Home గల్పిక బాబుకు ట్రంప్‌ పాదాభివందనం

బాబుకు ట్రంప్‌ పాదాభివందనం

అది విజయవాడలోని బీజేపీ కార్యాలయం. ప్రెస్‌మీట్‌లో ఎంపీలు జివిఎల్‌ నరసింహరావు, కంభంపాటి హరిబాబు, నాయకులు సోము వీర్రాజు, విష్ణుకుమార్‌రాజులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అమెరికాకు వెళ్లింది ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి కాదు, ఆ పక్కనే ఎవరో ప్రైవేట్‌ ఫంక్షన్‌ పెట్టుకుని పిలిస్తే ఐక్యరాజ్య సమితి నుండి ఆహ్వానం అందిందని కలరింగ్‌ ఇస్తు న్నారంటూ ఆరోపించారు.

——–

రాజమండ్రిలోని మాజీఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ నివాసం. ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టాడు. నేను కూడా ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొన్నా… ఆ భవనం చాలా వేరుగా వుంటుంది. చంద్రబాబు ఏదో ఐక్యరాజ్య సమితి భవనం పక్కనే వున్న కిళ్లీ కొట్లో మీటింగ్‌కు వెళ్ళినట్లున్నాడు. దానికే ఇంత బిల్డప్‌ ఇస్తున్నాడు… అంటూ విమర్శలు చేసాడు.

ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యా లయంలో కూర్చుని మంత్రులు లోకేష్‌, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, దేవినేని ఉమ, పితాని సత్యనారాయణలు ఈ ప్రెస్‌మీట్‌లు చూసారు. తమ బాస్‌ను వాళ్ళు హేళనగా మాట్లాడడంతో వాళ్ళ కడుపులో మంటలు రగిలిపోసాగాయి. అంతలోనే అమెరికా పర్యటనను పూర్తి చేసుకుని హైటెక్‌ రత్న చంద్రబాబు అక్కడకు వచ్చాడు. ఆయన వెంట మం త్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు కూడా వున్నారు. తనను చూడగానే మంత్రులందరూ హుషారుగా ఎదురొచ్చి స్వాగతం చెబుతారని చంద్రబాబు అనుకున్నాడు. కాని చంద్రబాబును చూసి కూడా మంత్రులందరూ తలలు వేలాడేసుకుని దీనంగా వున్నారు. చంద్రబాబుకు వారిని చూసాక ఏదో అయిందనిపించింది. ఎందకలా వున్నారని వారిని అడిగాడు. అప్పుడు నారాయణ… మాకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావడం లేద్సార్‌… మేమేమో ఐక్యరాజ్యసమితిలో మాట్లాడడానికి మా చంద్రబాబు వెళ్లారని లోకమంతా టామ్‌టామ్‌ కొట్టాం. బీజేపీ నాయకులు, వైసిపివాళ్ళు, మధ్యలో ఉండవల్లి… వీళ్ళందరు కూడా మీరు వెళ్లింది ఐక్యరాజ్య సమితిలో మాట్లాడ డానికి కాదని, అదేదో టిఫిన్‌ సెంటర్‌ లోనో, కిళ్లీ కొట్లోనో మీటింగ్‌ అని ఎగతాళి చేస్తున్నార్సార్‌… అదేమంటే ఇది ఒరిజి నల్‌ ఐక్యరాజ్యసమితి హాల్‌… ఇది చంద్రబాబు మాట్లాడిన డూప్లికేట్‌ ఐక్య రాజ్య సమితి హాల్‌ అని ఫోటోలు కూడా చూపిస్తున్నారని వాపోయాడు. అప్పుడు చంద్రబాబు సమాచారశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులుని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. ఓకే సార్‌, వెంటనే అరేంజ్‌ చేస్తానని అతను వెళ్లిపోయాడు.

————-

అది విజయవాడలోని భ్రమరాంబ థియేటర్‌. ఆరోజు సినిమా షోలను రద్దు చేసారు. చంద్రబాబు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే కాకుండా వైసిపి నుండి భూమన కరుణాకర్‌రెడ్డి, గొలుసు పార్థ సారధి, బొత్స సత్యనారాయణ, బీజేపీ నుండి జివిఎల్‌ నరసింహరావు, విష్ణు కుమార్‌రాజు, సోము వీర్రాజు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌, అన్ని పత్రికలు, ఛానెల్స్‌ ప్రతినిధులు థియే టర్‌కు వచ్చారు. అందర్నీ అక్కడకు ఆహ్వానించిన మంత్రి కాల్వ శ్రీనివాసులు వారందరినీ థియేటర్‌లోని మొదటి వరుస కుర్చీలలో కూర్చోబెట్టాడు. లోక్‌ సభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు స్క్రీన్‌ వద్ద చేరి పచ్చజెండా ఊపాడు. అంతే థియేటర్‌లో లైట్స్‌ ఆరిపోయాయి. తెర మీద సీన్స్‌ మొదలయ్యాయి. ‘అంతర్జా తీయ నాయకుడి ఐక్యరాజ్యసమితి యాత్ర’ అనే టైటిల్‌ పడింది. ఆ తర్వాత సన్ని వేశాలు రాసాగాయి. చంద్రబాబు బేగం పేట ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కాడు. విమానం గాల్లోకి ఎగిరింది. న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. ఎయిర్‌ పోర్టులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో పాటు దాదాపు 150దేశాల అధినేతలు క్యూలో నిలబడి చంద్రబాబుకు స్వాగతం చెప్పారు. చంద్రబాబు ఒక్కొక్క రికి షేక్‌హ్యాండిచ్చుకుంటూ వెళ్లాడు. ఆయనతో కరచాలనం చేసిన వివిధ దేశాల నేతలు ఆయన చేయిని తాకడం తమ అదృష్టంగా భావించి చేతిని కళ్ల కద్దుకోసాగారు. చంద్రబాబు ఎయిర్‌పోర్టు బయటకు రాగానే అమెరికా సైనిక దళాలు ఆయనకు గౌరవ వందనం సమర్పిం చాయి. అనంతరం వెయ్యి వాహనాలతో చంద్రబాబు కాన్వాయ్‌ బయలుదేరింది. దారిపొడవునా అమెరికా ప్రజలు తెలుగు దేశం జెండాలను పట్టుకుని ఊపుతూ చంద్రబాబుకు అభివాదం చేయసాగారు. వారి ఆదరణ చూసి చంద్రబాబు కంట్లో కన్నీళ్ళు తిరిగాయి. చంద్రబాబుతో పాటు అదే కారులో వున్న ట్రంప్‌… బాబూ గారు మా దేశంలో నాకంటే మీకే ఫాలో యింగ్‌ ఎక్కువుగా వుందండి. నా అదృష్టం బాగుండి మీరు ఇండియాలో పుట్టబట్టి సరిపోయింది. అదే అమెరికాలో జన్మించి వుండుంటే అమెరికాకు శాశ్వత అధ్య క్షుడిగా మీరే ఉండిపోయే వాళ్ళేమో! నాకు అధ్యక్షుడినయ్యే ఛాన్స్‌ వుండేది కాదేమో అని అన్నాడు. ఆ మాటకు చంద్రబాబు నవ్వి ఊరుకున్నాడు. అంతలో ఐక్యరాజ్య సమితి వద్దకు వచ్చేసారు. కార్లు దిగి అందరూ హాల్‌లోకి వెళ్లారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గట్టెరస్‌ సదస్సును ప్రారంభించాడు. అన్ని దేశాల ప్రతినిధులు మాట్లాడడం అయ్యాక చంద్రబాబుని మాట్లాడమన్నారు. చంద్రబాబు వేదికనెక్కి… వ్యవసాయం గురించి మాట్లాడుతూ… వ్యవసాయ ప్రగతిలో మా ఆంధ్రప్రదేశ్‌ ఎంతో ప్రగతి సాధించింది. ఒకప్పుడు కరెంట్‌ లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడు నీళ్ళు లేకుండా వ్యవసాయం చేసేలా అభివృద్ధి చేసాను. ఇంకొంత కాలానికి రైతులు లేకుండా వ్యవసాయం చేస్తాం. భవి ష్యత్‌లో భూములు కూడా లేకుండా వ్యవసాయం చేయాలనే దిశగా ప్రణా ళికలు రచిస్తున్నాం… అని గొప్పగా చెప్పి ముగించాడు. ఆయన ప్రసంగంతో హాల్‌ చప్పట్లతో మార్మోగిపోయింది. పలు దేశాల ప్రతినిధులైతే తమ స్థానాలలో నుండి లేచి చంద్రబాబుకు సెల్యూట్‌ చేస్తుండగా… డొనాల్డ్‌ ట్రంప్‌ అయితే మీలాంటి అద్భుత మేధావిని నేను ఇంత వరకు చూడలేదంటూ ఏకంగా చంద్ర బాబు కాళ్లపై పడి నమస్కరించాడు.

ఇక్కడితో సీన్‌లు అయిపోయాయి. థియేటర్‌లో లైట్లు వెలిగాయి. వైసిపి, బీజేపీ నేతలు మరియు అరుణ్‌కుమార్‌ ముఖాలలో చంద్రబాబు పట్ల తప్పు చేసామన్న ఫీలింగ్‌ కొట్టొచ్చినట్లు కనిపించ సాగింది. వారంతా ఆయన వద్దకొచ్చి… క్షమించండి సార్‌, నిజం తెలుసుకోలేక నోటికొచ్చినట్లు వాగాము అని అడిగారు. ఫర్వాలేదులే అని చంద్రబాబు వారితో అన్నాడు. అందరూ అక్కడనుండి వెళ్లి పోయారు. అంతా వెళ్లిపోయాక అక్కడే వున్న సోమిరెడ్డితో మంత్రి నారాయణ… ఏంటి చంద్రమోహనా, అమెరికాలో ఇంత జరిగిందా, మాకు అసలు తెలియదే… ఇది నిజమా? కలా? అని అడిగాడు. అందుకు సోమిరెడ్డి… నిజమా పాడా… అంతా రాజమౌళి మహిమ. ఈ ప్రతిపక్ష నాయకులు ఇలాంటి విమర్శలు చేస్తారని ముందుగా ఊహించే రామోజీ ఫిలిం సిటీలో ఎయిర్‌పోర్టులు, ఐక్యరాజ్యసమితి హాల్‌ సెట్టింగ్స్‌ వేయించాం. ట్రంప్‌తో పాటు వివిధ దేశాల ప్రతినిధులుగా డూప్‌లను పెట్టి ఈ షాట్స్‌ తీయించాం… టెక్నాలజీని మనం ఈ విధంగా వాడు కున్నామంతే, బాహుబలి సినిమా చూసాక ఇలాంటి ఐడియా వచ్చింది అని చెప్పాడు. ఆ మాటలతో నారాయణ నోరు తెరిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here