తున్న తిట్టని, దానిని వ్యతిరేకించడ మంటే మన ప్రాచీన బాష, జానపద దుర్భాషలను అగౌరవపరచడమేనని వాదనకు దిగారు. ఈలోపు యాంకర్‌ సోంబేరి సోమనాథ్‌… చంద్రబాబును కేసీఆర్‌ ‘థూ నీ బ్రతుకుచెడ’ అని తిట్టడాన్ని మీరు సమర్ధిస్తున్నారా? మీ సమాధానం అవును అయితే ‘ఏ’ అని, కాదు అయితే ‘బి’ అని టైపుచేసి మాకు ఎస్‌ఎంఎస్‌ పంపించండి అంటూ ఒక పబ్లిక్‌ పోల్‌ పెట్టాడు. అదంతా చూస్తున్న చంద్రబాబుకు ఇంకొంచెం చిర్రెత్తు కొచ్చింది. వెంటనే టీవీ ఆఫ్‌ చేసి బయట హాల్‌లోకి వచ్చాడు. అక్కడ మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎంపీలు గల్లా జయదేవ్‌, మురళీమోహన్‌, మాగంటి బాబు, ఎన్‌.శివప్రసాద్‌లు వచ్చివున్నారు. ఇంత పొద్దున్నే వచ్చారేం అని చంద్రబాబు అడిగాడు. మీరు రాత్రంతా నిద్రలేకుండా కలవరిస్తూనే వున్నారంట కదా… కేసీఆర్‌ ‘నీ బ్రతుకు చెడ’ అంటూ చాలా ఘోరంగా తిట్టారు సార్‌, మేమూ చాలా బాధపడ్డాము. ఆ కేసీఆర్‌ నోటికి తాళం బిగించాలి సార్‌ అని మురళీమోహన్‌ అన్నాడు. నేను కృష్ణుడి వేషం కట్టి కేసీఆర్‌ వద్దకు రాయ బారిగా వెళతాను… మా చంద్రబాబుతో పద్ధతిగా వ్యవహరించకుంటే యుద్ధం తప్పదని హెచ్చరించి వస్తాను అని ఎన్‌.శివప్రసాద్‌ చెప్పాడు. అందుకు దేవినేని ఉమ… కృష్ణుడి వేషం కాదు ప్రసాదన్నా… యోగి వేమన వేషం వేసి కేసీఆర్‌ వద్దకు వెళ్ళు. ఆయన చూస్తుండ గానే ఆ గోచీ గుడ్డ కూడా తీసేయ్‌… కేసీఆర్‌ ఈ ఎన్నికలైపోయేదాకా కోమాలో నుండి ఇక బయటకురాడు అని చెప్పాడు.

ఈలోపు చంద్రబాబు సెల్‌ఫోన్‌ మోగింది. అవతల నుండి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెరస్‌. ఆయన గొంతు వినగానే చంద్రబాబు… మళ్ళీ ఏమన్నా ఐక్యరాజ్య సమితి సదస్సులు జరుగుతున్నా యేమో… ప్రసంగించడానికి నన్ను ఆహ్వా నిస్తున్నారేమో అని అనుకున్నాడు. కాని, అతను మాత్రం… బాబు గారు, ఆ కేసీఆర్‌ మిమ్మల్ని ‘థూ నీ బ్రతుకు చెడ’ అని తిట్టారట కదా… మాకూ చాలా బాధేసింది. మీరు కంప్లైంట్‌ ఇవ్వండి, మేం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించి అతనికి శిక్ష వేస్తాం అని చెప్పాడు. అలాగే సార్‌, అంటూ చంద్ర బాబు ఫోన్‌ పెట్టేసాడు. అప్పుడే భువనేశ్వరిదేవి కార్డ్‌లెస్‌ ఫోన్‌ చేతిలో పట్టుకుని వచ్చి… ఏమండీ సింగపూర్‌ ప్రధాని లైన్‌లో వున్నారు, మీతో మాట్లా డాలంటా… అని ఫోన్‌ ఇచ్చింది. చంద్ర బాబు ఫోన్‌ అందుకుని హలో అన్నాడు. అవతల నుండి సింగపూర్‌ ప్రధాని లీ సేన్‌ లూంగ్‌ వుండి… సారీ, చంద్రబాబు గారు, ఆ కేసీఆర్‌ ఏంటండి మిమ్మల్ని అలా తిట్టేసాడు… ”థూ నీ బ్రతుకు చెడ”… ఏం తిట్టండి అది అని బాధ పడుతూ పెట్టేసాడు. ఆ తర్వాత వరుసగా బిల్‌క్లింటన్‌, బిల్‌గేట్స్‌, డొనాల్డ్‌ ట్రంప్‌, పుతిన్‌లు ఫోన్‌లు చేసి చంద్రబాబుకు తమ సానుభూతి తెలిపారు. ఈ ఫోన్‌ లన్నీ మాట్లాడాక చంద్రబాబు బాధతో, ఆవేశంతో… ఆ కేసీఆర్‌కు బుద్ధి చెప్పే మగాళ్ళే మన పార్టీలో లేరా అని గట్టిగా అరిచాడు. అప్పుడే అక్కడకు యువరత్న నందమూరి బాలకృష్ణ, నవరత్న నారా లోకేష్‌ ఎంట్రీ ఇచ్చారు.

(ఇంకా ఉంది…)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here