Home సంపాదకీయం పైశాచికత్వానికి పరాకాష్ట

పైశాచికత్వానికి పరాకాష్ట

మన దేశంలో చట్టాలు ఎంత కట్టుదిట్టంగా ఉన్నా, పోలీసు-న్యాయవ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నా.. మరోవైపు నేరస్తులు.. కామాంధులు మాత్రం పెట్రేగిపోతూనే ఉన్నారు. నేరస్తులకు ఎంత కఠిన శిక్షలు వేస్తున్నా..మరింతమంది రాక్షసులు పుట్టుకొస్తూనే ఉన్నారు. కనీసం మానవత్వం కానీ, జాలీ-దయ అన్నది కానీ కలికానికి కూడా కనిపించని పైశాచిక ప్రవృత్తితో అమాయకులను తమ క్రూరత్వాలకి బలితీసుకుంటూనే ఉన్నారు. చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఇటీవల జరిగిన దారుణం సభ్యప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మనుషులన్న ప్రతివారినీ కన్నీరు పెట్టించింది. జంతువులకున్న కనీస జాలి.. దయ కూడా లేని కొంతమంది మగపిశాచులు అభం శుభం తెలియని ఓ పదకొండేళ్ళ దివ్యాంగురాలిపై నెలలతరబడి అఘాయిత్యం చేస్తూ తమ పైశాచికత్వాన్ని కొనసాగించారు.

ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగడంతో వారి ఆట కట్టైంది. పోలీసులు అక్కడి మీడియాకు తెలిపిన వివరాల మేరకు… చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నెలల తరబడి ఈ అకృత్యం కొనసాగింది. ఆ అపార్ట్‌ మెంట్‌లో నివాసం ఉంటున్న ఆ బాలిక స్కూల్‌కు వెళ్ళేందుకు రోజూ లిఫ్ట్‌లో వచ్చి వెళ్తుండేది. వినికిడి సమస్య ఉన్న ఆ బాలిక అసహాయతను లిఫ్ట్‌ ఆపరేటర్‌గా ఉన్న ఓ 66 ఏళ్ళ వృద్ధ కామపిశాచి అవకాశంగా మలుచుకున్నాడు. ఆ చిన్నారికి లేనిపోని మాయమాటలు చెప్పి లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని అపార్ట్‌ మెంట్‌లో ఇతర సిబ్బందికి కూడా చెప్పాడు. అంతే, ఇక అందరూ కూడబలుక్కుని, అక్కడున్న ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులతో సహా అందరూ కలసి ఆ బాలికపై అకృత్యానికి పథకం వేసుకున్నారు. బాలికను ఓ గదిలోకి బలవంతంగా తీసుకెళ్ళి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలన్నీ వారు వీడియో తీసి ఆ బాలికకు చూపించి తమ మాట వినకపోతే ఆ వీడియోలను అందరికీ చూపుతామని బెదిరించడం, ఆ తర్వాత శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేయడం వంటి అఘాయిత్యాలకు నిందితులు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. చివరికి ఆ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు కూడా ఈ కామపిశాచాలతో చేరిపోయి, వారు కూడా ఆ బాలికను తమ పశుప్రవృత్తితో చిదిమేశారు. ఆ బాలిక సోదరి వచ్చి పరిస్థితి తెలుసుకుని తల్లిదండ్రులకు చెప్పడం.. పోలీసులు రంగంలోకి దిగి ఆ కామపిశాచాలను అరెస్ట్‌ చేయడంతో ఈ దారుణం ఇప్పటికి వెలుగులోకి వచ్చింది. ఈ ఘోరమైన దుర్ఘటన చెన్నైను కలచివేసింది. సభ్య సమాజాన్ని కంటతడిపెట్టించింది. అక్కడున్న ప్రైవేట్‌ సెక్యూరిటీగార్డుల నుంచి ప్లంబర్ల వరకు, చివరికి ఎలక్ట్రీషియన్‌ దాకా, ఆ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న 22మంది నరరూప కామపిశాచాలు నిత్యం ఆ బాలికపై ఎగబడడం, తమ పశుప్రవృత్తిని తీర్చుకోవడం… ఏడు నెలలుగా సాగిన పైశాచికక్రీడతో ఆ బాలికను హింసించడం చూస్తే మానవత్వం అన్నది మంటకలిసిపోయిందంటూ అక్కడున్న ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అరవకుండా చేయడం, ఆ బాలిక నగ్నచిత్రాలను, వీడియోలు తీయడం..ఆ విషయం ఎవరికైనా చెప్తే వాటిని బయటపెడతామని బెదిరించడం, లేదంటే చంపుతామని భయపెట్టడం వంటి ఘాతుకాలతో ఆ మగమృగాలు తమ అకృత్యాన్ని ఏడునెలల పాటు కొనసాగించాయంటే వారు అసలు మనుషులేనా?… ఆ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సిబ్బందే అమాయక బాలికపై ఇంతటి ఘోరమైన అకృత్యానికి పాల్పడ్డారంటే ఏమనుకోవాలి?… ప్రైవేట్‌ సెక్యూరిటీ పేరుతో అక్కడ పనిచేస్తున్న మరిన్ని మృగాలు కూడా ఈ అకృత్యాలకు పాల్పడ్డాయంటే.. ఇక ఎవరిని నమ్మాలి?.. ఆ బాలికకు మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం, శీతల పానీయాల్లో మత్తుపదార్ధాలు కలిపి ఇవ్వడం, పొడిరూపంలో ఉన్న మాదక ద్రవ్యాలను ముక్కుతో పీల్చేలా చేసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ పిశాచుల పైశాచిక ప్రవృత్తిని అక్కడి పోలీసులు వెల్లడించారు. బాలికపై దారుణానికి పాల్పడుతూ వీడియోలు కూడా తీశారని, లిఫ్ట్‌ ఆపరేటర్‌ మొదటగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడగా, ఆ తర్వాత పలువురు అతనితో జతకట్టి ఏడు నెలలపాటు ఆ బాలికను లైంగికవేధింపులకు, హింసకు గురిచేశారని పోలీసులు పేర్కొంటున్నారు. ఆ కామాంధుల అఘాయిత్యానికి ఆ బాలిక ఎంత కకావికలమైందో ఊహించుకుంటేనే ఎవరికైనా వళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ సంఘటన విని సభ్యసమాజం చలించిపోయింది. ఈ కామపిశాచుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఘోషిస్తోంది.

కాగా, తమ బిడ్డపై జరిగిన పాశవికత్వాన్ని తలచు కుంటూ బాలిక తల్లిదండ్రులు గుండెలు బాదు కుంటూ సొమ్మసిల్లిపోతున్నారు. గుండెలవిసేలా కంటికి మింటికీ ఏకధారగా రోదిస్తున్నారు. వారి వేదన ఎవరు తీర్చగలరు?..పిశాచాలకన్నా హేయంగా ప్రవర్తించిన ఆ మృగాల్లో 18 మందిని ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు. మిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్ని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చినప్పుడు అక్కడున్న న్యాయవాదులు కూడా నిందితుల పట్ల కోపోద్రిక్తులై దాడికి దిగారంటే సభ్యసమాజం ఎంతగా ఈ ఘటన పట్ల మండిపడుతోందో తెలుస్తుంది. లాయర్లు ఎవరూ ఆ కామపిశాచాల తరఫున వాదించకూడదని లాయర్ల సంఘం తీర్మానించుకుంది. నిందితుల్లో యువకుల నుంచి వృద్ధుడి వరకు మొత్తం 24 మంది ఉన్నారని, వారిలో 18 మందిని అరెస్ట్‌ చేశామని, మిగిలినవారి కోసం గాలిస్తున్నామని, ఆపార్ట్‌మెంట్‌లోని సిసి ఫుటేజ్‌ల ద్వారా పూర్తి సమాచారం కోసం ఆరాతీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఆ 18 మంది నిందితులకు మహిళా కోర్టు ఈ నెల 31 దాకా రిమాండ్‌ విధించింది.

ఏదేమైనా.. పైశాచికత్వానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటనలోని నిందితులను ఎంత త్వరగా శిక్షిస్తే సమాజానికి అంత మంచిది. ఆ శిక్ష కూడా ఇక ఇలాంటి ఘటనలు దేశంలో ఇక ఎక్కడా పునరావృతం కాకుండా ఉండేలా.. మరింత కఠినంగా.. కఠినాతి కఠినంగా ఉంటే తప్ప ఇలాంటి ఘోరాలు.. దారుణాలు ఆగవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here