Home గల్పిక బాబుకు క్షమాపణ చెప్పిన మోడీ

బాబుకు క్షమాపణ చెప్పిన మోడీ

పాతిక ప్రపంచ మేటి నగరాలను మిక్సీలో వేసి తిప్పి తీస్తే వచ్చిన అమరా వతి నగరం. ఉండవల్లిలోని హైటెక్‌రత్న, సీఎం చంద్రబాబునాయుడు నివాసం. ఓ హాల్‌లో పెద్ద టేబుల్‌… దానిమీద ఓ మ్యాప్‌… ఓ పక్క చంద్రబాబు… ఆయ నకు అటూ ఇటూ మంత్రులు లోకేష్‌, ఆదినారాయణరెడ్డి, కె.ఇ.కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు, జవహర్‌, నక్కా ఆనంద బాబు, ఎంపీలు గల్లా జయదేవ్‌, మాగంటి బాబు, మురళీమోహన్‌, ఎన్‌.శివప్రసాద్‌, కేసినేని నాని, రాయపాటి సాంబశివ రావులు వున్నారు. బాబు ఒక స్టిక్‌ పట్టు కుని మ్యాప్‌ మీద పెట్టి ఎల్లుండి ఢిల్లీలో దీక్ష… ఇదిగో తిరుపతి నుండి ఒక రైలు నెల్లూరు మీదుగా రావాలి… దీనికి సోమి రెడ్డి ఇన్‌ఛార్జ్‌. ఇంకో రైలు రేణిగుంట నుండి కడప మీదుగా ఢిల్లీకి రావాలి… దీన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి చూసు కోవాలి. విశాఖపట్నం నుండి ఏలూరు మీదుగా మరో రైలు… దీనిని అయ్యన్న పాత్రుడు చూసుకుంటాడు. విజయవాడ నుండి ఇంకో రైలు… దేవినేని ఉమ దీని ఇన్‌ ఛార్జ్‌. ఈ నాలుగు ట్రైన్‌లలో కార్యకర్తలను ఢిల్లీకి తరలించాలి. అలాగే రేణిగుంట, గన్నవరం, కడప, రాజమండ్రి, విశాఖ పట్నంల నుండి స్పెషల్‌ ఫ్లైట్స్‌ పెడు తున్నాం. నాయకులందరూ ఈ ఫ్లైట్స్‌లో రావాలి అని చెప్పాడు. అక్కడేవున్న జేసీ దివాకర్‌రెడ్డి… ఇన్ని రైళ్లు, ఇన్ని విమా నాలు ఎందుకు సార్‌, అసలే పెట్రోల్‌ రేట్లు మండిపోతున్నాయి. అందరం కలిసి ఒకే ట్రైన్‌లో పోతే పోలా అని అన్నాడు. వెంటనే చంద్రబాబు… అదేంటి దివా కరా, నీ జేబులోదో, నా జేబులోదో తీసి పెట్టడం లేదుగా… జనం డబ్బేగా నీకెం దుకు బాధ… అక్కడికి జనం ఎంత మందిమి వెళ్లాం అన్నది ఇంపార్టెంట్‌ కాదు, ఎన్ని ట్రైన్‌లు, ఎన్ని ఫ్లైట్లు వెళ్లా యన్నది ఇంపార్టెంట్‌.. అని చెప్పాడు. మరి ఢిల్లీలో ఫుడ్డు, బెడ్డు ఎలా సార్‌ అని కె.ఇ.కృష్ణమూర్తి అడిగాడు. నాలుగు వేల ఏ.సి.రూమ్‌లు బుక్‌ చేశాం, అంతా కాంగ్రెస్‌ అధిష్టానం చూసుకుంటుందిలే అని చంద్రబాబు చెప్పాడు. వెంటనే ఎన్‌.శివప్రసాద్‌ వుండి… సార్‌, ప్రత్యేక హోదా ఉద్యమంలో ఢిల్లీలో దాదాపు అన్ని వేషాలు వేశాను… ఒక్క యోగి వేమన వేషం మిగిలింది… ఎల్లుండి దీక్షా వేదికపై నేను ఆ వేషం వేస్తానన్నాడు. చంద్రబాబు వెంటనే రెండు చేతులు జోడించి శివప్రసాదా… నీకు దండం పెడతా, దీక్ష అయ్యే దాకా ఏమీ చేయొద్దు. అసలే దీక్షలకు జనాన్ని బలవంతంగా తీసుకొస్తున్నాం, ఇలాంటివి చేసావంటే వచ్చిన వాళ్ళు కూడా పారిపోతారని వేడుకున్నాడు. సరేలే, నేను ఈసారి పార్లమెంటు సమావేశాలలో ఈ వేషం వేస్తానని శివప్రసాద్‌ చెప్పాడు. తర్వాత అందరూ దీక్ష పనుల్లో వుంటామని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత చంద్రబాబు లోపలకెళ్లి రెండు పుల్కాలు తిని బెడ్‌ మీదకు చేరాడు. మనుమడు దేవాన్ష్‌ను పిలుచుకుని కొద్దిసేపు ముచ్చట్లాడాడు. బుడ్డోడు ఆడుకుంటూ నిద్రపోవడంతో చంద్రబాబు కూడా దేవాన్ష్‌ మీద చెయ్యేసి పడుకుని నిద్రలోకి జారుకున్నాడు.

————-

ఫిబ్రవరి 10వ తేదీ… గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధాని నరేంద్రమోడీ విమానం అప్పుడే ల్యాండయ్యింది. మోడీ క్రిందకు దిగగానే రాష్ట్ర బీజేపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తర్వాత గుంటూరుకు కాన్వాయ్‌ బయలు దేరింది. అలా వస్తుండగా మోడీ రోడ్డు పక్కన ఒక హోర్డింగ్‌ చూశాడు. చూడగానే మోడీ డ్రైవర్‌తో కారాపు అని అన్నాడు. డ్రైవర్‌ కారు ఆపాడు. ఏమైంది సార్‌… అని ఆ కారులోనే వున్న కన్నా లక్ష్మీ నారాయణ అడిగాడు. ఆ హోర్డింగ్‌ చూడు ‘మోడీ గో బ్యాక్‌’ అని వుంది. అంటే మనం పోవాల్సిన రూటు వెనుక ఎక్కడో వుంది. దారి తప్పి వచ్చినట్లున్నాము, ఎంతైనా మీ సీఎం చంద్రబాబు హైటెక్‌ తెలివితేటలున్నోడు… చూడండి, నా పర్యటన మీద కూడా ఎంతో శ్రద్ధ పెట్టి దారి తప్పిపోకుండా హోర్డింగ్‌లు పెట్టిం చాడు అని అన్నాడు. అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ హోర్డింగ్‌ల ఏర్పాటు వెనుక వున్న అసలు విషయం చెప్ప డంతో… మోడీ నవ్వి వూరుకున్నాడు. కాన్వాయ్‌ విజయవాడలో ప్రకాశం బ్యారేజీ మీదుగా పోతుండగా క్రింద కృష్ణానది నీళ్లలో కొందరు కేకలు పెడుతూ కనిపించారు. మోడీ వారిని చూసాడు. వెంటనే కారాపి…. సెక్యూరిటీతో ఆ నీళ్లలో చాలా మంది మునిగిపోతూ ప్రాణ భయంతో కేకలేస్తున్నారు. వెంటనే దూకి కాపాడండి అని అరిచాడు. అందుకు కన్నా లక్ష్మీనారాయణ… సార్‌, వాళ్ళు మునిగిపోవడం కాదు, కులాజీ… సారీ ఫేస్‌బుక్‌లో చదివి చదివి అలవాటైంది… బాలాజీ అనే నటుడు ప్రత్యేకహోదా కోసం జలదీక్ష చేస్తున్నాడు అని చెప్పాడు. మళ్ళీ కాన్వాయ్‌ బయలుదేరి గుంటూరు సభా స్థలికి చేరుకుంది. మోడీ స్టేజీ ఎక్కాడు. మైకుముందు నిలబడ్డాడు. ఒక్క నిముషం మౌనంగా వున్నాడు. తర్వాత కన్నీళ్ళు తుడుచుకుని… నా జీవితంలో చంద్రబాబునాయుడు లాంటి ఒక మిత్రుడిని వదులుకున్నందుకు ముందుగా పశ్చాత్తాపడుతున్నాను. ఆయన విలు వేంటో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది. నల్లచొక్కా వేసుకున్న గాంధీ మహాత్ము డాయన. ప్రత్యేకహోదా కోసం ఆయన చేస్తున్న దీక్షలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఒక్క రూపాయి ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా దీక్షలు చేస్తాడు. ఒక్కోసారి ఆయన నిజాయితీ చూస్తే, ఆయనతో పోటీ పడగల స్థాయికి నేనెప్పుడన్నా చేరుకోగలనా? అభివృద్ధిలో ఆయన వేగాన్ని నేను అందుకోగలనా? ప్రపంచ దేశాధినేతలను మెప్పించడంలో ఆయనతో నేను సరితూగగలనా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటుంటాను… ఆయన ఓ అద్భుతం… ఆయన కొడుకు లోకేష్‌ ఇంకో పెద్ద అద్భుతం. అవినీతి అంటే ఏంటో కూడా వారికి తెలియదు. త్వరలోనే అన్నాహజారేతో పాటు వీరిద్ద రికి కూడా ‘అవినీతి విరోధరత్న’ అవార్డు లను ఇవ్వబోతున్నాం. చంద్రబాబు రేపు ఢిల్లీలో ప్రత్యేక దీక్ష కోసం ధర్నా చేయా లనుకుంటున్నాడు. ఆయన దీక్షలో కూర్చుంటే ఢిల్లీయే దద్దరిల్లిపోద్ది… ఇప్పుడే ప్రత్యేకహోదా అనౌన్స్‌ చేస్తా… ఉండవల్లిలో ఆయన ఇంటికెళ్లి… ఆయ నను బ్రతిమలాడుకుని దీక్షను విరమించు కునేలా చేస్తా…. అని ప్రసంగం ముగించి క్రిందకు దిగి కారెక్కాడు. నేరుగా చంద్ర బాబు ఇంటికి చేరుకున్నాడు. నిద్రపో తున్న చంద్రబాబు కాళ్లు కదుపుతూ… నా కోసం మీరు దీక్షను విరమించాలి… నా కోసం ప్లీజ్‌ అని బ్రతిమలాడుకుం టున్నాడు. చంద్రబాబు మాత్రం కుదరదు మోడీ… ‘గో బ్యాక్‌… గో బ్యాక్‌’ అని అరుస్తున్నాడు. అప్పుడే ముఖం మీద నీళ్ళు పడడంతో చంద్రబాబు ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా భువనేశ్వరి చేతిలో చెంబు పట్టుకుని వుంది. బెడ్‌మీద దేవాన్ష్‌ ఆయన కాళ్ళను చుట్టుకుని వున్నాడు. చంద్రబాబు అయోమయంగా… ఏమైంది… ముఖాన ఈ నీళ్లేంటి అని అడిగాడు… అందుకు భువనేశ్వరి… నిద్రలో ‘మోడీ గో బ్యాక్‌’ అంటూ ఆ కలవరింతలేంటి… దేవాన్ష్‌ కాళ్ళు పట్టు కుని కుదుపుతున్నా లేవలేదేంటి అని అడిగింది. అప్పుడు అర్ధమైంది చంద్ర బాబుకు తన కాళ్ళు పట్టకుని కదిలించింది మోడీ కాదు… దేవాన్ష్‌ అని.., అప్పటి దాకా జరిగిందంతా కల అని. ఏంటి నాన్న, ఏమైంది అని మనుమడిని అడి గాడు చంద్రబాబు. దేవాన్ష్‌ తాతతో… టీవీలో మోడీ తాతయ్య కనిపిస్తున్నాడు… చూద్దురు రండి అని చేయిపట్టుకుని హాల్‌లోకి తీసుకెళ్లాడు.

ఈ దేశంలోనే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ అంతటి అవినీతిపరులు ఎవరూ లేరు. అవినీతి కేసులకు భయపడే వాళ్ళు దేశాన్ని దోచుకుతిన్న కాంగ్రెస్‌తో జతకట్టారు అని ఓ రేంజ్‌లో తూర్పార బడుతున్నాడు. అది చూసి చంద్రబాబు తల పట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here