Home సంపాదకీయం ప్రగతిబాటలో.. జీఎస్టీ

ప్రగతిబాటలో.. జీఎస్టీ

‘జీఎస్టీ’… దేశంలో ఏడాది క్రితం ఆవిర్భవించిన ఒక సరికొత్త పన్నుల వ్యవస్థ. దీంతో వృద్ధి, సరళత, పారదర్శకత సాధ్యమయాయి. రవాణా రంగానికి కొత్త ఊపు వచ్చింది. అది మన దేశ ఉత్పాదకతను పెంచుతోంది. అయితే, అన్నింటికీ ఒకే శ్లాబు ఉండాలని చెప్పడం సులభమే. కానీ, అలా చేయడం వల్ల ఆహారోత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయి. కనుక, అన్నిటికీ ఒకే శ్లాబ్‌ విధానం అసాధ్యం!… – ప్రధాని మోడీ

దేశంలోనే ఎంతో చరిత్రాత్మకమైన వస్తుసేవల పన్ను విధానం..’జిఎస్టీ’ అమలులోకి వచ్చి జూలై 1వ తేది నాటికి ఏడాది పూర్తయింది. ఏడుదశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థను ప్రక్షాళనం చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద సంస్కరణగా పేరొందిన జీఎస్టీ అమలులో తొలి ఏడాది పూర్తయింది. బాలారిష్టాలు దాటుకుని, ఒడిదుడుకులన్నీ తట్టుకుని ఈ ఏడాదిలో జిఎస్టీ అనుకున్న లక్ష్యసాధన దిశగా అడుగులు వేసుకుంటూ మునుముందుకు సాగు తోంది. ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే

ఉన్నా జిఎస్టీ మండలి ఇప్పటికి సుమారు 27 సార్లు సంబంధిత అధికారులు, నిపుణులు, వ్యాపారవర్గాల వారందరితో సమావేశమై, సమస్యలను ఎప్పటిప్పడు కూలంకుషంగా పరిశీలించి, అవసరమైన సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేసుకుంటూ, దేశప్రగతికి మేలుబాటలు పరుస్తూ… జిఎస్‌టి తొలి ఏడాది దిగ్విజయంగానే పూర్తిచేసుకుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధికవ్యవస్థల్లో భారత్‌ ఒకటి. దానిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు సహజమే. అయితే, వాటన్నిటినీ సంయమనంతో పరిశీలించి పరిష్కరించుకుంటూ జిఎస్టీ ముందుకుసాగుతోంది.

తొలిదశలో జిఎస్టీపై రాష్ట్రాలు, అనేకవర్గాల వారితో భేదాభిప్రాయాలు వచ్చినా పరిశీలనల మీద పరిశీలనలు జరిపి చివరికి ఒక జిఎస్టీని క్రమబద్ధమైన వ్యవస్థగా రూపుదాల్చేందుకు కేంద్రం ఎంతో శ్రద్ధ తీసుకోవడం, తద్వారా అందరూ ఆశించినట్లుగానే ఈ కొంగ్రొత్త పన్నుల విధానం కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధికి బాటలు వేస్తుండడం ఆహ్వానించదగిన పరిణామం. వ్యాపార, రవాణా రంగాలకు మేలుబాటలు పరిచే వ్యవస్థ ఇన్నాళ్ళకు..ఇన్నేళ్ళకైనా రావడం దేశానికి శుభపరిణామం. ఒక్కమాటలో చెప్పాలంటే, జీఎస్టీతో రవాణా రంగానికి కొత్త ఊపు వచ్చిందనడంలో సందేహం లేదు. గతంలో వలె తనిఖీలు, వేధింపులకు తావులేని వ్యవస్థ ఏర్పడడం, చెక్‌పోస్ట్‌లు రద్దుకావడం, సరకు రవాణా వేగం పుంజుకోవడం వంటి చర్యలతో పాటు. అత్యంతాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో అంతా ఆన్‌లైన్‌లోనే రవాణా వ్యవస్థ సేవలు అందుబాటులోకి రావడం, రిటర్న్‌లు దాఖలు చేయడం దగ్గరనుంచి అన్నీ ఆన్‌లైన్‌లోనే వేగవంతంగా, పారదర్శకంగా సాగిపోతుండడం ఎంతో విశేషం.

17 రకాల పన్నుల్ని, 23 రకాల సెస్సుల్ని కలిపి ఒకే పన్నుగా.. జిఎస్టీ కిందకి తీసుకువచ్చాక, ఏడాదిలోనే పరోక్షపన్ను చెల్లింపుదారుల సంఖ్య 70 శాతం మేర పెరగడం ఎంతైనా ఊహించని పరిణామమే. దేశంలో ఇంతపెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు పెరగడం బహుశా ఇప్పుడే కావచ్చు. ఈ ఏడాది బడ్జెట్లో 12 లక్షల కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్ధేశించుకున్నా, దాని అదనంగా మరో లక్ష కోట్ల రూపాయలైనా వసూలు కావచ్చని కేంద్రం అంచనాలు వేస్తున్నదంటే, ఈ సరికొత్త పన్నుల వ్యవస్థ వల్ల దేశాభివృద్ధికి కలిగే ప్రయోజనం కన్నులకు కట్టినట్లే కనిపిస్తోంది. సులభతరమైన వ్యాపార నిర్వహణ మెరుగుపడడంతో పాటు, చిన్న-మధ్యతరహా వ్యాపార వర్గాలకు కూడా జీఎస్టీ వల్ల ఎంతో లబ్ధి కలుగుతోందనే చెప్పవచ్చు.

జిఎస్టీ వచ్చాక..ఈ ఏడాది వ్యవస్థలో 350 కోట్ల దాకా లావాదేవీలు జరిగాయని, 11 కోట్ల రిటర్న్‌లు దాఖలయ్యాయని గణాంకాలు వివరిస్తున్నాయి. జిఎస్టీ వల్ల ఇప్పుడు బియ్యం, గోధుమలు, చక్కెర, మసాలా దినుసులు వంటి నిత్యావసరాలతో సహా దాదాపు 400 రకాల వస్తువులపై పన్నులు తగ్గాయి. 150 రకాల వస్తువులపై పన్నులు లేవు. అనేక వస్తువులను 5 శాతం శ్లాబ్‌లోకే చేర్చారు. 95 శాతం వస్తువులు 18 శాతం కంటే తక్కువ పన్నులోనే

ఉన్నాయి. అయితే, దేశంలో అన్ని రకాల వస్తు వులపై ఒకే శ్లాబ్‌ విధించడం మాత్రం సాధ్యం కాదు. అలా అన్నిటిపై 18 శాతం వంతున ఏకీకృత పన్ను విధిస్తే ఆహారోత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయని, కనుక, అన్నిటికీ ఒకే శ్లాబ్‌ విధానం సరికాదనే ప్రధాని మోడీ మాటలు అర్ధవంతమైనవి. జిఎస్టీ ఆశించిన లక్ష్యాలను సాధించే దిశలో పయనిస్తున్నదన్న మాట వాస్తవం.

అయితే, నిత్యావసరాలు తప్ప అన్నిటి ధరలు పెరిగిపోయాయంటూ వినియోగదారులు ఆందోళన చెందు తుండడాన్ని గమనించాలి. ముఖ్యంగా, పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెరిగినప్పుడల్లా ఆ భారం అటుతిరిగి ఇటుతిరిగి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపైనే పడుతోండడం విచారకరం. ఈ బాధలను కూడా పరిశీలించి ప్రజలకు ఎలాంటి అదనపు భారాల్ని మోపకుండా, పన్నుల వ్యవస్థను మరింతగా క్రమబద్ధీక రించడం అవసరం. ఏ సంస్కరణ అయినా అత్యధిక ప్రజల సంక్షేమాన్ని కాంక్షించాల్సి ఉంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల బతుకుజీవనానికి ఇబ్బంది లేకుండా పన్నుల వ్యవస్థ ఉంటేనే అందరికీ మేలు జరుగుతుంది. ఆ దృష్ట్యా వస్తుసేవల పన్నుకు సంబంధించి ఇంకొంత పరిశీలన జరిగి, సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనసరళికి ఎలాంటి కష్టాలుకానీ, మోయలేని భారాలుకానీ లేకుండా జిఎస్టీలో ఇంకా మెరుగైన దిద్దుబాట్లు జరగాల్సి ఉంది.

పన్నుల సరళీకరణలోనూ అర్ధవంతమైన, ఆదర్శవంతమైన విధానాలను అన్వేషించి అమలు చేసి నప్పుడే.. జిఎస్టీకి మరింత సార్ధకత ఏర్పడుతుంది. తద్వారా దేశ ఆర్థికవ్యవస్థకు, దేశప్రగతికి చేయూత నిచ్చినట్లవుతుంది. ద్వితీయ వసంతంలోనైనా ఇది నెరవేరుతుందని ఆకాంక్షిద్దాం!..జిఎస్టీ దేశానికి ఒక వినూత్నమైన..అత్యద్భుతమైన పన్నుల సంస్కరణ విధానంగా…చరిత్రాత్మకంగా నిలవాలని ఆశిద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here