Home జిల్లా వార్తలు పోలీసు శాఖకు సవాల్‌గా మారిన… రాపూరు సంఘటన

పోలీసు శాఖకు సవాల్‌గా మారిన… రాపూరు సంఘటన

రాపూరు పోలీసుస్టేషన్‌పై దాదాపు 50మంది స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన వారు దాడి చేయడం, ఎస్‌.ఐ లక్ష్మణరావుతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్ళను కొట్టడం రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టకే సవాల్‌గా మారింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశా లను మన తెలుగు సినిమాలలోనే చూస్తుంటాం. నిజ జీవితంలో కూడా చూడాల్సి రావడం విచారకరం.

రాపూరు సంఘటనతో పోలీసు ఉన్న తాధికారులే ఉలిక్కిపడ్డారు. గుంటూరు రేంజ్‌ ఐ.జి గోపాలరావు హుటాహుటిన పరుగెత్తుకుంటూ వచ్చారు. దాడిలో పాల్గొన్న దళితుల తరపున రాష్ట్ర స్థాయి దళిత సంఘాల నాయకులు కూడా రంగం లోకి దిగారు. దాడిలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్‌ చేసారు.

దాదాపు 50మంది పోలీసుస్టేషన్‌పై దాడి చేసేంత తీవ్రస్థాయి సంఘటనకు పునాది కేవలం 2వేల రూపాయలేనని తెలిసింది. ఇది తెలిసాక చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తనకు రావాల్సిన రెండువేల రూపాయల బాకీ నిమిత్తం జోసెఫ్‌ అనే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌.ఐ లక్ష్మణరావు కాలనీకి చెందిన పిచ్చయ్య, లక్ష్మమ్మ, కనకమ్మ అనే వారిని స్టేషన్‌కు పిలిపించాడు. వారిపై చేయి చేసుకున్నాడని తెలిసింది. వీరిలో ఒక మహిళ కిందపడిపోవడంతో ఆమె చనిపోయిందనుకున్న కాలనీ వాసులు ఆగ్రహంతో పోలీసుస్టేషన్‌పై పడ్డారు. ఎస్‌.ఐను, పోలీసులను తీవ్రంగా కొట్టారు.

పోలీసుస్టేషన్‌ దాడిలో మరో కోణం కూడా వినిపిస్తోంది. ఎస్‌.ఐ లక్ష్మణరావు ఇక్కడ చాలామందికి కొరుకుడు పడని కొయ్యగా మారాడు. కొంతమందికి ఆయన దురుసు వ్యవహారశైలి నచ్చడం లేదు. ఓ అధికారపార్టీ నాయకుడి అండ చూసుకునే కొందరు ఎస్‌.ఐపై దాడికి పాల్పడ్డారని సమాచారం. ఏదేమైనా ఇది ప్రభుత్వానికి, పోలీసు శాఖకు చాలా సున్నిత సమస్య. పోలీసులపై దాడికి పాల్పడ్డవారిని అరెస్ట్‌ చేసి కోర్టు బోను ఎక్కించకతప్పదు. లేకుంటే మీ మీద దాడి జరిగితేనే ఏమీ చేయలే నోళ్ళు, ఇక ప్రజల మీద దాడి జరిగితే మీరేం చేయగలరనే ప్రశ్న వస్తుంది.

అదే సమయంలో దాడికి పాల్పడింది దళితులు కాబట్టి వారిపై కఠిన వైఖరి అవలంభిస్తే పాలకపక్షానికి లేనిపోని సమస్యలు. ఇక వచ్చేది ఎలక్షన్‌ సీజన్‌. కులాల పరంగా ఓట్ల వేట మొదలవు తుంది. ఈ సంఘటనపై పోలీసులు మరీ కఠినంగా వ్యవహరిస్తే తమకు దళితుల నుండి వ్యతిరేకత వస్తుందనే ఆందోళన అధికార తెలుగుదేశంలో వుంది. మొత్తానికి రాపూరు సంఘటన అటు పోలీసు ప్రతిష్టకు, ఇటు అధికార పార్టీ ఓట్ల రాజ కీయానికి సవాల్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here