Home జిల్లా వార్తలు ఫ్యాన్‌ రెక్కల క్రిందకు… పెద్ద కుటుంబాలు

ఫ్యాన్‌ రెక్కల క్రిందకు… పెద్ద కుటుంబాలు

ఆనం… నల్లపరెడ్డి… నేదురుమల్లి… మాగుంట… మేకపాటి… గడచిన మూడు దశాబ్దాల కాలంలో నెల్లూరు జిల్లాలో మనం చూసిన రాజకీయ కుటుంబాలు. వీటిలో ఎక్కువ కుటుంబాలు కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వచ్చాయి. ఒక్క నేదురుమల్లి కుటుంబం తప్పితే మిగిలిన అన్ని కుటుంబాలకు కూడా పార్టీలు మారిన చరిత్ర వుంది. గత రాజకీయ చరిత్రను చూస్తే… ఒకే కుటుంబం నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు లేదా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే… ఇలా కాంబినేషన్‌ వుండడం చూసాం. బహుశా నెల్లూరు జిల్లాలో వున్నంతగా రాజకీయ కుటుంబాలు రాష్ట్రంలో మరో జిల్లాలో వుండవేమో!?

ఒకప్పుడు కాంగ్రెస్‌లో మెజార్టీ రాజకీయ కుటుంబాలు కనిపించేవి. రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలతో ఈ కుటుంబాలు చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్లు మారాయి. 2014 ఎన్నికల నాటికి మాగుంట కుటుంబం తెలుగుదేశంలోకి వెళ్ళిపోగా, మేకపాటి, నల్లపరెడ్లు వైసిపిలో చేరిపోవడం తెలిసిందే! అప్పటికి నేదురుమల్లి, ఆనం కుటుంబాలు మాత్రమే కాంగ్రెస్‌లో మిగిలాయి.

తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ కుటుంబాలన్నీ కూడా ఒక్క చోటుకు చేరాయి. గతంలో కాంగ్రెస్‌లో ఏ కుటుంబాలు అయితే వుండేవో ఆ కుటుంబాలు ఇప్పుడు వైసిపికి అండగా నిలుస్తున్నాయి. వైసిపి ఆవిర్భావంతోటే మేకపాటి, నల్లపరెడ్లు జగన్‌ వెంట నడవడం జరిగింది. ఇటీవల మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆ తర్వాత స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైసిపిలో చేరడం తెలిసిందే! దీంతో జిల్లాలో నాలుగు ప్రధానమైన రాజకీయ కుటుంబాలు వైసిపిలో వున్నట్లయ్యింది. ఇక మిగిలివుండేది మాగుంట కుటుంబం. ప్రస్తుతానికి వాళ్ళు తెలుగుదేశం లోనే వున్నారు. 2014లోనే వాళ్ళు వైసిపిలో చేరాల్సి వుండింది. అయితే పార్టీ అధిష్టానంలోనే కొన్ని పొరపాట్ల కారణంగా మాగుంట వైసిపిలో చేరలేదు. ప్రస్తుతం చేరే అవకాశాలూ లేవు. అయినా వాళ్ళ ప్రభావం ప్రకాశం జిల్లాకే పరిమితం కాబట్టి నెల్లూరుజిల్లా గురించి ఆలోచించాల్సిన పనిలేదు. వాళ్ళను తీసి పక్కనపెడితే పెద్ద కుటుంబా లన్నీ కూడా దాదాపు ఫ్యాన్‌ క్రిందకు చేరినట్లే! మరి వీళ్ళ సత్తా ఏంటో రేపు ఎన్నికల్లో చూద్దాం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here