Home రాష్ట్రీయ వార్తలు ప్యాకేజ్‌ బాబుకు… ఢిల్లీలో డామేజ్‌

ప్యాకేజ్‌ బాబుకు… ఢిల్లీలో డామేజ్‌

ప్రత్యేకహోదాపై తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అనుమతించగానే రాజకీయ విశ్లేషకులలో చాలా అనుమానాలొచ్చాయి. వైసిపి 13సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినా స్పీకర్‌ అనుమతించలేదు… వైసిపి ఎంపీలు రాజీనామా చేసాక తెలుగుదేశం ఎంపీ అలా నోటీసు ఇవ్వగానే ఇలా అనుమతించారు. టీడీపీ-బీజేపీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతుంది… అందుకే దీనిని అనుమతించారని ఒక సందేహం వినిపించింది. అలా కాదు… అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆధారం చేసుకుని బీజేపీ సభ్యులు తెలుగుదేశంను చీల్చి చెండాడబో తున్నారు, చంద్రబాబు ప్రభుత్వ నాలుగేళ్ళ అవినీతి అక్రమాలను బయటపెట్టబోతున్నారనే వాదన కూడా వినిపించింది.

తీరా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో జరిగిన సంఘటనలు చూస్తే పై రెండూ నిజం కాలేదు. బీజేపీ చంద్రబాబు పట్ల సానుభూతి చూపలేదు… అట్లాగని పూర్తి శత్రువుగా చూసి చీల్చి చెండాడనూ లేదు. 40ఏళ్ళ రాజకీయ అనుభవమున్న చంద్రబాబును ఒక వెర్రివెంగళప్ప అన్నట్లు చిత్రీకరించారు. చంద్రబాబు కంటే కేసీఆరే నయం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ నిండు సభలో చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును దయనీయ స్థితిలోకి నెట్టాయి. ఆయన పరిస్థితి అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు బాధ అన్నట్లుగా మారింది. మోడీ వ్యాఖ్యలు చంద్రబాబు నైజాన్ని బయటపెట్టాయి. ప్రత్యేకప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నాకే ఆమోదించాం, ఈరోజు ఆయన యూటర్న్‌ తీసుకున్నారు, వైసిపి ట్రాప్‌లో పడుతున్నావు బాబూ అని నేను హెచ్చరించాను, అయినా ఆయన మమ్మల్ని వదులుకుని వైసిపి ట్రాప్‌లో పడ్డాడు. ఓ పక్క తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుని పరిపాలనలో ముందుకు పోతుంటే, చంద్రబాబు మాత్రం సమస్యలను మెడకు తగిలించుకుని వాటితోనే కాపురం చేస్తున్నాడంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు పరువును బజారుకీడ్చాయి.

వైసిపి, బీజేపీల మధ్య రహస్య స్నేహముందంటూ తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మీడియా ఇంతకాలం రచ్చచేస్తూ వచ్చింది. అయితే తమ మిత్రులెవరో బీజేపీ నాయకులే పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారు. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలోనే… తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుండి బయటకు పోయినా తమ స్నేహం అలాగే కొనసాగుతుందని, చంద్రబాబు ఎప్పటికీ తమ మిత్రుడేనని ప్రకటించి తెలుగుదేశం ఎంపీలకే దిమ్మ తిరిగేలా చేసాడు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలలో బీజేపీపై ఉన్న వ్యతిరేకత తమపై పడకుండా చూసుకునేందుకు చంద్రబాబు నానాతంటాలు పడుతూ వచ్చాడు. బీజేపీ బురదను వైసిపికి అంటించాలని చూసాడు. కాని వాళ్ళే వచ్చి తనను కౌగిలించుకునే సరికి ఆ బురదను ఎలా కడుక్కోవాలో తెలియక చంద్రబాబు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు.

పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వంపై తెలుగుదేశంపార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం నిద్రపోతున్న గుర్రాని లేపి తన్నించుకున్నట్లుగా వుంది. ప్రత్యేకహోదాపై మాట్లాడే అర్హతను, పోరాడే అర్హతను తెలుగుదేశం పార్టీ ప్రత్యేకప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడే కోల్పోయింది. గత నాలుగేళ్ళకాలంలో ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు గట్టిగా ప్రయత్నించిన దాఖలాలే లేవు. సరికదా ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీకే చంద్రబాబు ఎక్కువుగా ఆకర్షితుడయ్యాడు. అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి ఏ.పికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదు. ప్రత్యేకప్యాకేజీ ఇవ్వబోతున్నాం అని చెప్పినప్పుడు కూడా చంద్రబాబు పెద్దగా రియాక్ట్‌ కాలేదు. అంతేకాదు, ప్రత్యేకప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి, కేంద్ర బీజేపీ నాయకులకు అప్పట్లో ఘనంగా సన్మానాలు నిర్వహించారు కూడా! ప్రత్యేకహోదా కోసం ఉద్యమాలు చేసిన ప్రతిపక్షంపై ఉక్కుపాదం మోపారు. హోదా అంటే జైలుకే అంటూ బెదిరించారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఇంత కసిగా అణచివేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు ప్రత్యేకహోదాపై ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని అవిశ్వాసతీర్మానం పెట్టడం వల్లే ఆయన జాతీయ స్థాయిలో అభాసుపాలు కావాల్సి వచ్చింది.

అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి సభలో తగిన సంఖ్యా బలం లేకపోవచ్చు. కాని చంద్రబాబు ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తప్పిన నాయకుడు కదా! ఎన్నోకొన్ని ఇతర పార్టీల మద్దతునైనా కూడగట్టి ఉండొచ్చు. కాని ఏపికి చుట్టూ వుండే రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టలేక బొక్కబోర్లా పడ్డాడు.

ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నాటకాలను ఇటు ప్రజలు నమ్మడం లేదు, అటు రాజకీయ పార్టీలు విశ్వసించడం లేదు. అవిశ్వాస తీర్మానంకు పోయి చంద్రబాబు రాష్ట్రస్థాయిలోనే కాదు ఢిల్లీ స్థాయిలో కూడా ఇమేజ్‌ను పోగొట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here