Home రాష్ట్రీయ వార్తలు బయటపడ్డ బంధం

బయటపడ్డ బంధం

సినిమాలలో నటించేవాళ్ళను నటుడు అంటారు. రాజకీయాలలో వుండి నటించే వాళ్ళను మహానటుడు అంటారు. రాజకీయాలకు సంబంధించి అలాంటి మహానటుడే చంద్రబాబు నాయుడు. ఒక సినిమా నటుడు, ఒక రాజకీయ మహానటుడుల మధ్య కుదిరిన రాజకీయ బంధం రాష్ట్ర రాజకీయాలలో చాలాకాలంగా చర్చనీయాంశంగా వుంది.

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పాత్రేంటి? ఆయన చంద్రబాబుకు మిత్రుడా? లేక శత్రువా? లేక రాజకీయ భాగస్వామా? ఇదే టాపిక్‌ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపులో పవన్‌కళ్యాణ్‌ పాత్ర ఎంతైనా వుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలకు నేను గ్యారంటీ అని ఆ ఎన్నికల్లో చెప్పిన పవన్‌కళ్యాణ్‌ ఆ తర్వాత తానిచ్చిన గ్యారంటీ సంగతి మరచిపోయాడు. ప్రభుత్వంపై ఏ ఒక్క హామీ విషయం లోనూ ఆయన పోరాడలేదు. తెలుగుదేశంతో విభేదించినట్లు నటిస్తూ గతంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద పెట్టిన సభలో చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్‌పై ఘాటుగా విమర్శలు చేశాడు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గట్టిగా పోరాడుతున్నాడనే ఒక భ్రమను ప్రజల్లో కల్పించాలని చూశాడు. అయితే ఆ తర్వాత కాలంలో ఆయన ప్రభుత్వాన్ని వదిలేసి, ఏ ఒక్కరోజు కూడా అధికారంలో లేని ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయసాగాడు. గత రెండు మూడేళ్లుగా పవన్‌కళ్యాణ్‌ చేష్టలు చూస్తుంటేనే అందరికీ అర్ధమైంది… ఇతను చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఆర్టిస్ట్‌ అని.

కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైకాపాకు పోకుండా చేయడం కోసమే చంద్రబాబు పవన్‌ను ప్రత్యేకంగా తిప్పుతున్నాడు. ఒకవేళ పవన్‌ ఓటు తనకు ఖచ్చితంగా పడుతుంది అనుకుంటే చంద్రబాబు మళ్ళీ పవన్‌తో కలిసే ఎన్నికలకు వెళతాడు. మొన్న విలేకరుల సమావేశంలో పవన్‌తో కలిసి మేము పోటీ చేస్తే తప్పేంటని చంద్రబాబు చెప్పకనే చెప్పాడు. కలిసి పోటీ చేద్దామంటూ మళ్ళీ పవన్‌కు పిలుపునిచ్చాడు. చంద్రబాబుకు పవన్‌ ఆప్షన్‌ కాదు ఛాయిస్‌. వాళ్లిద్దరి బంధం పెన్నా సిమెంట్‌ అంత దృఢమైనది. విశాఖ స్టీల్‌ అంత బలమైనది. చంద్రబాబు నిర్ణయం బట్టే పవన్‌ సొంతంగా పోటీ చేయడమా లేక తెలుగు దేశంతో కలిసి పోటీ చేయడమా అన్నది వుంటుంది. లింగమనేని గెస్ట్‌హౌస్‌ ఒకరు… లింగమనేని సైట్‌ ఒకరు… ఈ బంధమే చెపుతుంది వారి మధ్య అనుబంధమెంత వుందన్నది. ఇప్పుడు చంద్రబాబు ఓపెన్‌గానే చెప్పాడు…వీళ్లిద్దరి బంధం, వీళ్ళద్దరి నాటకం తెలుసు కాబట్టే జగన్‌, పవన్‌తో పొత్తుకు ఎప్పుడూ వెంపర్లాడలేదు. సరి కదా, చంద్రబాబుతో సమానంగా ఈమధ్య పవన్‌ను కూడా వాయిం చడం మొదలుపెట్టాడు. చంద్రబాబు నోటి నుండి వచ్చిన మాటలు విన్నాక కూడా పవన్‌ కళ్యాణ్‌ ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడని, ప్రత్యేక రాజకీయ వ్యవస్థను నిర్మిస్తాడని ఎవరైనా అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం వుండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here