Home రాష్ట్రీయ వార్తలు పోలింగ్‌ ముగిసింది.. రూలింగ్‌ మిగిలింది

పోలింగ్‌ ముగిసింది.. రూలింగ్‌ మిగిలింది

నరాలు తెగే ఉత్కంఠ… చావో రేవో తేల్చుకునే తరుణం. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరీ సమరం… ఇద్దరు ప్రధాన నాయకులకు ఫైనల్‌ మ్యాచ్‌లాంటి పరిస్థితి. గెలిచిన వాళ్ళు ఫీల్డ్‌లో నిలబడడం… ఓడిన వాళ్ళు తెరమరుగవడం… కళ్ళ ముందు ఈ స్థితి… నెల రోజులుగా ఎత్తులు… పైఎత్తులు… వ్యూహాలు, ప్రతి వ్యూహాలు… అలుపులేకుండా ప్రచార సభలు.. ఓటర్లపై విచ్చలవిడిగా వరాలు… ప్రభుత్వ సొమ్మునే పథకాల పేర్లతో ఓట్ల కొనుగోలుకు ఖర్చు చేయడం… అన్నింటికీ మించి ప్రజాపక్షం వహించాల్సిన మీడియా ఆయా పార్టీల ప్రచార సాధనాలుగా మారడం… అబ్బా ఒకటా… రెండా… ఈ ఎన్నికల్లో ఎన్ని వింతలు చూడాలో… అన్నీ చూశాం! రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో చూశాం..! విలువలకు సమాధి కట్టడం, డబ్బు, మద్యంకు పట్టం కట్టడం చూశాం… అనైతిక పొత్తులు చూశాం… వెన్నుపోట్లు చూశాం… అబద్దాల హామీలు చూశాం… ఇప్పుడు అందరూ కోరుకునేది ఒక్కటే… ఇట్లాంటి ఎలక్షన్‌లు ఇక రాకూడదు. అంత దరిద్రంగా మారాయి ఎన్నికలు. రాజకీయ నాయకులంటే జనానికి అసహ్యం పుట్టాలి. కాని రాజకీయ నాయకులకే అసహ్యం పుట్టేలా మారిపోయాయి ఎన్నికలు.

ఏదైతేనేం… అటు అధికార తెలుగుదేశంకు ఇటు ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి ఫైనల్‌ మ్యాచ్‌గా మారిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, అలాగే 25లోక్‌సభ స్థానాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలు అయిపోవడంతో ఒక యుద్ధం ముగిసినట్ల య్యింది. ప్రత్యక్ష యుద్ధాలలో అయితే విజేత ఎవరో, పరాజితులెవరో అక్కడే తేలిపోతుంది. కాని, ఇది ఎన్నికల యుద్ధం కాబట్టి ఈవిఎంలు తెరిచేదాకా విజేతల కోసం ఎదురుచూడక తప్పదు. రాష్ట్ర ప్రజల తీర్పు ఈవిఎంలలోకి వెళ్లిపోయింది. మే 23వ తేదీన ఏపి ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని సాగ నంపారు అన్నది తేలబోతుంది.

సమర్ధవంతంగా ఎన్నికల నిర్వహణ

అనేక ఆరోపణలు, ఫిర్యాదుల నడుమ రాష్ట్రంలో ఎన్నికల ఘట్టం సజావుగానే ముగిసిందనుకోవాలి. ఎన్నికలన్నాక చెదురుమదురు సంఘటనలు సహజమే! ఇక ఈ ఎన్నికల్లో పోలింగ్‌ 75.67 శాతం నమోదు కావడంపైనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ

పోలింగ్‌ శాతం ఎవరికి అనుకూలంగా వుంటుందన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా వున్నప్పుడు పోలింగ్‌ శాతం పెరుగుతుంటుంది. ఈసారి ఎన్నికల్లో ఓటును వేయా లనే చైతన్యం ప్రజల్లో బలంగా వచ్చింది. గతంలో ఓటింగ్‌ పట్ల ఆసక్తి చూపని వాళ్ళు కూడా ఈసారి ఓట్లు వేశారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులు కూడా ఈసారి పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు వచ్చి ఓట్లు వేయడం ఏ పార్టీకి అనుకూలం కానుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఓటర్లయిన యువత ఈ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం మరో విశేషం.

ఎవరి ధీమా వారిదే!

ఎన్నికల్లో గెలుపుపై అటు తెలుగుదేశం, ఇటు వైసిపిలు ధీమాగానే వున్నాయి. చంద్రబాబు పరిపా లనా అనుభవం, చివర్లో ఇచ్చిన పసుపు – కుంకుమ, అన్నదాత సుఖీభవ డబ్బులు తమను గెలిపిస్తాయని, 90 నుండి 95 సీట్లతో తమదే అధికారమని టీడీపీ నాయకులు ఆత్మవిశ్వాసంతో వున్నారు.

ఇక వైసిపి శ్రేణుల్లో అయితే గెలిచామన్న ధీమానే కనపడుతుంది. 2014 ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాని కృష్ణానది ఉత్తరం వైపు ఆరు జిల్లాల్లో మంచి ఫలితాలు వస్తాయని, అలాగే కృష్ణానదికి దక్షిణం వైపు ఏడు జిల్లాల్లో 2014 ఎన్నికల్లో వచ్చిన సీట్లకంటే ఇంకా పెరుగుతాయనే ఆత్మవిశ్వాసం ఆ పార్టీలో కనిపి స్తోంది. ఈ ఎన్నికల్లో జగన్‌కు తోడుగా వై.యస్‌. విజయమ్మ, షర్మిలలు చేసిన ప్రచారం కూడా ఓటర్లపై ప్రభావం చూపింది. ముఖ్యంగా చంద్రబాబు ఐదేళ్ళ పాలనలోని వైఫల్యాలు, ప్రత్యేకహోదాకు పాడెకట్టడం, అవినీతి అక్రమాలు, టిడిపి నేతల దౌర్జన్యాలు, మైనింగ్‌ మాఫియా భూ భాగోతాలు… ఇవన్నీ కూడా తెలుగు దేశం ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చాయని, మాట ఇస్తే నిలబడే నైజం, ప్రత్యేకహోదా విషయంలో చేస్తున్న పోరాటం, బిసి డిక్లరేషన్‌, ఆయా వర్గాలకు సీట్లలో పెద్దపీట వేయడం… ఇత్యాది కారణాలన్నీ రాష్ట్రంలో మెజార్టీ వర్గాల ప్రజలు జగన్‌ వైపుకు మొగ్గు చూప డానికి కారణమని, కాబట్టి వైసిపి గెలుపు ఖాయమై పోయిందని ఆ పార్టీ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.

ఎన్నికల్లో ఒక దశ మాత్రమే దాటాం. ఇంకా ఆరు విడతల పోలింగ్‌ జరగాల్సి వుంది. మే 23న ఈవిఎంలు తెరుస్తారు. దేశానికి రాజెవరో ఆరోజే తెలుస్తుంది. దాంతోపాటే ఆంధ్రా కింగ్‌ ఎవరో కూడా తేలబోతుంది. ఈ 40రోజులు ఇక నాయకులు, జనం టెన్షన్‌ భరించక తప్పదు.

అక్కడక్కడా హింస… చెదురుమదురు సంఘటనలు

రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పరస్పరం జరిగిన దాడుల్లో అనంతపురం జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో ఒకరు వైసిపి కార్యకర్తలు మరణించారు. నర్సారావుపేటలో రిగ్గింగ్‌కు పాల్పడిన స్పీకర్‌, టిడిపి అభ్యర్థి కోడెల శివప్రసాద్‌ను స్థానిక వైసిపి కార్యకర్తలు పట్టుకుని కొట్టారు. పలుచోట్ల పోటీలో వున్న అభ్యర్థులపై ప్రత్యర్థులు దాడులు చేశారు.

వరదలై పారిన మద్యం… అడ్డుకట్టలేని నోట్ల ప్రవాహం

రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగనంతటి ఖరీదైన ఎలక్షన్‌ ఇప్పుడు జరిగింది. అన్ని పార్టీ అభ్యర్థుల ఖర్చు కలిపితే వేల కోట్లలోనే వున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ ఖర్చు నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల స్థాయిని బట్టి ఓటు రేటు వెయ్యి నుండి పదివేల రూపాయల దాకా పలికింది. పోలీసులు ఎన్ని చెక్‌పోస్టులు పెట్టి ఎంతగా తనిఖీలు చేసినా వీళ్ళు పట్టుకున్నది గోరంత… తరలిపోయింది కొండంతగా వుంది. ఇక మద్యం అయితే ఐఎంఎల్‌ డిపోలే సప్లై చేయలేనంతగా పరవళ్ళు తొక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here