Home జిల్లా వార్తలు ఫలించని ప్రయత్నం

ఫలించని ప్రయత్నం

వైకాపాకొస్తా.. అవకాశమివ్వండి – పనబాక కృష్ణయ్య

ఇద్దరూ రండి అవకాశమిస్తాం – పార్టీ అధిష్టానం

ససేమిరా అన్న లక్ష్మీ.. నిరాశతో కృష్ణయ్య…

రాష్ట్రంలో రాజకీయంగా జరుగుతున్న పలు మార్పులలో నెల్లూరుజిల్లా కూడా కీలకంగా మారుతోంది. తొలి నుండి పదికి పది సీట్లు వై.యస్‌.ఆర్‌.సి.పి కైవసం కావాలన్న ఆలోచనలో వున్న జిల్లా నాయకత్వం అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ఈ తరుణంలో గూడూరు అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య జిల్లా స్థాయి నాయకుల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరినీ అభ్యర్థించడం ఆసక్తికరంగా మారింది.

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కావడం, గూడూరు నియోజకవర్గంలో పట్టున్న నాయ కుడిగా పేరుండడం, అంతకుమించి కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో వున్నప్పుడు 10సంవత్సరాలు కేంద్ర సహాయ మంత్రిగా పని చేసిన పనబాక లక్ష్మికి భర్త కావడం… ఇవన్నీ కృష్ణయ్యకు వున్న అదనపు అర్హతలుగా పార్టీ నాయకత్వం ఆయన అభ్యర్ధనను పరిశీలించవలసిందిగా అధిష్టానానికి సూచించింది. అయితే ఇక్కడే పార్టీ అధ్యక్షుడు తన విజ్ఞతని, నైతికతని ప్రదర్శించాడు. కృష్ణయ్యతో పాటు పనబాక లక్ష్మి కూడా వస్తే తనకు అభ్యంతరం లేదని, కృష్ణయ్య ఒక్కడే వస్తే భార్యాభర్తలని విడదీశామన్న అపవాదు పార్టీకొస్తుందని, ఆ పాపం మూటకట్టుకోవడం తనకిష్టంలేదని తేల్చి చెప్పేశాడు.

పనబాక లక్ష్మిని ఒప్పించే ప్రయత్నం కృష్ణయ్య చేసినా ఫలితం లభించినట్లులేదు. ఓ వైపు ఆమె రాజకీయాలలో ఇకపై చురుగ్గా పాల్గొనబోదు అని ఆయన చెప్తున్నప్పటికీ సోమవారం కర్నూలులో జరిగిన రాహుల్‌గాంధీ సభలో ఆమె వేదికపై వుండడాన్ని గమనిస్తే ఆమె కాంగ్రెస్‌ను, రాజకీయాలనూ వదిలే ప్రసక్తే లేదని తేటతెల్లమైపోయింది.

అయితే కృష్ణయ్యను వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీయే బ్రతిమాలుతోందని, ఆయన సుముఖంగా లేడని కొందరు కృష్ణయ్య అభిమానులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీని అప్రదిష్టపాలు చేసే ప్రయత్నంలో రాజకీయ అజ్ఞానులు, మూర్ఖులు చేస్తున్న ప్రచారమే తప్ప అందులో వాస్తవం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కృష్ణయ్యే పార్టీ వర్గాల వెంట పడ్డాడు తప్ప, పార్టీ ఏనాడూ ఆయన వెనుక పడ లేదని, ఇలా దుష్ప్రచారం చేసి పార్టీపై నిందలేయడం సబబు కాదని, కృష్ణయ్య రాకపోతే పార్టీకి పెద్ద నష్టమేమీ లేదని, కానీ ఆయన ఇలా పార్టీపై నిందవేయడం సబబుకాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇద్దరూ వస్తే అభ్యంతరం లేదని పార్టీ అధినాయకుడు చెప్పడం, ఆయన నిజాయితీకి, నైతికతకి, విశ్వసనీయతకి అద్దం పడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here