Home గల్పిక ప్రధాని పదవిపై రాహుల్‌ ఫార్ములా!

ప్రధాని పదవిపై రాహుల్‌ ఫార్ములా!

ఢిల్లీలోని టెన్‌జనపథ్‌…. సోనియా గాంధీ ఆహ్వానం మేరకు మమతా బెనర్జీ, ములాయంసింగ్‌ యాదవ్‌, మాయావతి, శరద్‌పవార్‌, చంద్రబాబునాయుడులు అక్కడకు వచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు అహ్మద్‌పటేల్‌, మల్లిఖార్జునఖర్గే, అంబికా సోని, గులాంనబీ ఆజాద్‌, పనబాక లక్ష్మిలు కూడా అక్కడే వుండి వారిని ఆహ్వానించి ఒక హాల్‌లో కూర్చోబెట్టారు. అంతలో కాషాయపంచె ధరించి భుజా లపై కాషాయ పీతాంబరం వేసుకుని మెడలో పెద్ద రుద్రాక్షమాల, నుదుటన, భుజాల మీద పెద్దపెద్ద విభూది నామాలు పెట్టుకున్న ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు. అతనిని చూడగానే చంద్రబాబు లేచి… హాయ్‌ సుబ్బరామిరెడ్డి గారు, బాగున్నారా అని అడిగాడు. ఆ మాటకు పనబాక లక్ష్మి ఆశ్చర్యపోయి… సుబ్బరామిరెడ్డి ఎవరు అని అడిగింది. చంద్రబాబు వెం టనే ఈయన మా తిక్కవరపు సుబ్బరామి రెడ్డే కదా, అపర శివభక్తుడు, ఆంధ్ర భక్తకన్నప్ప అని అన్నాడు. అప్పుడు సోనియా కలుగజేసుకుని పకపక నవ్వుతూ… చంద్రబాబూజీ… మీరు పప్పులో కాలేసారు, అతను మీ సుబ్బ రామిరెడ్డి కాదు, నా గారాల బిడ్డ రాహుల్‌ అని చెప్పింది. చంద్రబాబు ఆశ్చర్యపోయి… మరి ఆ వేషధారణేంటి మా సుబ్బరామన్నలాగా అని అడిగాడు. అందుకు సోనియా… కాంగ్రెస్‌పార్టీ హిందూ వ్యతిరేకి అని బీజేపీ వాళ్ళు పదేపదే ముద్రవేస్తున్నారు. దానిని పోగొట్టుకోవడానికే రాహుల్‌ దేశంలో రోజుకొక శివాలయం సందర్శించాలని కంకణం కట్టుకున్నాడని చెప్పింది. శరద్‌పవార్‌ వుండి… ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిపించినట్లని అడిగాడు. అంతలో వి.హెచ్‌.హనుమంతురావు ట్రేలో కాఫీ కప్పులతో వచ్చాడు. ముందు కాఫీ తాగండి… ఆ తర్వాత చెబుతాను అని సోనియా అంది. అందరూ కాఫీ తాగాక సోనియా వుండి… మనం విడి విడిగా పోటీచేస్తే ఆ బీజేపీని ఓడించడం కష్టం… మన ఓటు బ్యాంకు చీలిపో కుండా వుండాలంటే అందరం కలిసి కట్టుగా ఒకే కూటమిగా పోటీ చెయ్యాలి. కాబట్టి ఆయా రాష్ట్రాలలో మనం పొత్తు లను పరిష్కరించుకోవాలి అని చెప్పింది. పొత్తుల సంగతి తర్వాత ముందు మనలో ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చండి, ఇప్పుడు కాకున్నా ఎలక్షన్‌ తర్వాతైనా ప్రధాని కుర్చీ కోసం తన్నుకోవాల్సిందేగా అని శరద్‌ పవార్‌ అన్నాడు. దానికి సోనియా, నా తుదిశ్వాసలోపు రాహుల్‌ను ప్రధానిగా చూడాలని నా కోరిక. కాబట్టి రాహుల్‌ను పెడదామంది. వెంటనే మాయావతి… ఈసారి ప్రధానిగా దళితబిడ్డకు అది కూడా ఆడబిడ్డకే అవకాశం దక్కాలని డిమాండ్‌ చేసింది. అప్పుడు మమతా బెనర్జీ… అసలు మోడీకి వ్యతిరేకంగా తొలిపోరాటం మొదలుపెట్టిందే నేను, పీఎం ఛాన్స్‌ నాదే అంది. ఇక్కడ ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ, ఈ దేశానికి ఎంతో మంది ప్రధానులను అందించిన క్రెడిట్‌ వున్నోడ్ని… గతంలో రెండుసార్లు ప్రధాని ఛాన్స్‌ను వదులుకున్నాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని చంద్ర బాబు సీరియస్‌గా చెప్పాడు. అప్పుడు రాహుల్‌ కలుగుజేసుకుని… మనం కూటమి కట్టకముందే కొట్టుకుంటే రేపు బీజేపీని ఎలా ఓడించగలం. ప్రధాని పదవిపై నేనొక ఫార్ములా చెబుతాను వినండి… కాంగ్రెస్‌కు 150కన్నా ఎక్కువ సీట్లు వస్తే నేనే ప్రధానిని… మీరందరూ నాకు మద్దతునివ్వాలి. కాంగ్రెస్‌కు 150లోపే వచ్చాయనుకోండి… మీలో ఒకరు ప్రధాని అవుతారు. మీలో ఎవర్ని ఎన్నుకోవాలన్నదానిపై కూడా ఇప్పుడే ఫార్ములా తయారు చేస్తాను. మీ పార్టీలకు కూడా కనీసం ఒక్కో పార్టీకి 20సీట్లు వచ్చి వుండాలి. అలా సీట్లు తెచ్చుకున్నపార్టీ అధినేతల పేర్లను చీటీల మీద వ్రాసి ఒక డబ్బాలో వేస్తాం. ఒక చిన్నపిల్లోడి చేత ఒక చీటీని తీయిస్తాం. అందులో మీలో ఎవరి పేరుంటే వాళ్ళే ప్రధానమంత్రి. మేము గతంలో ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఇలాగే ఎంపిక చేసే వాళ్ళం అని చెప్పాడు. ఈ ఫార్ములాకు మేం ఒకే అని మాయావతి చెప్పింది. ప్రధానిని ఎలా ఎంపిక చేయాలన్నదానిపై స్పష్టత రావడంతో అందరూ అక్కడ నుండి లేచారు.

టెన్‌జనపథ్‌ నుండి బయటకొచ్చాక ములాయంసింగ్‌, చంద్రబాబు, శరద్‌ పవార్‌, మాయావతి, మమతా బెనర్జీలు ఒక కేఫ్‌లోకి వెళ్ళారు. అక్కడ త్రీబైఫైవ్‌ టీ ఆర్డర్‌ చేశారు. మాయావతి వుండి… మనం ప్రధాని ఛాన్స్‌లో రాహుల్‌కు అవకాశం ఇచ్చి వుండకూడదు, మన మంతా ఒక్కటిగా వుంటే చచ్చినట్లు కాంగ్రెసోళ్ళు మనకే మద్దతునిచ్చేవాళ్ళు. రేపు పొరపాటున కాంగ్రెస్‌కు 150సీట్లు దాటితే ప్రధాని ఛాన్స్‌ అతనికే ఇవ్వాలిగా అని బాధగా చెప్పింది. అం దుకు చంద్రబాబు… రాహుల్‌ ఫార్ములాకు ఒప్పుకోవడానికి మేమేమన్నా అమాయ కులమా… ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ. రేపు ఎన్నికల్లో అన్ని రాష్ట్రాలలోనూ పొత్తులలో భాగంగా కాంగ్రెస్‌కు బాగా సీట్లు తగ్గిస్తాం. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేసినచోటల్లా మన పార్టీలు వ్యతి రేకంగా పనిచేస్తాయి. కాబట్టి వాళ్ళకు 150సీట్లొచ్చేది లేదు, రాహుల్‌ ప్రధాని అయ్యేది లేదు… మనకే ఛాన్స్‌ అని చెప్పాడు. బాబు మాటలతో అందరూ ఆనందపడ్డారు.

———-

టెన్‌ జనపథ్‌లో నుండి అందరూ వెళ్ళాక సోనియాతో పనబాక లక్ష్మి వుండి… అదేంటమ్మా, ప్రధాని ఛాన్స్‌ రాహుల్‌ బాబుకు ఒక్కడికే పెట్టకుండా వాళ్ళకు ఎందుకు అవకాశమిచ్చారు. మనకు 150సీట్లు రాకపోతే ప్రధాని కుర్చీ వాళ్ళకు ఇవ్వాల్సిందేగా అని వాపో యింది. అందుకు సోనియా… ఓసి పిచ్చిమొహమా, ఇటలీ నుండి వచ్చింది, ఇండియా రాజకీయాల గురించి నాకేమీ తెలియదనుకుంటున్నావా, రేపు ఎన్నికల్లో మనతో పొత్తుపెట్టుకునే అన్ని పార్టీలకు సీట్లు తగ్గించి ఇస్తాం… మన మిత్రపక్ష పార్టీల అభ్యర్థులను ఓడించేందుకు మన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తారు. మన కూటమిలోని ఏ ఇతర పార్టీకి పది సీట్లకు మించి రావు. అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రధాని పదవి మన రాహుల్‌దే అని చెప్పింది. అది విని పనబాక లక్ష్మి… మీ బుర్రేబుర్ర… మీ బుర్రేబుర్ర అంటూ సోనియా తలను కళ్ళకు అద్దుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here