Home సంపాదకీయం ప్రమాద ఘంటికలు

ప్రమాద ఘంటికలు

2019 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల సంగ్రామం అనే ఫైనల్‌ మ్యాచ్‌కు ముందుగా ఐదు రాష్ట్రాలలో సెమీఫైనల్స్‌గా భావించిన అసెంబ్లీ ఎన్నికలు జరగనూ జరిగాయి, ఫలితాలు రానూ వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలతో పాటూ టిఆర్‌ఎస్‌, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలలో ప్రధానంగా తమ భవిష్యత్‌ను నిర్ణయించుకున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో మిగతా పార్టీలన్నింటిదీ నామమాత్రపు పాత్రే!

డిసెంబర్‌ 11వ తేదీన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలలో తీవ్రంగా నష్టపోయింది కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీనే! అధికారంలో వున్న మూడు రాష్ట్రాలను ఆ పార్టీ కాంగ్రెస్‌కు అప్పగించింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లలో కాంగ్రెస్‌ పాగా వేసింది. 2014 ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్‌పార్టీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే! పంజాబ్‌ ఎలక్షన్‌ తర్వాత వారి తలుపు తట్టిన గెలుపు ఇదే! గత నాలుగున్నరేళ్లుగా ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్‌కు ఈ మూడు రాష్ట్రాల గెలుపు పెద్ద వూరటనే చెప్పాలి. అంతేకాదు, 2019లో ఢిల్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌ శ్రేణులకు ఈ ఫలితాలు ఉత్తేజాన్ని నింపేవి కూడా! ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ పరాజయాలపై ఆ పార్టీ నాయ కత్వం పోస్ట్‌మార్టమ్‌ చేసుకోక తప్పదు. రాజస్థాన్‌లో ఓటమి అన్నది సాధారణ విషయం. అక్కడ ఐదేళ్ళ కోసారి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అధికార మార్పిడి జరుగుతుంటోంది. అంతేకాదు, ముఖ్యమంత్రి వసుంధర రాజె ప్రజల ఆదరణ పొందే విధంగా పని చేయలేదు. ప్రజల్లో కలవలేని మనిషి. ఆమె పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వుంది. అక్కడ ఓటమి ముందుగా ఊహించినదే! అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టిగానే పోరాడిందనుకోవచ్చు. మరీ అంతగా గల్లంతు కాలేదు. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌లలో ఆ పార్టీ గెలిచుంటే వరుసగా ఇది నాలుగో గెలుపయ్యుండేది. ఆ అవకాశం మిస్సయ్యింది. చత్తీస్‌ఘడ్‌ సీఎం రమణసింగ్‌ సమర్ధవంతమైన నాయకత్వం అందించినప్పటికి, ఈ ఎన్నికల్లో పార్టీని పరాజయం బాట నుండి తప్పించలేకపోయాడాయన! చత్తీస్‌ఘడ్‌లో బీజేపీకి దారుణ పరాభవం మిగిలింది. ఇక మధ్యప్రదేశ్‌లో అయితే బీజేపీ – కాంగ్రెస్‌ల మధ్య చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లుగానే సమరం నడిచింది. కేవలం 5 సీట్లు వెనుకబడి బీజేపీ అధికారం కోల్పోగా, ముక్కి మూలిగి 20ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లో పెద్దపార్టీగా నిలిచింది. అయితే అక్కడకూడా ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి.

పై మూడు రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపేవే! అయితే అదే సమయంలో అధికా రంలో వున్న మిజోరంను ఆ పార్టీ కోల్పోయింది. మిజోనేషనల్‌ ఫ్రంట్‌ ఆ రాష్ట్ర అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అన్నింటికి మించి ఆ పార్టీకి మింగుడుపడని ఫలితం తెలంగాణ. ఈ రాష్ట్రంలో అయితే అధికారంలోకి వచ్చేసినట్లే భావించారు. అధికారంలోకి రావాలన్న యావతో విలువలను వదిలేసారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో ప్రచారానికి వెళ్లారు. చంద్రబాబును నిండా నమ్మారు, నిలువునా మునిగిపోయారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను ఏర్పాటు చేసిందే ఆ రాష్ట్రంలో పాగా వెయ్యడం కోసం. 2014లో ఆ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు రెండోసారి కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నిరాకరించారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌ కేడర్‌ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ద్వారా దేశ రాజకీయాలలో మరో బలమైన ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించినట్లయ్యింది.

మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూస్తే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగానే భావించాలి. వాళ్ళు అధికారం కోల్పోయిన మూడు రాష్ట్రాలలో చూస్తే… రాజస్తాన్‌ను పక్కన పెడితే మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌లలో ఓటమిపై లోతైన అధ్యయనం జరగాలి. అక్కడి స్థానిక ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఇద్దరు సీఎంలపై అవినీతి ఆరోపణలు లేవు. సమర్ధవంతమైన పరిపాలనను అందించిన నాయకులు. మరి లోపం ఎక్కడ జరిగింది. ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ఈ రూపంలో ప్రజావ్యతిరేకత వ్యక్త మైందని అనుకోవాలి. ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల కేంద్రం సరిగా స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల ఉద్యమాలను సైతం కేంద్రం చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలున్నాయి. ఇదే కాదు నోట్ల రద్దు కష్టాలు, జిఎస్టీ వంటి అంశాలు సామాన్య ప్రజలకు బీజేపీని దూరం

చేశాయి. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం దేశాభివృద్ధికి ఏమేం చేస్తుందో కూడా చెప్పుకోలేకపోతుంది. పార్టీలో నరేంద్ర మోడీ, అమిత్‌షాలు తప్పితే ఇంకెవరూ కనిపించడం లేదు. కాబట్టి 2019 ఎన్నికలకు కూడా దేశంలో ఇదే వాతావరణముంటే

బీజేపీకి గడ్డు కాలమే! అదే సమయంలో మూడురాష్ట్రాల్లో అధికారం వచ్చిందని కాంగ్రెస్‌ చంకలు గుద్దుకోబల్లేదు. బీజేపీపై వ్యతిరేకత వల్లే ఆ మూడు రాష్ట్రాలలో మరో ప్రత్యామ్నాయం లేక ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేసారు. కాని ప్రత్యామ్నాయం వున్న తెలంగాణ, మిజోరాంలలో ప్రజలు ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టారు! కాంగ్రెస్‌ వాళ్ళు ఇది గమనించాలి.

ఈ ఫలితాలు మోడీకి ముందస్తు హెచ్చరిక లాంటివి. ఈ ఫలితాలపై సరిగ్గా విశ్లేషణ చేసి లోపా లను సరిదిద్దుకోగలిగితే, ఈ ఫలితాలే ఆ పార్టీ నాయకత్వానికి గుణపాఠాలై, భవిష్యత్‌ విజయానికి బాటలు వేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here